logo

అధికారమే అండ

అధికార పార్టీ నాయకుల అండ ఉంటే చాలు ఎన్ని అక్రమాలు చేస్తున్నా అధికారులకు మాత్రం కనిపించదు. నిబంధనలు కాగితాలకే పరిమితం చేస్తున్నారు.

Updated : 02 Jun 2023 05:32 IST

నండూరు చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
ట్రక్కుకు రూ.800 నుంచి రూ.1000 వసూలు

చెరువులో మట్టి ట్రక్కులో నింపుతున్న పొక్లెయిన్‌

పొన్నూరు, న్యూస్‌టుడే: అధికార పార్టీ నాయకుల అండ ఉంటే చాలు ఎన్ని అక్రమాలు చేస్తున్నా అధికారులకు మాత్రం కనిపించదు. నిబంధనలు కాగితాలకే పరిమితం చేస్తున్నారు. ఆలయానికి చెందిన చెరువులో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు నిర్వహించి అధికార పార్టీ నాయకులు ప్రజా సంపద దోచుకుంటున్నారు. అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంలో విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. పొన్నూరు మండల పరిధిలోని నండూరులో గంగా బాలత్రిపుర సుందరి సమేత సకలేశ్వరస్వామి ఆలయానికి చెందిన 9.70 ఎకరాల్లో చెరువు ఉంది. అధికారంలోకి రాగానే వైకాపా నాయకుల కన్ను ఆ చెరువుపై పడింది. గత ఏడాదే చెరువులో తవ్వకాలు ప్రారంభించారు.

* గతేడాది వేసవిలో అధికార పార్టీ నాయకులు కొంతమేర చెరువు తవ్విన అనంతరం వర్షాలు కురవడంతో పనులు నిలిపివేశారు. ఆదాయ వనరులే లక్ష్యంగా ఈ ఏడాది కూడా తవ్వకాలు ప్రారంభించారు. చెరువులో 7 అడుగుల నుంచి 8 అడుగుల మేర తవ్వకాలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రక్కు మట్టిని రూ.800 నుంచి రూ.1000 వరకు వసూలు చేసి అధికార పార్టీ నాయకులు రూ. లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు.

* ఈ అక్రమ తవ్వకాలు అధికార పార్టీలోని ఓ కీలక నేత కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఆ నేతకు ఒప్పందం మేరకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే ఈ అక్రమ తవ్వకాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అక్రమంగా చెరువు తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ఏ శాఖ అధికారి కూడా అటువైపు వెళ్ళి పరిశీలించిన పాపాన పోలేదు. మైనింగ్‌శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని తమకు తెలియదని అధికార పార్టీ నాయకుడు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. దేవాదాయశాఖ అధికారుల అనుమతి ఉన్నప్పుడు మిగిలిన శాఖల అనుమతులు ఎందుకంటూ ప్రశ్నించడం గమనార్హం.

* దీనిపై సకలేశ్వరస్వామి ఆలయ అధికారి మల్లెల రమేష్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా నండూరు చెరువులో తవ్వకాలు జరిపేందుకు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతులు తీసుకున్నామన్నారు. దేవాదాయశాఖ చెరువు తవ్వకాలకు మైనింగ్‌ శాఖ అనుమతులు అవసరం లేదన్నారు. నిబంధనల మేరకే చెరవులో తవ్వకాలు జరపాలని , నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని