logo

రద్దీ చూసుకుని ఏమారుస్తారు

నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దర్ని.. బొమ్మ పట్టించిన వైనం కొత్తపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుల వివరాలను కొత్తపేట సీఐ అన్వర్‌ బాషా శనివారం వెల్లడించారు.

Published : 04 Jun 2023 04:54 IST

నకిలీనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు

నిందితుల వివరాలు తెలుపుతున్న కొత్తపేట సీఐ అన్వర్‌బాషా, చిత్రంలో పోలీసులు

నెహ్రూనగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దర్ని.. బొమ్మ పట్టించిన వైనం కొత్తపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుల వివరాలను కొత్తపేట సీఐ అన్వర్‌ బాషా శనివారం వెల్లడించారు. దాచేపల్లి మండలం, నడికుడి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి సాగర్‌బాబు శనివారం రాత్రి కొత్తపేట గుంటగ్రౌండ్‌లోని ఓ దుకాణంలో బొమ్మను కొనుగోలు చేసి రూ.500 నోటు ఇచ్చాడు. దుకాణ నిర్వాహకుడు ఆ నోటు నకిలీదిగా గుర్తించి సాగర్‌బాబును పట్టుకొని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ అన్వర్‌బాషా, ఎస్సై మీరజ్‌లు సాగర్‌బాబును అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద ఉన్న నకిలీ రూ.500 నోట్లు 68 స్వాధీనం చేసుకున్నారు. సీఐ లోతుగా దర్యాప్తు చేయగా సాగర్‌బాబుతోపాటు అతని స్నేహితుడు రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన సంకురాత్రి యలమంద నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు తేలడంతో అతని కోసం సీఐ, ఎస్సైలతో పాటు ఏఎస్సై ఆంతోనీ, హెచ్‌సీ కోటేశ్వరరావు, పీసీలు శ్రీకాంత్‌రెడ్డి, దాసు, నాగసురేష్‌ గాలింపులు చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో జీజీహెచ్‌ వద్ద సంచరిస్తున్న యలమందను అరెస్టు చేశారు. అతని వద్ద నకిలీ రూ.500 నోట్లు 16, నకిలీ రూ.100 నోట్లు 68 స్వాధీనం చేసుకున్నారు. సాగర్‌బాబుపై గొలుసు చోరీలు, యలమందపై మద్యం అక్రమ విక్రయాల కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇద్దరు జైలులో పరిచయమై బయటకు వచ్చిన తర్వాత నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వీళ్లకు ఓ వ్యక్తి రూ. 25 వేలు అసలు నోట్లు తీసుకొని రూ. లక్ష నకిలీ నోట్లు ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. నకిలీ నోట్లను ఎగ్జిబిషన్‌, జనరద్దీ ప్రాంతాల్లో మార్చి సొమ్ము చేసుకుంటారన్నారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద రూ.49,500 నకిలీ నోట్లు జప్తుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. ముఠాలోని మరికొందరికోసం గాలింపులు చేస్తున్నామని చెప్పారు. గంటల వ్యవధిలో నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ అభినందించారు.

స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని