logo

ముంచెత్తిన వాన

జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల సమయంలో ఆకాశంలో అకస్మాత్తుగా మబ్బులు కమ్మి గాలి దుమారం చెలరేగింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాన పడింది.

Updated : 31 May 2023 06:23 IST

వాగులో ఉద్ధృతంగా నీటి ప్రవాహం
పిడుగుపాటుకు జిల్లాలో ఒకరి మృతి

పర్చూరు: బోడవాడ వద్ద మిరప కల్లం చుట్టుముట్టిన వరద నీరు

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల సమయంలో ఆకాశంలో అకస్మాత్తుగా మబ్బులు కమ్మి గాలి దుమారం చెలరేగింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాన పడింది. పిడుగుపాటుకు బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న మార్టూరుకు చెందిన అక్కయ్యస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడు పోలేశ్వరరావుకు గాయాలయ్యాయి. భారీ వర్షానికి మార్టూరు మండలం డేగరమూడి వద్ద వాగు పొంగి ప్రవహించింది. పర్చూరు మండలం బోడవాడకు చెందిన కూనంనేని వీరాంజనేయులు మార్టూరులో బంధువుల ఇంట శుభకార్యానికి ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తూ డేగరమూడి వద్ద చప్టాపై వాగు నీటి ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. వాగులో ముళ్ల చెట్ల మధ్య ఇరుక్కుపోయిన వీరాంజనేయులును స్థానికులు, పోలీసులు కాపాడి చికిత్స నిమిత్తం మార్టూరు సామాజిక ఆసుపత్రికి తరలించారు. బాపట్ల, పర్చూరు, అద్దంకి, కొరిశపాడు, చినగంజాం, చెరుకుపల్లి, రేపల్లె, కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, అమృతలూరు మండలాల్లో వర్షం కురిసింది. చినగంజాంలో కురిసిన వర్షానికి ఉప్పు కరిగి రైతులు భారీగా నష్టపోయారు.

ఉప్పు కరగడంతో పారతో కువ్వను సరిచేసుకుంటున్న రైతు

మడుల్లో ఉప్పు కరిగి రూ.1.60 కోట్ల నష్టం

చినగంజాం, న్యూస్‌టుడే: చినగంజాంలో మంగళవారం భారీ వర్షం కురవడంతో ఉప్పు రైతులకు నష్టం వాటిల్లింది. పది రోజుల వ్యవధిలో రెండోసారి వర్షం కురవగా మధ్యలో తీవ్రమైన ఎండలు, వడగాలులు వీచడంతో కొఠారు మడుల్లో ఉప్పు కల్లు పెరిగింది. మరో రెండు రోజుల్లో పంట మడుల నుంచి తీద్దామనుకుంటున్న తరుణంలో కురిసిన వర్షానికి సుమారు 2,000 ఎకరాల్లోని ఉప్పు నీటి పాలయిందని రైతులు ఆర్‌.వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారావు తెలిపారు. ఎకరానికి 20 క్వింటాళ్ల చొప్పున 40 వేల క్వింటాళ్ల ఉప్పు కరిగింది. ప్రస్తుతం క్వింటా ధర రూ.400 ఉండగా దీని ప్రకారం రూ.1.60 కోట్ల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడులు పెరగడానికి మే నెల కీలకం. అలాంటి మాసంలో పది రోజుల్లో రైతులను కోలుకోలేని విధంగా వర్షం రెండో దపా దెబ్బతీసిందని రైతు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మార్టూరు: జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నిలిచిన వర్షపు నీరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని