logo

రాజధానిలో ఆగని మట్టి దందా

రాజధాని భూముల విధ్వంసం యధేచ్ఛగా కొనసాగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమార్కులు మట్టి తవ్వి తరలించేస్తున్నారు. ఆర్‌-5 జోన్‌ లేఔట్‌ పనులకు రక్షణగా వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

Published : 30 May 2023 05:22 IST

దుండగులు మట్టి తవ్వుకెళ్లిన ప్రాంతం

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని భూముల విధ్వంసం యధేచ్ఛగా కొనసాగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమార్కులు మట్టి తవ్వి తరలించేస్తున్నారు. ఆర్‌-5 జోన్‌ లేఔట్‌ పనులకు రక్షణగా వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. వాళ్ల కళ్లుగప్పి దుండగులు తాజాగా మందడం పరిధిలోని భూముల్లో మట్టి తవ్వి తరలిస్తున్నారు.

వాకింగ్‌ వచ్చిన రైతును చూసి పరార్‌... సోమవారం ఉదయం వేకువజామున మందడం గ్రామానికి చెందిన ఓ రైతు వాకింగ్‌కు వెళ్లారు. దుండగులు మట్టి తవ్వుతుండటాన్ని చూశారు. ఆయన్ను చూసి దుండగులు యంత్రాలు, లారీల లైట్లు ఆపివేశారు. దీంతో సదరు రైతు మందడం గ్రామంలోని మరికొందరికి ఫోన్లు చేసి విషయం చెప్పారు. వారు వచ్చే సమయానికి కొన్ని వాహనాలు ఉద్దండరాయునిపాలెం వైపు, మరికొన్ని ఉండవల్లి వైపు వెళ్లిపోయాయి. మందడం గ్రామానికి చెందిన సుమారు మూడు ఎకరాల జరీబు రెసిడెన్సియల్‌ ప్లాట్లలో దొంగలు మట్టి తవ్వి తరలించారని రైతులు తెలిపారు. కట్టా భావన, కట్టా రామచంద్రరావు, బొర్రా వెంకాయమ్మ, పునుకొల్లు లతా భవాని, తాడికొండ కీర్తి, రాయనకుల రాణి తదితరులకు చెందిన వెయ్యి గజాల రెసిడెన్షియల్‌ ప్లాట్లలోనూ మట్టి తవ్వకాలు జరిగాయని రైతులు పేర్కొన్నారు.

అర్ధరాత్రి మట్టి తవ్వకాల అడ్డగింత... సోమవారం అర్ధరాత్రి మందడంలోకి మళ్లీ మట్టి దొంగలు వచ్చారని తెలుసుకున్న రైతులు, గ్రామస్థులు ఆ ప్రాంతానికి చేరుకొని టిప్పర్లను అడ్డుకున్నారు. వాటికి తమ ద్విచక్ర వాహనాలను అడ్డుగా పెట్టారు. డ్రైవర్లను ప్రశ్నిస్తుండగా అందరినీ భయభ్రాంతులకు గురిచేసి చిల్లకంప చెట్ల మీదుగా 8 టిప్పర్లు, జేసీబీ యంత్రాలను పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. తుళ్లూరు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు.

నేడు నిరసనలు... మందడం గ్రామ పరిధిలో దుండగులు మట్టి తవ్వకాలు చేసిన ప్రాంతంలో మంగళవారం నిరసనలకు అమరావతి ఐకాస నాయకులు పిలుపునిచ్చారు.

మందడం పరిధిలో రైతులు అడ్డుకున్న టిప్పరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని