logo

స్వల్పమంటూనే భారీగా పెంచేశారు

ఈనెల ఒకటి నుంచి భూముల మార్కెట్‌ విలువలు స్వల్పంగా పెంచుతామంటూ రిజిస్ట్రేషన్ల శాఖ వారం పది రోజుల నుంచి ఇస్తున్న సంకేతాలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని తేలిపోయాయి.

Published : 02 Jun 2023 05:16 IST

అసంబద్ధంగా భూముల మార్కెట్‌ విలువల పెంపు

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: ఈనెల ఒకటి నుంచి భూముల మార్కెట్‌ విలువలు స్వల్పంగా పెంచుతామంటూ రిజిస్ట్రేషన్ల శాఖ వారం పది రోజుల నుంచి ఇస్తున్న సంకేతాలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని తేలిపోయాయి. పెరుగుదల 10 నుంచి 20 శాతంలోపే ఉండవచ్చని భావించినా కొన్నిచోట్ల అసంబద్ధంగా రైతులను కుంగదీసేలా ఉంది. గతంలో భూముల మార్కెట్‌ విలువలు పెంచే ముందు రెవెన్యూ, పంచాయతీ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు ప్రతిపాదనలు చేసి అవి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నయో లేదో అభిప్రాయ సేకరణ కూడా చేసేవారు. ఇటువంటి పద్ధతులకు స్వస్తి పలికిన అధికారులు ‘మేం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం’ అన్నట్లు తమ ఇష్టారాజ్యంగా విలువలు పెంచటం సహేతుకంగా ఉండటం లేదు. ఒక ఊళ్లో భూముల విలువ స్థానిక అధికారులకు తెలుస్తుంది. కనీసం వారిని సంప్రదించకుండా పెంచటంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. స్వల్పమంటూనే భారీగా విలువలు పెంచటం కేవలం ఆదాయాన్ని పెంచుకోవడానికేనని భావిస్తున్నారు. అదీకాక పెంపుదల ఎంత అసంబద్ధంగా ఉందంటే చెరుకుపల్లి మండలంలోని రాంభొట్లపాలెం, పొన్నపల్లి మైనర్‌ పంచాయతీలు. గ్రామంలో పట్టుమని 10 ఎకరాలున్న రైతులు ఒకరిద్దరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ గ్రామాల మీదుగా 216 ఎ జాతీయ రహదారి వెళ్తుందని ఇక్కడి మాగాణి భూముల ధరలు ఏకంగా రూ.12 లక్షల నుంచి రూ.17 లక్షలకు పెంచేశారు. అలాగే చెరుకుపల్లి, ఆరుంబాక గ్రామాల్లో మాగాణి భూముల ధరలు దాదాపు 30 నుంచి 35 శాతం పెరిగాయి. ఇక నివేశన స్థలాల విషయానికొస్తే రాంభొట్లపాలెం, పొన్నపల్లిలో గజం రూ.520, రూ.630 మార్కెట్‌ విలువ ఉన్న స్థలాల ధర ఏకంగా గజం రూ.1000కి జాతీయ రహదారిని దృష్టిలో పెట్టుకొని ఇలా విలువ పెంచితే ఆయా గ్రామాల్లో 99 శాతం ఉన్న సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పెంపుపై పునరాలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని