logo

వారికిది మామూలే

గుంటూరు నగరంలో ఈ-ఆటోలు వినియోగంలోకి తేకుండా మూలపెట్టేశారు. పర్యవసానంగా అవి ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ దుమ్ముధూళి కొట్టుకుపోయి  నామరూపాలు కోల్పోతున్నాయి.

Updated : 30 May 2023 06:21 IST

రూ.12కోట్ల వాహనాలు షెడ్‌కే పరిమితం
సీఎం ప్రారంభించాలని ఎదురుచూపులు

కేవీపీ కాలనీలో వాహన షెడ్‌లో ఆరుబయటే వందలాది ఈ-ఆటోలు

ఈనాడు, అమరావతి: గుంటూరు నగరంలో ఈ-ఆటోలు వినియోగంలోకి తేకుండా మూలపెట్టేశారు. పర్యవసానంగా అవి ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ దుమ్ముధూళి కొట్టుకుపోయి  నామరూపాలు కోల్పోతున్నాయి. నాలుగైదు నెలలుగా కేవీపీ కాలనీలోని వాహన షెడ్‌కే అవి పరిమితమయ్యాయి. గతేడాది నవంబరులో 220 ఈ-ఆటోలు (ఎలక్ట్రికల్‌ ఆటోస్‌) కొనుగోలు చేశారు. వాటికి రూ.12 కోట్లు వెచ్చించారు. వాటి ప్రారంభానికి సీఎం అపాయింట్‌మెంట్‌ దొరక్క ఎప్పటికప్పుడు వాటి వినియోగాన్ని వాయిదా వేస్తున్నారు. వాటిని ఇంకెన్నాళ్లు మూలపెడతారనే విమర్శలు వస్తున్నా అధికారులు, కౌన్సిల్‌ మాత్రం కిమ్మనడం లేదు.

కాలుష్య రహిత నగరమే లక్ష్యంగా...

కాలుష్య రహిత నగరాలే ధ్యేయంగా సాధ్యమైనంత వరకు బ్యాటరీ సాయంతో నడిపే ఎలక్ట్రికల్‌ వాహనాలు వినియోగించాలని ఐక్యరాజ్య సమితికి చెందిన యునెడో సంస్థ సూచిస్తోంది. నగరంలోని 207 సచివాలయాల పరిధిలో ఈ-ఆటోల కొనుగోలుకు యునెడో రూ.8కోట్లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. మిగిలిన రూ.4కోట్లు నగరపాలక జనరల్‌ ఫండ్స్‌ నుంచి వెచ్చించారు. ఇప్పటికే వాహనాలు సమకూర్చుకున్నా వినియోగంలో పెట్టలేదు. ఈ వాహనాలకు ఇంధనం అవసరం లేదు. కేవలం బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టుకుంటే చాలు వాహనాలు నడుస్తాయి. సంగంజాగర్లమూడి వద్ద ఉన్న నగరపాలక జలాశయంలో నీళ్లపై తేలాడే సోలార్‌ పలకల ద్వారా విద్యుత్తు సమకూర్చుకునేలా సోలార్‌ యూనిట్‌ నెలకొల్పారు. ఒక్కో సచివాలయం పరిధిలో ఒక ఆటోను నడపటానికి అవసరమైన వాహన డ్రైవర్లు, చెత్త సేకరణకు పారిశుద్ధ్య సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. కానీ వాహనాలు మాత్రం ఇంకా ప్రారంభించలేదు. ప్రస్తుతం ట్రాక్టర్లు, డీసీఎం వాహనాలతో నగరంలో చెత్త సేకరణ చేస్తున్నారు. ఆ భారీ వాహనాలు కొన్ని వీధుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాలు రావడం లేదని చెప్పి ఇంటింటా వెలువడే చెత్తను రోడ్లు, మురుగు కాల్వల వెంబడి పడేస్తున్నారు.దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఇంటికి, వీధికి వాహనం వెళ్లి చెత్త సేకరించుకొచ్చేలా చిన్న సైజులో ప్రత్యేకంగా ఈ-ఆటోలను రూపొందించారు.

ఇంధన వ్యయాలు ఆదా...

ఈ వాహనాల వినియోగంతో కాలుష్యం తగ్గుతుంది. ఇంధన వ్యయాలు ఏటా రూ.కోట్లలో ఆదా అవుతుంది. ఇన్ని ప్రయోజనాలతో ఇమిడి ఉన్న ఈ వాహనాలను సీఎం చేతులమీదుగా ప్రారంభించాలని చెప్పి నెలల తరబడి పక్కన పెట్టడం ఏమిటి? మేయర్‌, కలెక్టర్‌ వంటి ఉన్నతాధికారులను పిలిచి వాటిని ప్రారంభిస్తే  ఇంధన వ్యయాలు ఆదా అయ్యేవని నగరపాలక వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చెత్తసేకరణ వాహనాలతో పాటు అధికారులు వినియోగించే వాహనాల కోసం నెలకు రూ.50 లక్షలు ఇంధన బిల్లులే అవుతున్నాయి.

కౌన్సిల్‌లో అడిగితే.. రిజిస్ట్రేషన్‌ కాలేదని...

ఆటోలు వినియోగించకుండా పక్కన పెట్టిన విషయమై గతంలో కొందరు కార్పొరేటర్లు కౌన్సిల్‌లో ప్రశ్నించారు. అప్పట్లో ఆ వాహనాలు రిజిస్ట్రేషన్‌ కాలేదని, అందుకే వినియోగించడం లేదని ఇంజినీరింగ్‌ అధికారులు బదులిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వాటి రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. అయినా ఇప్పటి వరకు వాటిని వినియోగంలోకి తేలేదు. ప్రయోగాత్మకంగా కొన్ని వాహనాలు నడుపుతున్నాం. చెత్త సేకరణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని మిగిలినవి కూడా సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చే విషయమై చర్యలు తీసుకుంటామని నగరపాలక ఎస్‌ఈ పీవీవీ భాస్కర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. జూన్‌ 2న నగరంలో సీఎం కార్యక్రమం ఉందని, ఆయన చేతులమీదుగా వాహనాలు ప్రారంభించేలా కలెక్టర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని