logo

ప్రభుత్వ భూములమ్మినా పట్టించుకోరే

వినుకొండ పట్టణానికి సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న సుమారు 13.95 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమి క్రయ, విక్రయాలు జరిగాయి. ఏపీ అసైన్డ్‌ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌) 1977 ప్రకారం ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్‌ చేయడం చట్టవిరుద్ధం.

Published : 30 May 2023 05:37 IST

వినుకొండలో భూ విక్రయాలపై చర్యలు తీసుకోవాలన్నా లోకాయుక్త
ఆర్నెళ్లయినా అధికారుల చర్యలు శూన్యం

క్రయ, విక్రయాలు జరిగిన అసైన్డ్‌ భూమి ఇదే..

వినుకొండ, న్యూస్‌టుడే : వినుకొండ పట్టణానికి సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న సుమారు 13.95 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమి క్రయ, విక్రయాలు జరిగాయి. ఏపీ అసైన్డ్‌ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌) 1977 ప్రకారం ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్‌ చేయడం చట్టవిరుద్ధం. ఈ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి తిరిగి భూమి స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్‌ శివశంకర్‌ లోకాయుక్తకు లిఖితపూర్వకంగా నివేదించారు. ఆర్నెళ్లయినా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యం. కనీసం ఆ భూమిలో ఇప్పటి వరకు అధికారులు బోర్డులు ఏర్పాటు చేయకపోగా స్థిరాస్తి వ్యాపారులు నేల చదును చేస్తుంటే చేష్టలుడిగి చూస్తున్నారు.

వినుకొండ మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో వివిధ సర్వే నంబర్లలోని అసైన్డ్‌ భూములు చట్టవిరుద్ధంగా క్రయ, విక్రయాలు జరిగాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ హయత్‌నగర్‌కు చెందిన టి.సుబ్బారెడ్డి రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా అధికారులకు నోటీసులు జారీ కావడంతో అప్పటి తహశీల్దార్‌ జి.అనిల్‌కుమార్‌, ఆర్డీఓ శేషిరెడ్డి నివేదికలను అనుసరించి కలెక్టర్‌  శివశంకర్‌ లోకాయుక్తకు సమాధానం పంపారు. మొత్తం 13.95 ఎకరాలు చుక్కల భూమితో పాటు కుంట, రోడ్డు తదితరులున్నాయని పేర్కొన్నారు. 1954 తర్వాత వీటిని అసైన్డ్‌ చేసినందున వాటి క్రయ, విక్రయాలు చెల్లవని తెలిపారు. ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ప్రభుత్వ భూములను రక్షిస్తామని నివేదికలో వివరించారు.

చర్యలు ఏవీ?: జాతీయ రహదారి పక్కనుండటంతో ఈ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రూ.లక్షల్లో ఉన్న భూమి రూ.కోట్లు పలుకుతోంది. దీంతో స్థిరాస్తి వ్యాపారులు రంగంలోకి దిగి కొన్నారు. గతంలో ఈ భూమిని కొన్న వ్యాపారులు వెంచర్‌ వేస్తే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వ భూములను ఎలా అమ్ముతారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి తహశీల్దార్‌ సైతం అందులో బోర్డు పెట్టించి క్రయ, విక్రయాలు చేయొద్దని హెచ్చరించారు. తర్వాత లోకాయుక్తలో కేసు నమోదు వ్యవహారం బయటపడటం, అధికారులు నివేదిక ఇవ్వడం వంటివి జరిగాయి. ఈసారి అధికార అండతో భూములు కొనడంతో అడ్డంకులు లేకుండా వ్యవహారం నడుస్తోంది. లోకాయుక్తకు నివేదిక ఇచ్చిన అధికారులు ఇప్పుడు నేల చదును చేస్తుంటే చర్యలు తీసుకోవడం లేదు. ఈ పరిణామాలను గమనిస్తున్న స్థానికులు అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా అంటూ ముక్కున వేలుకుంటున్నారు. ఈవిషయమై వినుకొండ తహశీల్దారు కిరణ్‌కుమార్‌ని ప్రశ్నించగా, గతంలో మధ్యంతర నివేదిక సమర్పించామని, అన్ని పరిశీలించి త్వరలో పూర్తి వివరాలతో లోకాయుక్తకు నివేదిక ఇస్తామన్నారు. భూములను రక్షిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని