సెలవులు ముగుస్తున్నాయ్.. పనులు సాగనంటున్నాయ్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు కింద చేపట్టిన పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తరచూ సర్కారు ఆదేశాలు మారుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంటోంది.
పడకేసిన నాడు-నేడు ప్రగతి
పట్టించుకోని అధికారులు
రేపల్లెలో పునాది దశలోనే నిర్మాణం
రేపల్లె అర్బన్, కర్లపాలెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు కింద చేపట్టిన పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తరచూ సర్కారు ఆదేశాలు మారుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. తొలుత విద్యార్థుల అవసరాల మేరకు అదనపు తరగతి గదులు నిర్మించాలన్న ఉత్తర్వులతో నిర్మాణాలకు తగిన ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికి నాలుగు సార్లు మార్పులు చేసి చివరగా అదనపు తరగతుల నిర్మాణం నిలిపి జూన్ 15 తరువాత చేపట్టాలన్న ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మంజూరు కాని బిల్లులు
రెండో విడత నాడు-నేడు పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈనెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నా బడుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో పురోగతి ఉండాలని ఉన్నతాధికారులు వెంటపడ్డారు. నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉండడంతో కొంత జాప్యం జరిగింది. దీనికి తోడు సకాలంలో బిల్లులు మంజూరు కాక అభివృద్ధి పనులు నత్తనడకన సాగాయి. వేసవిలో పనులు వేగవంతం చేసి పాఠశాలలు పునః ప్రారంభించే నాటికి తొలుత ఆదేశించిన ప్రభుత్వం ఇటీవల వాయిదా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పునాదుల్లోనే..: దీంతో అదనపు తరగతుల భవన నిర్మాణ పనులు ఇప్పటికీ పలుచోట్ల పునాది, మరికొన్ని చోట్ల శ్లాబ్ దశకే పరిమితమయ్యాయి. కొన్ని బడుల్లో చేపట్టిన మరుగుదొడ్లు, వంటగదులు, ప్రహరీ నిర్మాణ పనులు ఆశించిన విధంగా జరగడం లేదు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్న అధికారుల మాటలు క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శ బాహాటంగా వినిపిస్తోంది.
తప్పని ఇబ్బందులు
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతుల నిర్మాణం, మరమ్మతులు పూర్తయితే మెరుగైన సదుపాయాలు సమకూరతాయని భావించారు. నూతన విద్యా విధానంలో భాగంగా ప్రాథమిక బడుల్లోని మూడు, నాలుగు, ఐదు చదివే పిల్లలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ క్రమంలో తరగతి గదులు సరిపోక వరండా, కళావేదికలపై కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. నాడు-నేడు పనులు వేగంగా జరగక ఈ విద్యా సంవత్సరంలోనూ తమకు తిప్పలు తప్పవని నిట్టూరుస్తున్నారు. ఎప్పటికి అభివృద్ధి పనులు పూర్తిచేయిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలం నాటికి పూర్తికాకుంటే వాన జల్లులకు బడి ఆవరణలో కూర్చోలేమని చదువు సక్రమంగా సాగవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతుల భవన నిర్మాణం ఆపాలనే ప్రభుత్వ ఉత్తర్వులతో జిల్లాలో 68 చోట్ల చేపట్టిన పనులు పూర్తి చేయాలో వద్దో తెలియని అయోమయం నెలకొంది. అధికారులు స్పందించి పాఠశాల పునఃప్రారంభం నాటికి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే గదుల నిర్మాణానికి అవసరమైన ఇనుము, ఇటుక, ఇసుక ఆరుబయటే ఉండడంతో వాటిని కాపాడుకునేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. అకాల వర్షాలకు పాడవుతాయని మదనపడుతున్నారు.
రేపల్లె మండలం లంకెవానిదిబ్బ, నల్లూరుపాలెం, పిరాట్లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను నాడు-నేడు రెండో విడతలో ఎంపిక చేశారు. ఆయా బడుల్లో అదనపు తరగతుల గదుల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు సైతం మంజూరయ్యాయి. తొలుత మౌలిక వసతుల కల్పన పనులు మాత్రమే చేపట్టాలంటూ ఇటీవల ప్రభుత్వం ఆదేశించడంతో అదనపు తరగతుల నిర్మాణం ఆగిపోయింది. జిల్లాలో 543 పాఠశాలల్లో నాడు-నేడు రెండో విడత అభివృద్ధి పనులు చేయించేందుకు ప్రభుత్వం రూ.190 కోట్లు కేటాయించింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వులతో 68 చోట్ల తరగతి గదుల నిర్మాణాలు నిలిచిపోయాయి.
పిట్టలవానిపాలెం మండలం అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. వరండాలో ఫ్లోరింగ్, మరుగుదొడ్ల పనులు నేటికీ పూర్తి చేయలేదు. ఇలా జిల్లాలో అనేక పాఠశాలల్లో అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి.
రేపల్లె మండలం కారుమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నాడు-నేడు రెండో విడతలో అభివృద్ధి చేసేందుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. సకాలంలో బిల్లులు మంజూరు కాక ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణం శ్లాబ్ దశకు చేరింది. తరగతి గదుల్లో నాపరాళ్లు వేసే పనులు జరుగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన బడికి మరమ్మతులు చేయాల్సి ఉంది.
వేగంగా జరిగేలా..
నాడు-నేడు పనులు వేగంగా జరిగేలా దృష్టి సారించాం. అభివృద్ధి పనులను ప్రధానోపాధ్యాయులు దగ్గరుండి చేయిస్తున్నారు. అదనపు తరగతుల గదులు, టెన్‌కాంపొనెంట్్స పనులు ఒకేచోట జరిగే పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం ఆపాలని ఆదేశాలు వచ్చాయి. మరమ్మతులు చేస్తున్న బడుల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. బడులు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు మెరుగైన వసతులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నాం.
పి.వి.జె.రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి బాపట్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’