logo

పరిహారం సరిపోదు.. పెంచాల్సిందే!

బెంగళూరు-కడప-విజయవాడ (బీకేవీ) గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి భూసేకరణ విషయంలో అద్దంకి మండలం కొటికలపూడి రైతులు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం చెల్లించే పరిహారం సరిపోదని, రైతులు సంతృప్తికరంగా ఉంటేనే భూములు ఇచ్చేందుకు ఒప్పుకొంటామని తీర్మానించారు.

Updated : 02 Jun 2023 05:31 IST

అలాగైతేనే బీకేవీ ఎక్స్‌ప్రెస్‌
రహదారికి భూములిస్తాం..
కొటికలపూడి రైతుల్ని అనుసరిస్తున్న మరో రెండు గ్రామాలు

సమావేశమైన కొటికలపూడి రైతులు

కొటికలపూడి (అద్దంకి), న్యూస్‌టుడే: బెంగళూరు-కడప-విజయవాడ (బీకేవీ) గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి భూసేకరణ విషయంలో అద్దంకి మండలం కొటికలపూడి రైతులు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం చెల్లించే పరిహారం సరిపోదని, రైతులు సంతృప్తికరంగా ఉంటేనే భూములు ఇచ్చేందుకు ఒప్పుకొంటామని తీర్మానించారు. కొటికలపూడి రైతులు అనుసరిస్తున్న విధానాన్ని తామూ అమలు చేస్తామంటూ మోదేపల్లి, కుంకుబాడు రైతులు అంటున్నారు. బీకేవీ రహదారి నిర్మాణం జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా జాగర్లమూడివారిపాలెం వద్ద మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి అద్దంకి మండలం బొమ్మనంపాడు, జార్లపాలెం, దక్షిణ అద్దంకి, కొటికలపూడి, కుంకుబాడు, మోదేపల్లి మీదుగా ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. బెంగళూరు నుంచి విజయవాడకు అత్యంత తక్కువ దూరంతో చేరుకునేందుకు ఈ రహదారిని ఎంపిక చేశారు. భూసేకరణకు సంబంధించి పరిహారం తక్కువగా నిర్ణయించారని, దీన్ని పెంచాలంటూ కొటికలపూడి గ్రామానికి చెందిన 78 మంది రైతులు రెండు రోజులుగా సచివాలయం వద్ద సమావేశమై తీర్మానించారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఎకరాకు గరిష్ఠంగా రూ.8.30 లక్షలు అందుతుందని, కనీసం రూ.12 లక్షల వరకు పరిహారం చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్ణయించారు. రహదారికి నిర్ణయించిన ప్రదేశంలో పొలాలు సాగు చేసుకునే పైపులైన్‌ ఉందని, అది పూర్తిగా దెబ్బతింటుందని వారు వాపోతున్నారు. ఆమేరకు సర్పంచి పూనాటి విక్రం ఆధ్వర్యంలో మద్దతు ధరను నిర్ణయించి రెవెన్యూ అధికారులకు తెలిపారు. ఇదే విధంగా కుంకుబాడు, మోదేపల్లి రైతులు పయనిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో రైతులు రామారావు, నారాయణ, శేషయ్య, శివరామయ్య, కాశమ్మ, శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని