logo

మేము క్షేమం

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో పలువురు మృత్యువాతపడగా, అనేక మందికి తీవ్ర గాయాలైన విషయం విధితమే. అందులో చీరాల ప్రాంతవాసులు ఉన్నారని వార్తలు రావడంతో స్థానికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.

Updated : 04 Jun 2023 05:23 IST

కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం ఇచ్చిన రైలు ప్రయాణికులు
న్యూస్‌టుడే - బాపట్ల, చీరాల పట్టణం

రైలులో ప్రయాణించిన చీరాల ప్రాంత వాసులు

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో పలువురు మృత్యువాతపడగా, అనేక మందికి తీవ్ర గాయాలైన విషయం విధితమే. అందులో చీరాల ప్రాంతవాసులు ఉన్నారని వార్తలు రావడంతో స్థానికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఇక్కడి వారంతా క్షేమంగా ఉన్నారని తెలియడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన యశ్వంతపూర్‌-హౌరా రైలులో స్థానిక బెస్తపాలెంలో ఉండే రెడీమేడ్‌ వస్త్ర దుకాణాలకు చెందిన షేక్‌ ఆలీ, షేక్‌ బాషా, షేక్‌ ఆఫీజ్‌, నారాయణ, అజారుద్దీన్‌, ఎం.రాజేష్‌లు ఏసీ బోగీలో రిజర్వేషను చేయించుకుని చీరాల నుంచి బయలుదేరారు. ప్రమాదంలో ముందుగా ఉన్న కొన్ని బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. వీరి బోగి మధ్యలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. వీరందరూ అక్కడ నుంచి బస్సులో తమ గమ్యానికి చేరుకుని వస్త్రాల కొనుగోలుకు వెళ్లామని, తామంతా సురక్షితమని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చారు. చీరాలలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన పదిమంది ఇదే రైలులో విజయనగరం వరకు వెళ్లారు. ఈమేరకు స్థానిక జీఆర్పీ పోలీసులూ వీరి నుంచి వివరాలు సేకరించి, అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదం నుంచి బాపట్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. యశ్వంత్‌పూర్‌ నుంచి హౌరా వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలు బీ1, బీ2లో బాపట్ల రైల్వేస్టేషన్లో గురువారం రాత్రి 9.41 గంటలకు ఇద్దరు ప్రయాణికులు ఎక్కారు. శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగినట్లు మీడియాలో వార్తలు రాగానే ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రైలులో ప్రయాణించిన ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం రావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


గుంటూరు స్టేషన్లోనే పాట్లు

వీరంతా ఒడిశా ప్రాంతం వారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తారు. ఆయా ప్రాంతాల నుంచి వీరంతా గుంటూరు నుంచి వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలులో తొలుత విశాఖ వెళ్లి అక్కడ నుంచి ఒడిశా చేరాలనుకున్నారు. సింహాద్రి లేకపోవడం.. అక్కడి నుంచి ఒడిశా వెళ్లే రైళ్లు రద్దు... దారి మళ్లించారని తెలిసి స్టేషన్‌లోనే ఆగిపోయారు.


కలెక్టరేట్లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

బాపట్ల రైల్వేస్టేషన్‌లో సహాయ కేంద్రం వద్ద ఎస్‌ఎస్‌ మీనా

బాపట్ల: రైలు ప్రమాద ఘటనపై ప్రయాణికుల బంధువులకు సమాచారం ఇవ్వటానికి కలెక్టరేట్లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. అత్యవసర సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నంబరు 87126 55885 అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్‌ రంజిత్‌బాషా మాట్లాడుతూ కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలు పని చేస్తుందని తెలిపారు. ప్రమాద ఘటనలో జిల్లా వాసులుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. స్థానిక రైల్వేస్టేషన్లో స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌ఎస్‌ మీనా ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.


రైళ్లు రద్దు

బాపట్ల, న్యూస్‌టుడే: ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. హౌరా-యశ్వంత్‌పూర్‌, హౌరా-చెన్నై సెంట్రల్‌ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు రద్దు చేశారు. రైళ్ల రద్దు కారణంగా కోల్‌కతా, ఖరగ్‌పూర్‌, చెన్నై, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లటానికి ముందుగా బెర్తులు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పలువురు తమ ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. కొందరు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల్లో వెళ్లారు.


ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నాం

ఏమైందో తెలియదు. రైలు వేగంగా వెళుతోంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఏం జరిగిందో తెలియక అందరూ ఒక్కసారిగా కేకలు పెట్టాం. ఒకానొక సమయంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. మేం ఏసీ బోగీలో ఉన్నాం. మాకు ముందుగా ఉన్న బోగీలు ఎగిరిపడడంతో అవి విడిపోయాయి. మార్గమధ్యలో ఈ ఘటన జరగడంతో అక్కడ నుంచి బయటకు వచ్చి బస్సులో అందరం కోల్‌కతా వెళ్లాం. దేవుడిదయ వల్ల మేమంతా క్షేమం. వస్త్రాలు కొనుగోలు చేసిన తరువాత అక్కడ నుంచి బయలుదేరి చీరాల వస్తాం.

నారాయణ, చీరాలవాసి


స్వల్ప వ్యవధిలో మహా విషాదం

మాది చీరాల మండలం గవినివారిపాలేం. సైన్యంలో పనిచేస్తుంటా. సెలవులపై స్వగ్రామానికి వచ్చా. అవి ముగియటంతో విధుల్లో చేరటానికి యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతా బయలుదేరా. మార్గమధ్యలో ఒడిశాలో యశ్వంత్‌పూర్‌-హౌరా రైలును కోరమాండల్‌ బోగీలు రాసుకుంటూ వెళ్లడంతో నిప్పురవ్వలు వచ్చాయి. బోగీ కుదుపులకు గురవడంతో ప్రయాణికులందరం భయపడ్డాం. నేను ప్రయాణించే ఏసీ బోగీ రైలు మధ్యలో ఉండటంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డా. ఘటన తర్వాత అంతా చిమ్మ చీకటి నెలకొంది. చీకట్లోనే బోగీల నుంచి బయటకు వచ్చా. ఘోర ప్రమాదంలో రైలు బోగీలు చెల్లాచెదురుగా పడి లోపల ప్రయాణికులు తీవ్రంగా గాయపడి హాహాకారాలు చేశారు. ఆ దృశ్యం తీవ్రంగా బాధించింది. ఆ సమయంలో అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది.

అబ్దుల్‌, సైనికుడు, చీరాల మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు