బాధ్యతగా నిలవండి.. బతుకులు నిలపండి..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది సుమారు 260 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి పెనుమూడి వారధి వరకు పలు ప్రాంతాల్లో తీరప్రాంత ప్రజలు నదిలోకి దిగుతున్నారు.
ప్రజలకు అవగాహన కలిగేలా సూచిక బోర్డులు అవశ్యం
ఇసుక తవ్వకాలపై నిరంతర నియంత్రణ తప్పనిసరి
అధికారుల సమన్వయంతో ప్రమాదాల కట్టడి
ఈనాడు, అమరావతి,న్యూస్‌టుడే, అమరావతి,తాడేపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానది సుమారు 260 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి పెనుమూడి వారధి వరకు పలు ప్రాంతాల్లో తీరప్రాంత ప్రజలు నదిలోకి దిగుతున్నారు. స్థానికంగా నివాసముండే పెద్దలకు అవగాహన ఉండడంతో లోతు ప్రాంతాలకు వెళ్లకపోయినా విద్యార్థులు, పిల్లలు ఆటవిడుపుగా నదిలోకి వెళ్లి మృత్యువాత పడుతున్నారు. నదీతీరంలో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతాలు ఉండటంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వేసవి సెలవులకు ఇళ్లకు వచ్చిన విద్యార్థులు సరదాగా నదీతీరానికి వెళ్లి అనుకోకుండా నీటిలో మునిగి తల్లిదండ్రులకు అంతులేని ఆవేదన మిగులుస్తున్నారు. ఘటన జరిగినప్పుడు అయ్యో పాపం అనే జనం, హడావుడి చేసే యంత్రాంగం నిర్మాణాత్మక చర్యలు తీసుకుని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతోంది. వరుస ఘటనలు పునరావృతం కాకుండా యంత్రాంగం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ సహకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆఖరిచూపూ దక్కని దైన్యం
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం శివారు కృష్ణానదిలో గతేడాది అక్టోబరు 2న తెనాలికి చెందిన హర్షవర్ధన్ స్నేహితులతో కలిసి సరదాగా నదిలో స్నానానికి దిగారు. నదీ ప్రవాహంలో హర్షవర్దన్ గల్లంతయ్యాడు. అప్పట్లో ఐదు రోజుల పాటు పోలీసులు గాలించినా మృతదేహం సైతం దొరకలేదు. ఒక్కగానొక్క కొడుకు హర్షవర్దన్ అల్లారుముద్దుగా పెంచుకుంటే ఆఖరిచూపు కూడా దక్కలేదని తల్లిదండ్రులు యోగేశ్వరరావు, నాగమణి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
ప్రమాదాలు జరిగే ప్రాంతాలివే...
* మాచర్ల మండలం విజయపురిసౌత్‌లోని నాగార్జునసాగర్ ఎగువనే కృష్ణవేణి పుష్కరఘాట్.
* రెంటచింతల మండలం సత్రశాల.
* గురజాల మండలం దైద.
* దాచేపల్లి మండలం తంగెడ.
* అచ్చంపేట మండలం చల్లగరిగ, పులిచింతల దిగువన మాదిపాడు, చామర్రు
* బెల్లంకొండ మండలం ఎమ్మాజిగూడెం, కోళ్లూరు, బోధనం, చిట్యాల.
* అమరావతి మండలం మునుగోడు, పొందుగల, మల్లాది, దిడుగు, ముత్తాయపాలెం, ధరణికోట, అమరావతి, వైకుంఠపురం.
* తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం, రాయపూడి, తాళ్లాయపాలెం.
* తాడేపల్లి మండలం ఉండవల్లి సమీపంలో కొండవీటి ఎత్తిపోతల పథకం వద్ద, సీతానగరం ఘాట్, రైల్వేవంతెన, కనకదుర్గమ్మవారధి పిల్లర్లు.
* దుగ్గిరాల మండలం పెదకొండూరు, వీర్లపాలెం.
* కొల్లిపర మండలం మున్నంగి, కొల్లిపర, బొమ్మువానిపాలెం.
* కొల్లూరు మండలం చిలుమూరు ప్రాంతాలు ప్రమాదాలకు నిలయాలుగా ఉన్నాయి.
మార్గదర్శకాల అమలు బాధ్యత ప్రభుత్వానిదే
నదిలో లోతు ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నా కొందరు యువకులు పెడచెవిన పెడుతున్నారు. నదిలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు మరింతగా పెరిగాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం మార్గదర్శకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉంది.
వావిలాల సుబ్బారావు, పురావస్తు పరిశోధకులు, అమరావతి
సమాచార కేంద్రంతో అప్రమత్తం చేయాలి
నది వద్ద శాశ్వత ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. దేవాలయంలో మైకు ఉన్నందున భక్తులకు నది లోతుపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయొచ్చు. స్థానికేతరులు ఎక్కువగా వస్తున్నందున ఘాట్ సమీపంలో ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేయాలి. నదిలో స్నానాలు ఎక్కడ చేయాలి, ప్రమాద ప్రాంతాలు ఎటువైపు ఉన్నాయన్న సమాచారం అందించాలి. ఇలా చేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించవచ్చు.
పీసపాటి నాగేశ్వరశర్మ, ఆధ్యాత్మికవేత్త
ప్రమాదకర ప్రాంతాల్లో కంచెలు వేయాలి
నదీ తీరం వెంబడి ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అటువైపు వెళ్లకుండా కంచెలను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా నదిలో నీరు తక్కువగా ఉన్నప్పుడే గోతుల్లోకి దిగి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. దీనిని గుర్తించి రక్షణ చర్యలు ఎక్కువగా తీసుకోవాలి. అధికారుల సమన్వయలోపం కారణంగా ఎటువంటి భద్రతా చర్యలు ఘాట్ల వద్ద కనిపించడం లేదు. ఈ పరిస్థితి మారాలి.
కోలా వెంకటేశ్వరరావు, పర్యావరణ వేత్త, అమరావతి
భద్రతా చర్యలు చేపడతాం
నదిలో ఉన్న ప్రమాదకర గోతులతో ఎవరూ దిగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతాం. ఆలయం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి భక్తులకు కృష్ణానదిలో స్నానాలపై తగు సూచనలు చేస్తాం. ప్రమాదకర గుంతల వద్ద శాశ్వత ప్రాతిపదికన ఉండేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు నదిలో లోతు ఎక్కడ ఉంటుందో తెలియదు కనుక స్థానికుల సూచనల మేరకే నదిలో దిగేలా చర్యలు చేపడతాం.
ఏవీ బ్రహ్మం, సీఐ, అమరావతి
మృతుల జాబితాతో హెచ్చరిక బోర్డులు
గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా నదీ తీరంలో జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడానికి వెంటనే ప్రమాదాలను సూచించేలా బోర్డులు ఏర్పాటు చేస్తాం. నదీ తీరంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించాం. తాడేపల్లి మండల పరిధిలోనే ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. సూచిక బోర్డులతో పాటు ఆ ప్రాంతంలో మృతి చెందిన వారి జాబితాతో కూడిన వివరాలతో అక్కడికి వచ్చేవారికి హెచ్చరికలా ఉండేలా శాశ్వత ప్రాతిపదికన బోర్డులు ఏర్పాటు చేయిస్తాం. విద్యార్థులు కూడా పెద్దలు లేకుండా స్నేహితులతో కలిసి స్నానానికి సైతం నీటిలోకి దిగరాదు. జిల్లా యంత్రాంగం తరఫున ప్రమాదాల కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటాం.
ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, గుంటూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: ముగిసిన చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
PM Modi: హైదరాబాద్ బాలికను ప్రశంసించిన ప్రధాని
-
Ban vs NZ: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి.. వీడియో వైరల్
-
V Pasu: ‘చంద్రముఖి 2’.. రజనీకాంత్ రిజెక్ట్ చేశారా..?: పి.వాసు ఏమన్నారంటే
-
Nithin Kamath: డిజిటలైజేషన్కి ముందు ఖాతా కోసం 40 పేజీలు కొరియర్ చేసేవాళ్లు: జిరోదా సీఈఓ