logo

ఆ బిల్లులతోఖజానాకు గండి

ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన ఔషధాలు ప్రభుత్వం డ్రగ్‌ స్టోర్‌ నుంచి అందజేస్తోంది. అత్యవసర, ఆసుపత్రుల్లో అందుబాటులో లేని కొన్ని మందులు కొనుగోలు చేయాలంటే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డ్రగ్‌ స్టోర్‌కు ఫలానా ఔషధాలు కావాలని లేఖ రాయాలి.

Published : 04 Jun 2023 04:04 IST

రెండేళ్ల నాటి ఖర్చులు ఇప్పుడు చెల్లించాలని ఒత్తిడి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో తీరిలా..
న్యూస్‌టుడే, నిఘా విభాగం

* ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన ఔషధాలు ప్రభుత్వం డ్రగ్‌ స్టోర్‌ నుంచి అందజేస్తోంది. అత్యవసర, ఆసుపత్రుల్లో అందుబాటులో లేని కొన్ని మందులు కొనుగోలు చేయాలంటే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డ్రగ్‌ స్టోర్‌కు ఫలానా ఔషధాలు కావాలని లేఖ రాయాలి. మావద్ద అవి లభ్యంగా లేవని డ్రగ్‌ స్టోర్‌ బాధ్యులు రాసిస్తే కావాల్సినవి ప్రైవేట్‌గా కొనుగోలు చేసేందుకు సిద్ధమవ్వాలి. ప్రైవేట్‌లో ఔషధ దుకాణానికి అవసరమైన వాటిని తెలియజేస్తూ ఇండెంట్‌ ఇవ్వాలి. మీరు కోరిన విధంగా మందులు సరఫరా చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నుంచి ఔషధ దుకాణ నిర్వాహకుడు తిరుగు రసీదు పంపాలి. ఇవన్ని ఉంటేనే బయట కొనుగోలుచేసే ఔషధాలకు ఆసుపత్రి నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అవేమీ లేకుండా రెండేళ్ల క్రితం ఔషధాలు కొనుగోలు చేశాం.. బిల్లులిస్తున్నాం.. డబ్బులు ఇవ్వండంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇలా ఏకంగా రూ.50 లక్షలకుపైగా నగదుకు బిల్లులిస్తాం.. డబ్బులు చెల్లించాలంటున్నారు.

* రెండేళ్లక్రితం రోగులకు భోజనం వడ్డించాం. డబ్బులు ఇవ్వండని ఏవేవో బిల్లులు పెట్టారు. వాటిపై అప్పుడు పనిచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సంతకాల్లేవు. అసంపూర్తిగా ఉన్న బిల్లులతో నగదు చెల్లించలేమని చెబుతున్నా రూ.16 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.

* రెండేళ్ల క్రితం నాటి ఔషధాల కొనుగోళ్ల బిల్లులకు ఇప్పుడు నగదు చెల్లించవచ్చా అని డీసీహెచ్‌ను ఆసుపత్రి పర్యవేక్షకుడు కోరితే ఆయన ఆడిటింగ్‌ చేయించారు. అందులో ఆ బిల్లులకు నగదు చెల్లించకూడదని మార్గదర్శకాలందాయి. రూ.46 లక్షల ఔషధ కొనుగోళ్ల బిల్లుల చెల్లింపులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2020 నుంచి 2022 మధ్యలో కొనుగోలు చేసిన ఔషధాలు కావడంతో బిల్లుల చెల్లింపునకు అనుమతి ఇవ్వాలని గుంటూరు కలెక్టర్‌ను కోరారు. ఆయన సుముఖత చూపించలేదు. ఏమైనా ఉంటే ఏపీవీపీ రాష్ట్ర కమిషనర్‌ ద్వారా బిల్లుల చెల్లింపులు చేసుకోవాలని తన ప్రమేయం ఇందులో ఉండదని ఆయన తేల్చి చెప్పారు.

జిల్లా కేంద్రం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు ఔషధాలు సరఫరా చేశానని.. డైట్‌ బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. సరైన పత్రాల్లేని వాటికి బిల్లులు చెల్లించలేమని అధికారులు చెబుతున్నా వినిపించుకోవట్లేదు. ఏకంగా జిల్లా ఉన్నతాధికారి వద్ద కూర్చుని ఆయన ద్వారా అదేదో సర్దుబాటు చేయాలని చెప్పిస్తున్నారు. 2020 నుంచి 2022 వరకు పని చేసిన సూపరింటెండెంట్‌ల సంతకాలు ఉంటే బిల్లులు చేస్తానని లేదంటే అప్పట్లో సరిగ్గా రికార్డులు నిర్వహించలేదని రాసివ్వమని ప్రస్తుత పర్యవేక్షకుడు కోరితే అలా చేయమని నగదు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. బిల్లులు అడిగితే ఆఫీసులో, బ్లడ్‌బ్యాంకులో, ఫార్మసీలో ఉన్నాయంటున్నారే తప్పించి వాటిని తీసుకురావట్లేదు.

* జనని సురక్ష యోజన నిధులు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి ఔషధ, డైట్‌ బిల్లులు రూ.66 లక్షల వరకు చెల్లించమంటున్నారు. ఔషధ కొనుగోళ్లనే తీసుకుంటే ఏవేవి తీసుకున్నారు.. దేనికి వాటిని వినియోగించారనే వివరాల బిల్లులు సక్రమంగా లేవు. డైట్‌ బిల్లులది అదే తీరు. అయినా డబ్బులు చెల్లించాల్సిందే అంటున్నారు. 2022లో ప్రభుత్వాసుపత్రి నుంచి రూ.46 లక్షల నిధులు వెనక్కి వెళ్లాయని ఇప్పుడు నిధులు అందుబాటులో ఉంటే బిల్లులు ఎందుకు చెల్లించరనే ప్రశ్నను ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరుడు లేవదీస్తున్నారు. పక్కాగా లేని రికార్డులు, పత్రాలతో ప్రజాధనం చెల్లింపులు చేయమని.. అలాచేస్తే తమ ఉద్యోగాలు పోతాయని మొరపెట్టుకుంటున్నా వినిపించుకోవడం లేదు.
కమిషనర్‌ అనుమతి వద్దంటా..
2020 నుంచి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న ఔషధ, డైట్‌ బిల్లులు చెల్లించాలంటే ఏపీవీపీ కమిషనర్‌ అనుమతి తీసుకోవాలి. సమగ్ర విచారణకు కమిషనర్‌ ఆదేశిస్తారు. అన్ని పత్రాల్ని కమిషనర్‌ వద్దకు పంపిస్తే పరిశీలించి సక్రమంగా ఉంటే నగదు చెల్లింపునకు అనుమతి ఇస్తారు. లేదంటే బిల్లులు చెల్లించాల్సి అవసరం లేదని స్పష్టం చేస్తారు. కమిషనర్‌ వద్దకు దస్త్రం పంపితే వెనక్క వస్తుందనే భయంతో ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు ఇష్టపడట్లేదు. ఏదైనా ఇక్కడే చేయాల్సిందేనని చెబుతున్నారు. అలా చేస్తే ఇబ్బందులొస్తాయంటే మీరు పక్కకు తప్పుకోండని పర్యవేక్షకుడికి చెబుతున్నారు. తన పనితీరు సక్రమంగా ఉన్నప్పుడు బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాలని ఆయన ఎదురు ప్రశ్నిస్తే ఉన్నతాధికారితో పక్కకు తప్పుకోవాలని చెప్పిస్తున్నారు. సరైన పత్రాల్లేని బిల్లులకు నగదు చెల్లిస్తారా లేక ప్రజాధనాన్ని కాపాడతారా అని వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు