పనులు జరిగేనా.. నీరు కదిలేనా?
కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు, మురుగునీటి కాలువల దుస్థితి మారేలా లేదు. కాలువల్లో మరమ్మతులకు చాలా ఆలస్యంగా టెండర్లు పిలిచారు. వాటిని ఖరారు చేసే సరికి ఈ నెల రెండో వారం వస్తుంది.
ఆలస్యంగా టెండర్లు
ఖరీఫ్ సమీపిస్తున్నా నిర్వహించని నీటిపారుదల సలహామండలి సమావేశం
న్యూస్‌టుడే, బాపట్ల
రేపల్లె మురుగు కాలువలో గుర్రపుడెక్క
కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు, మురుగునీటి కాలువల దుస్థితి మారేలా లేదు. కాలువల్లో మరమ్మతులకు చాలా ఆలస్యంగా టెండర్లు పిలిచారు. వాటిని ఖరారు చేసే సరికి ఈ నెల రెండో వారం వస్తుంది. వర్షాలు కురిసి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైతే పనులు చేపట్టే పరిస్థితి ఉండదు. రూ.ఐదు లక్షల లోపు పనులు నామినేషన్ పద్ధతిని కేటాయించాలని నిర్ణయించారు. అధ్వాన కాలువలతో పంటల సాగుకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి.
* కాలువల్లో మరమ్మతులు చేపట్టటానికి గత ఏప్రిల్‌లో అనుమతులు ఇచ్చినా జలవనరుల శాఖ అధికారులు పనులు ఖరారు చేసి టెండర్లు పిలవటంలో జాప్యం జరిగింది. జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశాన్ని ఇంకా నిర్వహించలేదు. ఖరీఫ్‌లో కాలువలకు సాగునీరు ఎప్పుడు విడుదల చేసేది అధికారికంగా ప్రకటించలేదు. గతేడాది మే 19నే నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి జూన్ 10 నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
* సాగు, మురుగునీటి కాలువల్లో పూడిక తీత, కాంక్రీటు పనులకు గత నెల మూడో వారంలో టెండర్లు పిలిచారు. కొన్ని టెండర్లు ఈ నెల 6న, మిగతావి 9న తెరవనున్నారు. రూ.ఐదు లక్షల లోపు పనులు నావినేషన్ పద్ధతిన కేటాయించటానికి రంగం సిద్ధం చేశారు. 17 పనులు షట్టర్లకు సంబంధించి చేయాల్సి ఉంది. వీటిని సాంకేతిక పరిశీలనకు పంపించారు.
* డెల్టాలో సాగు, మురుగు నీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి పూడిక ఏర్పడింది. కాలువ కట్టలు కోతకు గురై బలహీనపడ్డాయి. షట్టర్లు తుప్పుపట్టి దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఊడిపోయాయి. కాలువల్లో రక్షణ గోడలు, కాంక్రీటు లైనింగ్ దెబ్బతింది. వీటికి అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సి ఉంది. మే మొదటి వారంలోగా టెండర్లు ఖరారు చేసి ఈ పాటికే సగానికి పైగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెండు వారాలకు పైగా జాప్యం చోటు చేసుకుంది. కాలువల్లో పనులకు ఇటీవల పిలిచిన టెండర్లు ఖరారు కావటానికి ఈ నెల రెండో వారం పడుతుంది. అప్పటికి వర్షాకాలం ప్రారంభమై పనులు చేపట్టటానికి అవకాశం ఉండదు. జూన్ మూడు, నాలుగు వారాల్లో సాగునీరు విడుదల చేస్తే కాలువల్లో మరమ్మతులపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇటీవల నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కాలువల్లో ఈ నెల 15 లోగా మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి కాదు కదా అప్పటికే టెండర్లు పిలిచిన పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించటం లేదు.
* కాలువల్లో రూ.ఐదు లక్షల లోపు పనులు నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తున్నా చేయటానికి ముందుకు రావటానికి ఇష్టపడటం లేదు. గతేడాది చేపట్టిన పనుల తాలూకూ బిల్లులే ఇంకా చెల్లించలేదు. తాజా పనుల బిల్లులు ఎప్పుడు వస్తాయోనని వెనుకంజ వేస్తున్నారు.
పీటీ ఛానల్‌లో దెబ్బతిన్న షట్టరు
సాగునీటి కాలువల్లో చేపట్టాల్సిన పనులు: 99
కేటాయించిన నిధులు: రూ.6.81 కోట్లు
ఇప్పటికే టెండర్లు పిలిచినవి : 52
రూ.ఐదు లక్షల లోపు నామినేషన్‌కు కేటాయించనున్నవి : 30
ఆమోదం పొందాల్సిన షట్టర్ల పనులు: 17
మురుగునీటి కాలువల్లో చేపట్టాల్సినవి : 58
కేటాయించిన నిధులు: రూ.6.23 కోట్లు
టెండర్లు పిలిచినవి: 40
నామినేషన్ పద్ధతిలో కేటాయించనున్నవి: 18
నామినేషన్ పనులు వెంటనే చేపడతాం
కాలువల్లో రూ.ఐదు లక్షల లోపు పనులు నామినేషన్ విధానంలో వెంటనే చేపడతాం. టెండర్లు ఖరారు కాగానే మిగతా పనులు ప్రారంభిస్తాం. కాలువల్లో అత్యవసర మరమ్మతులు చేసి ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.
మురళీకృష్ణ, జిల్లా జలవనరుల శాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?
-
పాపికొండల యాత్ర ప్రారంభం
-
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్
-
Rajinikanth: కరుణానిధి సంభాషణలా.. అమ్మబాబోయ్!