logo

బదిలీలలు!

బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారు. రేషనలైజేషన్‌, రీ అపోర్షన్‌మెంట్‌కు గురైన టీచర్లు సర్వీస్‌ పాయింట్లు ఇష్టానుసారం వేసుకుని దరఖాస్తులు సమర్పించారు.

Published : 31 May 2023 05:58 IST

గుంటూరు జిల్లా విద్యా శాఖ కార్యాలయం

ఈనాడు, అమరావతి: బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారు. రేషనలైజేషన్‌, రీ అపోర్షన్‌మెంట్‌కు గురైన టీచర్లు సర్వీస్‌ పాయింట్లు ఇష్టానుసారం వేసుకుని దరఖాస్తులు సమర్పించారు. బదిలీల సీనియారిటీ జాబితాలో ముందుండాలని ఎవరికివారు అక్రమాలకు పాల్పడ్డారు. అసలు ఈ పాయింట్ల కేటాయింపుపై పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు, సర్క్యులర్లు, ఉత్తర్వుల్లో సరైన స్పష్టత ఇవ్వకపోవడం కూడా వారు అడ్డదారులు తొక్కడానికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తుల గడువు ముగియడంతో ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితా తయారు చేసి దాన్ని సీఎస్‌ఈ వెబ్‌సైట్లో పెట్టారు. అందులో కొందరి టీచర్ల లీలలు బయటపడ్డాయి.

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో అన్ని క్యాడర్లలో కలిపి 5767 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయో కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(సీఎస్‌ఈ) వెబ్‌సైట్లో పెట్టి వీటిల్లో ఏమైనా తప్పులున్నా.. తేడాలున్నా, పాయింట్ల కేటాయింపులో పారదర్శకత లోపించినా, రావాల్సిన వాటి కన్నా ఎవరికైనా అధికంగా వచ్చినా అభ్యంతరాలు తెలియజేయాలని సాటి ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం ఒక్క రోజే ఉమ్మడి గుంటూరులో వందల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చి పడ్డాయి. వాటిని చూసి విద్యా శాఖ వర్గాలే ఆందోళన చెందాయి. ఇన్ని అభ్యంతరాలు రావడంతో తలలు పట్టుకుంటున్నారు. హెచ్‌ఎం, ఎంఈవో, డీవైఈఓలు ప్రొవిజనల్‌ జాబితా ఖరారు కాకుండానే ఈ అక్రమాలు గుర్తించి బాధ్యులైన టీచర్లతో తిరిగి దరఖాస్తులు చేయిస్తే ఇంత పెద్దమొత్తంలో అభ్యంతరాలకు ఆస్కారం ఉండేది కాదు. కానీ విద్యా శాఖ వర్గాలు ఆ పని చేయలేదు. బదిలీల ప్రక్రియను తేలిగ్గా తీసుకోవడం, వారి ప్రాథమిక పరిశీలన లేకుండానే ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితా రూపొందించడం వంటివి వారి నిర్వాకాన్ని తెలియజేస్తున్నాయి. ఎవరైతే ఇష్టానుసారం మార్కులు వేసుకున్నారో వారంతా అప్రమత్తమై వచ్చి తమకు తెలియజేయాలని, ఇందుకు భిన్నంగా తమ పరిశీలనలో ఎవరైనా అక్రమాలకు పాల్పడ్డారని గుర్తిస్తే వారిపై సీసీఏ రూల్స్‌ అనుసరించి చర్యలు తీసుకుంటామని గుంటూరు నోడల్‌ డీఈఓ మంగళవారం సాయంత్రం హెచ్‌ఎం, ఎంఈఓ, డీవైఈఓలకు సర్క్యులర్‌ పంపడం గమనార్హం.

* తెనాలి డివిజన్‌లోని పలు పాఠశాలల్లో విద్యార్థుల కన్నా ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారని ఆ మధ్య రేషనలైజేషన్‌ చేసి కొందరు టీచర్లను వేరే పాఠశాలకు పంపారు. అదే విధంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల పిల్లలను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ ప్రక్రియ వల్ల కొందరు టీచర్లకు ఆ పాఠశాలలో పని చేయడానికి వర్క్‌లోడ్‌ లేదని, వారిని పోస్టుతో సహా పిల్లలు ఉన్న చోటకు సర్దుబాటు చేశారు. వీరిని రీఅపోర్షన్‌మెంట్‌ కింద వచ్చిన టీచర్లుగా పరిగణించి వారికి గతంలో ఏదైతే స్కూల్లో పనిచేశారో ఆ స్కూల్‌ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అసలు మతలబు ఇక్కడే చోటుచేసుకుంది. గతంలో వారు ఎన్నాళ్లయితే ఒక పాఠశాలలో పనిచేశారో ఆ స్కూల్‌ సర్వీస్‌తో పాటు ప్రస్తుతం పనిచేసే పాఠశాల సర్వీస్‌ పాయింట్లు తమకు కలుస్తాయని దరఖాస్తులో పేర్కొన్నారు. దీని వల్ల చాలా మంది టీచర్లకు వాస్తవంగా రావాల్సిన పాయింట్ల కన్నా అధికంగా రావడంతో వారు సీనియారిటీ జాబితాలో ముందుకెళ్లారు.

* ఒక్క తెనాలి డివిజన్‌లోనే కాదు సత్తెనపల్లి, నరసరావుపేట, బాపట్ల డివిజన్లలోని పలు స్కూళ్లల్లో ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రొవిజనల్‌ జాబితాను ముందు పెట్టుకుని బాధ్యులైన ఎంఈఓ, డీవైఈఓలు ఈ సర్వీస్‌ పాయింట్లపై కుస్తీ పడుతున్నారు. కేటగిరీ పాయింట్లను కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా వేసుకున్నారని గుర్తించారు.

* 30 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తించే ప్రధాన నగరాల్లో ఏడాదికి ఒకటి, సబర్బన్‌ ప్రాంతాల్లో 2, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి 3 పాయింట్ల చొప్పున వారు పనిచేసిన కాలానికి పొందొచ్చు. ఇందుకు విరుద్ధంగా కొందరు దరఖాస్తుల్లో ఎక్కువ పాయింట్లు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ గందరగోళంపై విద్యాశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతూ ప్రతి దరఖాస్తును ప్రత్యేక బృందాలను పెట్టి తనిఖీ చేయిస్తున్నారు. సర్వీసు పాయింట్లపై ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే వాటిని కేటాయించనున్నట్లు విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కొందరు తప్పుల తడకగా పెట్టుకున్నారని, వాటిని సరి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ బుధవారం నాటికి పూర్తి చేసి ఏ ఉపాధ్యాయుడికీ అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.

పాయింట్లపై వచ్చిన అభ్యంతరాలు 430
మంగళవారం రాత్రికి  పరిష్కరించినవి: 70
స్క్రూట్నీ చేస్తున్న బృందాలు: 3


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని