logo

ఎకరా రూ.30 లక్షలు కొనేది రూ.2.22 కోట్లు

నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిబంధనల ప్రకారం స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛభారత్‌లో భాగంగా పట్టణాల్లో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(మురుగు నీటి శుద్ధి కర్మాగారం, ఎస్‌టీపీ-1) నిర్మాణాలకు కేంద్రం చర్యలు తీసుకుంది.

Updated : 01 Jun 2023 05:08 IST

అధికార పక్షం తీరుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళన
సత్తెనపల్లిలో ఎస్‌టీపీ నిర్మాణం భూ సేకరణలో మాయాజాలం

మురుగు నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదించిన భూమి ఇదే..

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిబంధనల ప్రకారం స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛభారత్‌లో భాగంగా పట్టణాల్లో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(మురుగు నీటి శుద్ధి కర్మాగారం, ఎస్‌టీపీ-1) నిర్మాణాలకు కేంద్రం చర్యలు తీసుకుంది. దీనికి అవసరమైన భూమి రాష్ట్ర ప్రభుత్వం సమకూరిస్తే, నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వనుంది. మురుగు నీటి ప్రవాహం పట్టణం చివర్లో ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఎస్‌టీపీ నిర్మాణాలు చేపట్టాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. దీని ప్రకారం సత్తెనపల్లి పట్టణంలోని 30వ వార్డులోని నిర్మలానగర్‌లో దీని నిర్మాణ ప్రతిపాదన చేశారు. ఆ వార్డులోని సర్వే నంబర్లు 77-2లో 24 సెంట్లు, సర్వే నంబరు 85-3లో 2.24 ఎకరాలు, సర్వే నంబరు 87-బీ2లో 1.52 ఎకరాలు కలిపి మొత్తం 4 ఎకరాల్లో దాన్ని నిర్మించేలా ప్రణాళిక రూపకల్పన చేశారు. ఎస్‌టీపీకి ప్రతిపాదించిన 4 ఎకరాల భూమి మూడు సర్వే నంబర్లలో ఉంది. అదంతా ప్రైవేట్‌ భూమిగా ఉంది. ఆ భూమి సారవంతమైంది కూడా కాదు. అలాంటిచోట ఎస్‌టీపీ నిర్మాణం ఆలోచన మంచిదే అయినా భూమి కొనుగోలుకు ప్రతిపాదించిన ధరలోనే మతలబు ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 4 ఎకరాల భూమికి రూ.8.88 కోట్ల ప్రజాధనం వెచ్చించడం సరైన చర్య కాదని, ప్రజాధనం కొల్లగొట్టేలా ప్రణాళిక వేశారని విమర్శిస్తున్నాయి.

సాధారణంగా భూమి గాని, స్థలం గాని కొనేటప్పుడు తక్కువ ధరకు వచ్చేలా బేరమాడి కొనుగోలు చేస్తాం.. కానీ సత్తెనపల్లి పురపాలక సంఘంలో  అధికార పక్ష సభ్యులు కొంతమంది స్వార్థమే పరమావధిగా ఎకరా విలువ రూ.30 లక్షలు విలువ చేసే భూమిని ఏకంగా రూ.2.22 కోట్ల చొప్పున కొనేందుకు సిద్ధమవుతున్నారు. నాయకులు కొందరు ఆ భూములను చేజిక్కించుకొని, అధికారమే అండగా అధిక ధరలకు వాటిని అంటగట్టి ప్రజాధనం కొల్లగొట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ వ్యవహారానికి మురుగు  నీటి శుద్ధి కర్మాగారం(ఎస్‌టీపీ) నిర్మాణం ఆసరాగా మారింది. ప్రస్తుతం సత్తెనపల్లి పురపాలక సంఘం కౌన్సిల్‌ సమావేశంలో వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ధనం కొల్లగొట్టే వ్యవహారంపై న్యాయ విచారణ చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

బినామీలతో భూ కొనుగోళ్లు

గత మార్చి 31న సత్తెనపల్లి పురపాలక సంఘ కౌన్సిల్‌ అత్యవసర సమావేశంలో ఎస్‌టీపీ నిర్మాణానికి భూమి కొనుగోలుపై తీర్మానం చేశారు. తర్వాత ప్రతిపాదిత భూముల క్రయ, విక్రయాలు జరిగి చేతులు మారాయి. రూ.30 లక్షలు విలువ చేసే భూమిని అమాంతంగా రూ.కోటికి రిజిస్ట్రేషన్‌ విలువను పెంచడం ఏంటని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు మొదట తమ బినామీలతో ప్రతిపాదిత భూముల్ని కొనిపించి.. వారి నుంచి అదే భూమిని పురపాలక సంఘానికి అధిక ధరకు విక్రయించబోతున్నారని జనసేన, వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్‌ ధర ప్రకారం రెట్టింపు ధర పరిహారం ఇవ్వాల్సి ఉన్నందున రూ.రెండు కోట్లకుపైగా ధర పెట్టినట్లు అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్‌ విలువ ఆప్రాంతంలో పెంచేయడం, అక్కడ భూముల్ని తక్కువ ధరకు నాయకులు కొనుగోలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 4 ఎకరాల ప్రతిపాదిత భూమిలో ఇప్పటికే రెండు ఎకరాలు ముగ్గురి చేతులు మారాయి. మిగిలిన రెండు ఎకరాలు ఎంతమంది చేతులు మారతాయో.. ఎంత ధర పెరుగుతుందోననే చర్చ నడుస్తోంది. భూ సేకరణ ప్రక్రియ ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.

ప్రభుత్వ భూమి లేనందునే..

ఎస్‌టీపీ నిర్మాణానికి భూమి కొనుగోలు ప్రతిపాదనలు కౌన్సిల్‌ అనుమతితో నిబంధనల మేరకు చేపట్టామని సత్తెనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ కె.షమ్మీ చెప్పారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని, రెవెన్యూ అధికారులు రాసివ్వడంతోనే ప్రైవేట్‌ భూమిలో ఎస్‌టీపీ నిర్మాణం చేపట్టే ఆలోచన చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతమున్నది కేవలం ప్రతిపాదనలేనని.. భూమి కొనుగోలుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉందని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు