logo

ఉపాధ్యాయ ఖాళీలపై కన్ను!

ఉపాధ్యాయ ఖాళీలు కొన్ని బ్లాక్‌ చేస్తున్నట్లు జాబితా ఒకటి బయటకు రావడంతో టీచర్లలో ఆందోళన నెలకొంది. మంజూరైన పోస్టులు, వాటిల్లో పనిచేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుని కొన్నింటిని బ్లాక్‌ చేస్తూ తాజాగా విడుదలైన జాబితాతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది.

Published : 02 Jun 2023 05:16 IST

ముందుగానే బ్లాక్‌ చేసినట్లు బయటకొచ్చిన జాబితా
సంఘాల నాయకుల అభ్యంతరం

గుంటూరు డీఈవో కార్యాలయంలో హెచ్‌ఎం, ఎంఈవోలతో రద్దీ

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ ఖాళీలు కొన్ని బ్లాక్‌ చేస్తున్నట్లు జాబితా ఒకటి బయటకు రావడంతో టీచర్లలో ఆందోళన నెలకొంది. మంజూరైన పోస్టులు, వాటిల్లో పనిచేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుని కొన్నింటిని బ్లాక్‌ చేస్తూ తాజాగా విడుదలైన జాబితాతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. అయితే విద్యా శాఖ అధికారులు మాత్రం తామేమి బ్లాక్‌ చేయలేదని చెబుతున్నారు. తాజాగా విడుదలైన సీనియారిటీ ప్రొవిజనల్‌ జాబితాలో క్లియర్‌ వేకెన్సీలు, లాంగ్‌ స్టాండింగ్‌ వేకెన్సీలు, డెత్‌ వేకెన్సీలు, పదవీ విరమణ ఖాళీలతో పాటు బ్లాక్డు ఖాళీలు చూపుతూ ఆ జాబితా ఉంది. ఖాళీలు బ్లాక్‌ చేయలేదంటూనే ఒకవైపు బ్లాక్డ్‌ ఖాళీలు అని ఎందుకు చూపించారని కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఖాళీలు బ్లాక్‌ చేయడం ఏమిటి? అవి ఎందుకు,  ఎవరి కోసం బ్లాక్‌ చేస్తున్నారో చెప్పాలని సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ఇప్పటికే బదిలీలు కోరుతూ చేసుకున్న దరఖాస్తుల్లో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో వాటిపై బుధవారం, గురువారం రెండు రోజుల పాటు డీవైఈఓలు, ఎంఈఓలు, పరిశీలన బృందాలు తనిఖీ చేశాయి. పదోన్నతి పొందిన టీచర్లు సైతం కొందరు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వారు తమ దరఖాస్తులు తొలగించాలని స్వయంగా వారే అభ్యంతరం పెట్టుకోగా మరికొందరు ఉపాధ్యాయులు కేటగిరీతో సంబంధం లేకుండా పాత స్టేషన్‌ పాయింట్లు ఎక్కువ నమోదు చేసుకున్నారు. ఇలాంటి వాటిపై మొత్తం 470కు పైగా అభ్యంతరాలు రాగా గురువారం రాత్రికి 80 శాతం పూర్తయ్యాయి. మూడు జిల్లాల నుంచి హెచ్‌ఎంలు, ఎంఈఓలు వచ్చి ఖాళీలు ఏవైనా బ్లాక్‌ చేసి ఉంటే వాటిని స్వయంగా ఐటీ బృందాలతో చెప్పి తొలిగిస్తున్నారు. గతంలో కొన్ని ఖాళీలు బ్లాక్‌ చేసి అప్పట్లో బదిలీలకు అర్హుల జాబితా రూపొందించారు.


తొలగించాలని హెచ్‌ఎంలకు ఆదేశాలు

ఆ జాబితాలో ఉన్నత పాఠశాలల్లో ఎక్కడైనా పొరుపాటున ఖాళీలు బ్లాక్‌ చేస్తే వెంటనే వాటిని దగ్గరుండి తొలిగించుకోవాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. గురువారం గుంటూరులోని డీఈఓ కార్యాలయానికి మూడు జిల్లాల నుంచి హెచ్‌ఎంలు, ఎంఈఓలు తరలిరావడంతో కార్యాలయం కిటకిటలాడుతోంది. శుక్రవారం తుది సీనియారిటి జాబితా ప్రదర్శించాలి. అయితే నిర్దేశిత సమయంలోపు జిల్లాలో ఆ జాబితాను ప్రదర్శించడం సాధ్యం కాదని, శుక్రవారం గుంటూరులో సీఎం పర్యటన ఉండడంతో కొందరు అధికారులు అటు వెళ్లాల్సి ఉండటంతో శనివారం నాటికి ఈ పరిశీలన పూర్తి చేసి కమిషనర్‌ కార్యాలయానికి జాబితా అందజేస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. 2, 3 తేదీల్లో సీనియారిటీ జాబితాలు ప్రదర్శించి 4న తుది ఖాళీల జాబితా ప్రకటించేలా బదిలీల షెడ్యూల్‌ ఉంది. దీంతో బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి అత్యధికంగా 5,767 మంది ఉపాధ్యాయులు బదిలీ కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. మూడు జిల్లాల పరిధిలో సుమారు 11వేల మంది పనిచేస్తుంటే సగానికి పైగా బదిలీలకు దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్‌ చేయలేదని అధికారులు పైకి చెబుతున్నారు. కానీ వారు విడుదల చేసిన సీనియారిటీ ప్రొవిజనల్‌ జాబితా కాలం చివరిలో బ్లాక్డ్‌ వేకెన్సీలు చూపారని ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బసవలింగారావు పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని