logo

గడువులోగా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో అర్జీలు అందించినా పరిష్కారం కాకపోవడంతో జిల్లా పాలనాధికారికి తమ సమస్యను విన్నవించాలని స్పందన కార్యక్రమానికి అర్జీదారులు తరలివచ్చారు.

Updated : 30 May 2023 05:49 IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో అర్జీలు అందించినా పరిష్కారం కాకపోవడంతో జిల్లా పాలనాధికారికి తమ సమస్యను విన్నవించాలని స్పందన కార్యక్రమానికి అర్జీదారులు తరలివచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భూమి, బీమా, గ్రామంలో నెలకొన్న డ్రెయినేజీ, బియ్యం కార్డు.. ఇలా వివిధ రకాల అంశాలపై 145 అర్జీలు అందించారు. కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులను నిర్ణీత గడువు లోగా నాణ్యంగా పరిష్కరించాలన్నారు. సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి మాట్లాడుతూ ఫిర్యాదుదారు సంతృప్తి పడేలా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న వాటిపై సమీక్షించి సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఆర్‌వో కె.చంద్రశేఖర్‌రావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ లలిత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

డ్రెయినేజీ శుభ్రం చేయకుండానే చేశామంటున్నారు

పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అధికారులకు వినతిపత్రం అందించాం. దీనిపై డివిజన్‌ స్థాయి అధికారులు డ్రెయినేజీ శుభ్రం చేయించకుండానే చేశారని నివేదిక ఇచ్చారని ఎ.మల్లికార్జునరావు స్పందనలో అర్జీ అందించారు. గ్రామంలో డ్రెయినేజీ వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి డ్రెయినేజీని శుభ్రం చేయించాలని కోరారు.

బీమా కోసం నాలుగేళ్లుగా ఎదురుచూపు: కడియం లూర్దు మేరీ, గౌతమీనగర్‌, గుంటూరు

2019లో కుమారుడు సుధాకర్‌ పెయింటింగ్‌ పని చేస్తూ విద్యుదాఘాతంతో చనిపోయాడు. అప్పుడు ప్రభుత్వం తరఫున వైఎస్సార్‌ బీమా వస్తుందని చెప్పారు. మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బీమా అందలేదు. కుమారుడు చనిపోయిన బాధతో కార్యాలయాలకు వెళ్తున్నా కనీసం అధికారులు స్పందించడం లేదు. గతంలో పని చేసిన ఓ అధికారి తమ వద్ద వివరాలన్నీ సేకరించి, ఇప్పుడు అసలు అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్‌కు కూడా స్పందించడం లేదు. అధికారులు స్పందించి వైఎస్‌ఆర్‌ బీమా అందించాలి.

పొలం కొనుగోలు పేరుతో మోసం

మంగళగిరి మండలం చినవడ్లపూడిలో గతేడాది డిసెంబర్‌లో ఎకరం పొలాన్ని జి.సాయిలక్ష్మి, అశోక్‌ దంపతుల నుంచి కొనుగోలు చేశానని, అయితే వారు ఆ పొలాన్ని ముందుగానే మరొకరికి అమ్మి తనను మోసం చేశారని బాధితుడు ఎం.వెంకటేశ్వరరావు వాపోయారు. ఈమేరకు సోమవారం స్పందన కార్యక్రమంలో అధికారులకు వివరించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చి చినవడ్లపూడి సర్వేనెంబర్‌ 75/2, 74/3లోని ఎకరం పొలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సదరు దంపతులు తనను మోసగించారని, ఇప్పుడు మాట్లాడదామన్నా వారు స్పందించడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి సదరు భూమికి సంబంధించి అడంగల్‌, పట్టాదారు పాసుపుస్తకాలను మంజూరు చేయాలని కోరారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని