logo

మిద్దెతోటలో ప్రకృతి పరవశం

కొలనులు, చెరువుల్లోనే కనిపించే పువ్వులు ఆ ఇంటి మిద్దెపై వికసిస్తున్నాయి. విభిన్న రంగుల్లో చూపరులకు కనువిందు చేస్తున్నాయి.

Updated : 31 May 2023 06:26 IST

విభిన్న రంగులతో పుష్పాల కనువిందు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: కొలనులు, చెరువుల్లోనే కనిపించే పువ్వులు ఆ ఇంటి మిద్దెపై వికసిస్తున్నాయి. విభిన్న రంగుల్లో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. తెనాలి పట్టణ చినరావూరుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్‌ పర్యావరణ ప్రేమికుడు. ఆయన కొన్నేళ్లుగా తన ఇంటి ఆవరణ, డాబా పై భాగాలను విభిన్న మొక్కలను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే సుమారు రెండేళ్ల కిందట నీటిలో పెరిగే కలువ, తామర పూలను కూడా మిద్దె తోటలో పెంచుకోవచ్చని తెలుసుకుని నిపుణుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాలతో పాటు కేరళ నుంచి రంగురంగుల కొలను పుష్పాల మొక్కలు తెప్పించుకుని వాటి పెంపకం ప్రారంభించారు. టబ్బుల కింది భాగాల్లో నిపుణులు సూచించిన మేరకు మట్టిని పోసి, అటుపై నీటిని నింపి కృత్రిమ కొలనులు సృష్టించి ఆయా మొక్కలను పెంచారు. వాటి ద్వారా కొత్త మొక్కలను కూడా తయారు చేస్తున్నారు. వేసవి కాలం ప్రతి రోజూ టబ్బుల్లో కొంత నీటిని చేర్చటం, పూలు రావడం మొదలు కాగానే 15 రోజులకోమారు ప్రతి టబ్బులో 5 గ్రాముల వంతున డీఏపీ కానీ ఎన్‌పీకే వంటి ఎరువులు వేస్తున్నారు. ప్రతి నెలా నీటిని మార్చటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రకృతి పూల అందాలను తమ ఇళ్లలో ఆవిష్కరించుకోవచ్చని కృష్ణదేవ్‌ వివరించారు. నిర్వహణపరంగా తన భార్య నిర్మల భాగస్వామ్యమే ఎక్కువని, ప్రతి రోజూ కనీసం రెండు గంటలపాటు వీటి పర్యవేక్షణలో గడపాలన్నారు. తమ బంధుమిత్రులకు ఈ వాటర్‌ లిల్లీల పెంపకం గురించి తెలియచేశామని, మొక్కలు కూడా ఇచ్చామని చాలా మంది పెంచుకుంటున్నారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని