logo

రూ.3 కోట్ల విలువైన పొలం ఆక్రమించారయ్యా..

కొవిడ్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాలంలో మా పొలాన్ని కొంతమంది ఆక్రమించారని, అదేమని అడిగితే వారు కొనుగోలు చేశామంటున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే..

Published : 30 May 2023 05:22 IST

ఎస్పీ కార్యాలయంలో పండుటాకుల ఫిర్యాదు

అమ్మిరెడ్డి, అన్నపూర్ణమ్మ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: కొవిడ్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాలంలో మా పొలాన్ని కొంతమంది ఆక్రమించారని, అదేమని అడిగితే వారు కొనుగోలు చేశామంటున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మేమే దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నామంటూ మాపైనే కేసులు ఉన్నాయంటున్నారని,  రెండేళ్లుగా తిరుగుతున్నా మా గోడు ఆలకించేవారే లేరని అంకిరెడ్డిపాలెంకు చెందిన వృద్ధ దంపతులు అమ్మిరెడ్డి, అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. వారి కథనం ప్రకారం..

‘మాకు ఎకరం 40 సెంట్ల పొలం ఉంది. దాని విలువ ప్రస్తుతం రూ.3 కోట్ల వరకు ఉంటుంది. పత్తి, మిరప, పొగాకు తదితర పంటలు సాగుచేసుకుంటూ జీవిస్తున్నాం. 2021లో అమ్మిరెడ్డికి కొవిడ్‌ రావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పొలం వద్దకు వెళితే గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లుపాతడంతో వాటిని తొలగించాం. ఆ విషయం తెలుసుకొని పలువురు ఆ పొలం తమదని తాము కొనుగోలు చేసి రిజిస్టర్‌ చేయించుకున్నామన్నారు. అది మా పొలం అని చెపితే పట్టించుకోవడం లేదు. ఎవరో నకిలీ పత్రాలతో వాళ్లకు విక్రయించినట్లు ఉన్నారు. ఈ విషయం తేల్చమని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశా. 85 ఏళ్ల వయసులో రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మేమే ఆ పొలం కొనుగోలు చేసినవారిని బెదిరిస్తున్నామంటూ మాపైనే రెండు కేసులు ఉన్నాయని సమాధానమిస్తున్నారు. మాకు పాప, బాబు ఉన్నారు. వారికి వివాహాలు చేశాం. వాళ్లు పట్టించుకోపోవడంతో తమకు న్యాయం చేయాలని పోలీసులకు కోరడానికి ఇక్కడకు వచ్చాము’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని