logo

బరువెక్కిన విత్తు.. భారమవుతున్న సాగు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామంటూ ప్రజాప్రతినిధులు డప్పు కొడుతున్నారు.

Published : 01 Jun 2023 03:37 IST

పచ్చిరొట్ట విత్తనాల ధర పెంపు

పొన్నూరులో పచ్చిరొట్ట సాగు కోసం దుక్కి దున్నుతూ..

పొన్నూరు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామంటూ ప్రజాప్రతినిధులు డప్పు కొడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ నిర్వహించే పచ్చిరొట్ట విత్తనాల ధర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 66,478 హెక్టార్లలో వరిపైరు సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేశారు.

* సాగులో రసాయనిక ఎరువుల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. వాటిని వినియోగించడం వల్ల భూమిలో సారం దెబ్బతిని పరోక్షంగా దిగుబడులపై ప్రభావం చూపుతుంది. సారవంతమైన భూమిని తయారు చేసేందుకు పచ్చిరొట్ట సాగు చేసుకోవడం మేలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆ పచ్చిరొట్ట విత్తనాలు గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వం ధరలు పెంచడంతో అదనపు భారం పడిందని వారు వాపోతున్నారు.

* జీలుగ ఎకరాకు 12 కిలోలు, జనుమ 16 కిలోలు, పిల్లి పెసర 8 కిలోల చొప్పున విత్తనాలు చల్లాలని చెబుతున్నారు. జీలుగ, పిల్లిపెసర ధర మాత్రం పెంచారు. జనుమ విత్తనాలు మాత్రం కిలోకి రూపాయి తగ్గించారు. ప్రస్తుతం కొంతమంది రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసేందుకు రొటోవేటర్‌, దుక్కి దున్నే ప్రక్రియలో అన్నదాతలు నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగుదారులకు ఇచ్చే ప్రోత్సాహాలకంటే మోపే భారాలే అధిక మయ్యాయని కర్షకులు మనోవేదనకు గురవుతున్నారు. సాగు చేయడం ఏడాదికాయేడాది భారమవుతోందని ఇలాంటి తరుణంలో సాగుదారులపై అదనంగా భారం మోపడం ఎంత వరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విత్తనాలు 50 శాతం రాయితీపై రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు సన్నద్ధం చేశామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

* దీనిపై ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్‌ జి.సుబ్బయ్యను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా జీలుగ, పిల్లిపెసర ధర పెరిగిందని, జనుము ధర తగ్గిందన్నారు. జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసే ప్రక్రియను నిర్వహిస్తాం. రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసుకోవాలని చెబుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని