logo

సరిదిద్దుకోలేని తప్పిదం!

ఈ ఏడాది మేలో గుంటూరు కేంద్రంగా నిర్వహించిన పదోతరగతి మూల్యాంకన కేంద్రంలో కొందరు ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యం... ప్రస్తుతం రీ వెరిఫికేషన్‌ పుణ్యమా అని బహిర్గతమైంది.

Published : 04 Jun 2023 04:54 IST

‘పది’ మూల్యాంకనంలో నిర్లక్ష్యం  
రీ వెరిఫికేషన్‌లో బహిర్గతం...
ఈనాడు-అమరావతి

మూల్యాంకనం నిర్వహించిన స్టాల్‌ బాలికల ఉన్నత పాఠశాల

ఈ ఏడాది మేలో గుంటూరు కేంద్రంగా నిర్వహించిన పదోతరగతి మూల్యాంకన కేంద్రంలో కొందరు ఉపాధ్యాయుల బాధ్యతారాహిత్యం... ప్రస్తుతం రీ వెరిఫికేషన్‌ పుణ్యమా అని బహిర్గతమైంది. వారి నిర్వాకం వల్ల ఎందరో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. రీ వాల్యుయేషన్‌, రీ వెరిఫికేషన్‌లో భాగంగా కొందరు విద్యార్థులకు గణనీయంగా మార్కులు కలవటమే దీనికి నిదర్శనం. మొత్తంగా ఉపాధ్యాయులు చేసిన పొరపాట్లు, తప్పిదాలు బయట పడటంతో బాధ్యులైన టీచర్లలో ఆందోళన నెలకొంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాల సమాధాన పత్రాలు గుంటూరు రాగా... వాటిని ఇక్కడ ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశారు. మేలో వెల్లడైన ఫలితాల్లో కొందరు విద్యార్థులు తమకు ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనీ, పరీక్ష బాగానే రాశామనీ.. అయినా మార్కులు తక్కువ వచ్చాయనీ, ఎక్కడో పొరపాటు జరిగి ఉండొచ్చని అనుమానించారు. కొందరు విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన రీ వెరిఫికేషన్‌, రీ టోటలింగ్‌కు రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారి పేపర్లను తిరిగి గత కొద్ది రోజుల నుంచి నగరంలోని స్టాల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు వాల్యుయేషన్‌ చేస్తున్నారు. రీవెరిఫికేషన్‌ కావటంతో తొలుత టీచర్లతో వాల్యూ చేయించి ఆతర్వాత త్రీమెన్‌ కమిటీకి పంపుతున్నారు. ఆ కమిటీ పరిశీలించి ఒకవేళ మార్కులు పెరిగితే పెరిగినట్లు, ఇవ్వాల్సిన మార్కుల కన్నా తక్కువ వేస్తే వాటికి కొన్ని మార్కులు అదనంగా ఇవ్వొచ్చని వారు తుదిగా రాష్ట్రస్థాయి కమిటీకి సిఫార్సు చేస్తున్నారు.

త్రీమెన్‌ కమిటీ సిఫార్సులు ఇవీ..

జిల్లా స్థాయిలో త్రీమెన్‌ కమిటీ సాంఘిక శాస్త్రం సబ్జెక్టులో ముగ్గురు విద్యార్థులకు గరిష్ఠంగా 30-34 మార్కులు కలిపింది. హిందీలో అయితే ఓ విద్యార్థికి 35 మార్కులు అదనంగా వేశారు. తెలుగు, ఆంగ్లంలోనూ 15-20 మార్కుల చొప్పున, ఇతర సబ్జెక్టుల్లో కొందరికి 10 మార్కులు మరికొందరికి 3-7 మార్కుల వరకు కలిపినట్లు విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. సాంఘిక శాస్త్రంలో ఓ విద్యార్థికి తొలివిడత మూల్యాంకనంలో 60 మార్కులే వచ్చాయి. ఆ విద్యార్థికి రీ వెరిఫికేషన్‌లో 4 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాసినా వాటి మార్కులను టోటలింగ్‌లో కలపలేదని గుర్తించారు. దీంతో ఆ విద్యార్థికి అన్యాయం జరిగిందని ఆ పొరపాటును తాజాగా సరిదిద్దామని ఉపాధ్యాయులు తెలిపారు. ఇలా అనేక సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల పరంగా జరిగిన పొరపాట్లు గుర్తించారు. ఆరేడు మార్కులు ఇవ్వాల్సి ఉంటే 2-3 మార్కులే ఇచ్చారని మరికొందరు విద్యార్థుల విషయంలో గుర్తించారు. మూడు టోటలింగ్‌ కాలమ్స్‌ ఉండగా కొందరు ఉపాధ్యాయులు రెండు కాలమ్స్‌లో మార్కులనే కూడి అవే తుది మార్కులుగా వేసేశారు. మొత్తంగా మూల్యాంకన పొరపాట్లు ఏ స్థాయిలో జరిగాయో అర్థమౌతోంది. రూ.వెయ్యి చెల్లించి రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోలేని వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమవుతోంది.

ఒత్తిడితో జరిగిందని వేదన...

మూల్యాంకన కేంద్రంలో ప్రశాంత వాతావరణం లేకపోవటం, వసతులు లోపించటం, సాధ్యమైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేయాలని విపరీతమైన ఒత్తిడి తేవటంతో హడావుడిగా చేయటంతో పొరపాట్లు, తప్పులు జరగటానికి ఆస్కారం ఏర్పడిందని ఉపాధ్యాయవర్గం చెబుతోంది. కొందరు అనారోగ్యంతో బాధపడుతూ మూల్యాంకనం చేయలేమని చెప్పినా టీచర్లు కొరత ఉన్నారని బలవంతంగా రప్పించటం వారు విధినిర్వహణలో కొంత ఒత్తిడికి గురికావటం వంటివి కూడా పొరపాట్లకు కారణాలుగా చెబుతున్నారు. సగటున ఒక్కో ఉపాధ్యాయుడికి రోజుకు 40 పేపర్లు ఇచ్చి దిద్దించారు. అసలే ఎండలు, ఉక్కపోతల నడుమ వాటిని మూల్యాంకనం చేయాల్సి వచ్చిందని తప్పులు దొర్లటానికి ఇదీ ఓ కారణమేనని సీనియర్‌ ఉపాధ్యాయుడొకరు చెప్పారు. మొత్తంగా రీవెరిఫికేషన్‌తో కొందరు విద్యార్థులకు న్యాయం జరగటం ఊరటనిస్తోంది. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నాలుగైదు రోజుల్లో వారి చిరునామాలకు జిరాక్సు పేపర్లు పంపటానికి ప్రభుత్వ పరీక్షల విభాగం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖవర్గాలు తెలిపాయి. ఈ తప్పిదాలకు బాధ్యులైన ఉపాధ్యాయులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హడలిపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని