logo

పైసలిస్తేనే.. దస్త్రం కదిలేది!

భూముల రీసర్వే రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. పూర్వీకుల ఆస్తి, పొరపాటున ఇతరులు లేదా ప్రభుత్వ భూమిగా నమోదై ఉండడం వంటి వాటిని ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున సొమ్ములు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 01 Jun 2023 04:58 IST

రెవెన్యూలో అవినీతి జలగలు
లంచం ఇచ్చుకోలేక సామాన్యుల గగ్గోలు

బాపట్ల, పర్చూరు, చెరుకుపల్లి గ్రామీణ న్యూస్‌టుడే: భూముల రీసర్వే రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. పూర్వీకుల ఆస్తి, పొరపాటున ఇతరులు లేదా ప్రభుత్వ భూమిగా నమోదై ఉండడం వంటి వాటిని ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున సొమ్ములు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, అక్రమాలపై ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తే వాటిపై విచారణ జరగకుండా మచ్చిక చేసుకోవడం, ఒక వేళ జరిగినా చర్యలు లేకుండా నివేదికలు పక్కన పెట్టించుకోవడం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న అధికారుల అనుసరిస్తున్న వైఖరిగా చెబుతున్నారు. వివాదాలలో ఉన్న భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు కోరుకునే వారి నుంచి మరింత మొత్తం డిమాండ్‌ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే ఏదొక సాకు చూపి బాధితులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. జాతీయ రహదారులు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపుల్లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 216ఏ జాతీయ రహదారి భూసేకరణలో భూమి కోల్పోయిన బాపట్లకు చెందిన రైతు అలపర్తి కోటేశ్వరరావుకు పరిహారం చెల్లించటానికి రూ.లక్ష డిమాండ్‌ చేసి తహశీల్దారు కార్యాలయంలో లంచం వసూలు చేస్తుండగా తహశీల్దారు రాఘవయ్యను అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

అలా ఇవ్వగానే.. ఇలా పని పూర్తి

జిల్లాలోని ఓ తీర గ్రామంలో సర్వే కోసం రైతు నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగాడు. అధికారులు, సిబ్బంది రోజూ తిప్పించుకున్నారు. రూ.80 వేలు లంచం ఇవ్వగానే ఒక్క రోజులోనే సర్వే పూర్తి చేసి ధ్రువీకరణ పత్రం అందజేశారు. జిల్లా కేంద్రం బాపట్ల, చీరాల పట్టణం, తీర ప్రాంతంలో స్తిరాస్థి వ్యాపారం జోరుగా సాగుతోంది. లేఅవుట్ వేయాలంటే వ్యవసాయ భూమిని మార్పిడి చేసుకోవాల్సి ఉంది. తీరంలో రిసార్టుల నిర్మాణం చేపడుతున్నారు. భూ మార్పిడికి ఎకరాల ఆధారంగా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన సొమ్ములో కొంత భాగం నేతలు, పై అధికారులకు చెల్లిస్తున్నారు. భూములు, స్థలాల మ్యుటేషన్లు చేయాలన్నా వీఆర్వోలు, ఆర్‌ఐలు రైతులు, యజమానుల నుంచి రూ.వేలు వసూలు చేస్తున్నారు. ప్రతి దస్త్రంపై సంతకం చేయడానికి రెవెన్యూ అధికారికి నగదు ముట్టజెప్పాలి. అధికారులను అడ్డుపెట్టుకుని కింది స్థాయి సిబ్బంది చెలరేగిపోతున్నారు. ధ్రువీకరణ పత్రాల జారీకి దరఖాస్తుదారుడి అవసరాన్ని బట్టి రూ.వేలు వసూలు చేస్తున్నారు. అర్హత లేకున్నా ఈబీసీ పత్రాలు జారీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. రీ సర్వేను సైతం వదలడం లేదు. యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తామంటూ భారీగా ముడుపులు తీసుకుంటున్నారు. డెల్టాలో రెవెన్యూ సిబ్బంది వల్ల ఆన్‌లైన్లో చోటుచేసుకున్న తప్పిదాలు సరిదిద్దడానికి డిమాండ్‌ చేసి రైతుల నుంచి రూ.వేలల్లో నగదు వసూలు చేస్తున్నారు.

రెవెన్యూ శాఖలో అవినీతి జలగలు ప్రజల్ని పీడిస్తున్నాయి. ప్రతి పనికి రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. భూములు, స్థలాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నా, సర్వే, మ్యుటేషన్లు, భూ మార్పిడి చేయాలన్నా, ధ్రువీకరణ పత్రాల జారీకి ముడుపులు చెల్లించనిదే పనులు జరగడం లేదు. ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కొందరు అధికారులు నేరుగా నగదు తీసుకోకుండా ఫోన్‌ పే, పేటీఎం, గూగుల్‌ పే ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామ సచివాలయంలో భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుకు వీఆర్వో స్వాతి స్థానిక రైతు నుంచి రూ.18 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడటం రెవెన్యూలో వసూళ్లు మరోమారు చర్చనీయాంశంగా మారాయి.

ఆన్‌లైన్‌లోనూ చెల్లించే అవకాశం

జిల్లాలోని ఓ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు నేరుగా నగదు తీసుకోవడం లేదు. భూములు ఆన్‌లైన్‌, భూ మార్పిడికి ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా వసూళ్లు చేస్తున్నారు. తమకు తెలిసిన వారి ఫోన్‌ నంబరు ఇచ్చి దానికి నగదు పంపించాలని చెబుతున్నారు. ఇచ్చిన ఫోన్‌ నంబరు ఖాతాలో నగదు జమకాగానే దస్త్రాలపై సంతకాలు చేసి పంపుతున్నారు. గ్రామ సచివాలయాల్లో సర్వేయర్లు డిమాండ్‌ చేసి నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ తీర మండలంలో రెవెన్యూ అధికారి కింది స్థాయి సిబ్బంది ద్వారా ప్రతి నెలా లక్ష్యం నిర్దేశించి కార్యాలయానికి సేవలు నిమిత్తం వచ్చే వారి నుంచి వసూలు చేయిస్తున్నారు. అడిగినంత ఇవ్వలేం కొంచెం తగ్గించుకోండి.. అని అడిగితే మా ఖర్చులు చాలా ఉన్నాయి. అన్నీ మీకు బహిరంగంగా చెప్పలేం. చెప్పిన సొమ్ములు ముట్టజెబితేనే మీ పని త్వరగా అవుతుందని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. పలుచోట్ల కంప్యూటర్‌ ఆపరేటర్లు వసూళ్ల రాయుళ్లుగా అవతారం ఎత్తారు. స్థిరాస్తి వ్యాపారులతో కార్యాలయాల్లో రాత్రులు మంతనాలు జరుపుతూ వారికి అనుకూలంగా వ్యవహరించడానికి భారీగా నగదు తీసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించి వసూళ్లకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామీణులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని