logo

వర్షాలతో ఇటుక పరిశ్రమ కుదేలు

గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవిలో సైతం తరచూ కురుస్తున్న వర్షాలు స్థానిక రైతులనే కాదు ఇటుక వ్యాపారులనూ నష్టాల పాల్జేశాయి.

Published : 04 Jun 2023 04:54 IST

మండుటెండలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న వలస కూలీలు

కొల్లూరు, న్యూస్‌టుడే: గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవిలో సైతం తరచూ కురుస్తున్న వర్షాలు స్థానిక రైతులనే కాదు ఇటుక వ్యాపారులనూ నష్టాల పాల్జేశాయి. అకాల వర్షాలు, తుపానుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా, అత్యంత నాణ్యమైన ఇటుకను ఉత్పత్తి చేసే కొల్లూరు ఇటుక రాతి పరిశ్రమ ఉత్పాదక సామర్థ్యం దారుణంగా దెబ్బతింది. ఏటా 40కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఇటుక ఇక్కడ ఉత్పత్తి అయ్యేది. అకాల వర్షాల పుణ్యమాని ఈ ఉత్పాదకత 30 కోట్లకు మించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటుక తయారీకి అవసరమైన ఊక (వరి పొట్టు), బొగ్గు, మట్టి ధరలు కొన్ని రెట్లు పెరిగిపోవడానికి ఈ అకాల వర్షాలు తోడు కావడంతో ఇటుక వ్యాపారం కుదేలైంది. దీనికి తోడు అప్పటికే తయారు చేసిన ఇటుక పలుమార్లు కల్లాల్లో తడిసిపోవడంతో ఆరిన ఇటుకను కాల్చేందుకు అవసరమైన బట్టీల ఏర్పాటు ఎప్పటికప్పుడు ఆలస్యమైంది. ఇటుక కాల్చేందుకు రూ.లక్షలు వెచ్చించి సిద్ధంగా ఉంచుకున్న మట్టి, ఊక, బొగ్గు అలాగే ఉండిపోయాయి. వీటిని ఎంత ఎక్కువగా వినియోగించి బట్టీలు నిర్మించి ఇటుకను కాల్చి అమ్మకాలు సాగిస్తే అంత తక్కువ నష్టాలతో బయటపడొచ్చని తయారీదారులు ఆరాట పడుతున్నారు. వర్షానికి తడిసి పనికి రాకుండా పోయిన ఇటుకను కుండీల్లో వేసి ఆ మట్టిని తిరిగి ఇటుకగా తయారు చేయిస్తున్నారు.

కత్తెర్లంకలో అకాల వర్షానికి తడిసి పాడైన ఇటుక (పాతచిత్రం)

ఎండల్లోనూ కొనసాగుతున్న పనులు

ఏటా డిసెంబరులో ఇటుక తయారు చేసే వలస కూలీలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొద్ది సంఖ్యలో అత్యధిక సంఖ్యలో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. వీరి వెంటే వారం పదిరోజుల వ్యవధిలో ఇటుక బట్టీలు పేర్చే పనిని చేసే కూలీలు ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వీరు సాధారణంగా ఏప్రిల్‌ చివరి వారం లేదా మే మొదటి వారంలో అంటే వేసవి ఎండలు తీవ్రం అయ్యే నాటికి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతారు. ఈ ఏడు వర్షాల కారణంగా బట్టీల పని పూర్తి కాకపోవడం వల్ల జూన్‌ నెల ప్రారంభమైనా ఇటుక బట్టీలు పేర్చే పనిని ఇటుక తయారీదారులు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో అదనపు ఖర్చు భరించడంతో పాటు ఇటుక తయారీ తరుణాన్ని నెల రోజుల పాటు పొడిగించక తప్పని పరిస్థితి బట్టీ యజమానులకు ఏర్పడింది. కూలీలు మండుటెండను సైతం లెక్కచేయక ఇటుక బట్టీలు పేర్చే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటుక ధరలు పెరిగి వినియోగదారుడిపై ఆ మేరకు భారం పడే అవకాశం ఉంది. ఇటుక ధర ఎంత పెరిగినా లాభాల సంగతి అలా ఉంచి కనీసం కోలుకుని రానున్న తరుణంలో తయారీ కొనసాగించగలిగితే చాలని వ్యాపారులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని