logo

బంధాలు చెదిరి..బతుకులు చితికి..

రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు వారు.. ఉదయాన్నే లేచి ఉపాధి పనులకు వెళ్లొచ్చారు. బంధువుల ఇంట్లో ఆడపిల్ల శుభకార్యం ఉండడంతో అందరూ ఆనందంగా ప్రయాణానికి సిద్ధమయ్యారు..

Published : 06 Jun 2023 05:14 IST

ఏడుగురి మృతితో ఘొల్లుమన్న కొండేపాడు

క్షతగాత్రులను అంబులెన్స్‌ వద్దకు చేరుస్తున్న స్థానికులు

కొండేపాడు (ప్రత్తిపాడు), వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు వారు.. ఉదయాన్నే లేచి ఉపాధి పనులకు వెళ్లొచ్చారు. బంధువుల ఇంట్లో ఆడపిల్ల శుభకార్యం ఉండడంతో అందరూ ఆనందంగా ప్రయాణానికి సిద్ధమయ్యారు.. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత ట్రాక్టర్‌లో బయలుదేరారు.. అందరూ బంధువులే కావడంతో మాటలు చెప్పుకొంటూ సంతోషంగా సాగుతున్నారు. ఇంతలోనే అనుకోని ప్రమాదం.. రోడ్డు పక్కకు వెళ్తూ ట్రాక్టర్‌ ఒక్కసారిగా కాలువలోకి బోల్తా కొట్టేసింది.. వట్టిచెరుకూరు మీదుగా వెళ్తుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వట్టిచెరుకూరు శివారులో పెట్రోలు బంకు వద్ద సాయం కోసం క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది.. ఘటనా స్థలిలోనే ముగ్గురు చనిపోగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఏడుగురు మృతి చెందడంతో ప్రత్తిపాడు మండలం కొండేపాడు గ్రామం విషాదంలో మునిగిపోయింది. ప్రమాదం విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలికి, జీజీహెà్కు తరలివచ్చి బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మరణించిన వారంతా మహిళలే కావడంతో వారి పిల్లలకు తల్లులు లేకుండా పోయినట్లు అయింది.

మృతదేహాలను పరిశీలిస్తున్న ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

కన్నీటి పర్యంతం..

కొండేపాడు ఎస్సీ పల్లెలో ఏడుగురు మృతి చెందడం అందరినీ కలిచి వేసింది. ఐదు వీధులుంటే అన్ని వీధుల్లోనూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు కనిపించాయి. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బంధువుల చివరి చూపుల కోసం మార్చురీ బాక్సుల కొరత నెలకొంది. ప్రత్తిపాడు ఎంపీˆపీˆ దాసరి అన్నమ్మ సొంత గ్రామం కొండేపాడు. ఈమె కూడా ట్రాక్టర్‌లోనే శుభకార్యానికి వెళ్లాల్సి ఉండగా, ఎండగా ఉందని బయలుదేరలేదని ఎంపీˆపీˆ ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులను ఎంపీపీ పరామర్శించారు. మృతులు, గాయపడిన వారంతా పేద మహిళలు. రోజు వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాలను పోషిస్తున్నారు.

నిర్లక్ష్యం, వేగంతోనే ప్రమాదం!

అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి ఏమాత్రం అవకాశం లేని చోట ట్రాక్టర్‌ పడిపోవడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాలేదని, ఆపై ట్రాక్టర్‌ కుడి వైపునకు వెళ్లి పడడంతో ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. స్టీరింగ్‌ పట్టేయడంతో ఒక్కసారిగా కాల్వలోకి బోల్తా కొట్టిందని ట్రాక్టర్‌ నడుపుతున్న కె.ప్రశాంత్‌ అనే యువకుడు పోలీసులకు తెలిపాడు. ఆ యువకుడికి డ్రైవింగ్‌ లైసెన్సు లేదని గుర్తించారు. ప్రమాదం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగింది. డ్రైవర్‌కు మద్యం అలవాటు ఏమైనా ఉందా? అతనికి కంటిచూపు మందగించడం, రక్తపోటు వంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకుంటున్నారు. ప్రమాద స్థలికి సమీపంలోని పెట్రోలు బంకులో ఉన్న సీసీ ఫుటేజీలు సేకరించి పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఫుటేజీలో ట్రాక్టర్‌ రెండు పల్టీలు కొట్టినట్లు ఉండడంతో వేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరగ్గానే సమీపంలోని వట్టిచెరుకూరు గ్రామస్థులు స్పందించి సహాయక చర్యలకు ముందుకొచ్చారు. వారు ఘటనా స్థలికి చేరుకుని మృతులు, క్షతగాత్రులను బయటకు తీశారు. మరోవైపు 108, పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామానికి చెందిన బొట్ల అంకేశ్వరరావు తన ట్రాక్టర్‌ను తెచ్చి స్థానికుల సహకారంతో మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

శోకసంద్రంలో నిర్మల కుటుంబ సభ్యులు, బంధువులు


పెట్రోలు బంకు వారిని సాయం కోరాం...

ప్రత్యక్ష సాక్షి, ట్రాక్టర్లో ప్రయాణించిన రూతమ్మ కథనం ప్రకారం... ఉదయాన్నే ఉపాధి పనికి వెళ్లి వచ్చాం. పొన్నూరు మండలం జూపూడిలో అమ్మాయి శుభకార్యం ఉండడంతో ట్రాక్టరులో బయలుదేరాం. వట్టిచెరుకూరులో మంచి నీళ్లు తాగాం. కొంత దూరం వెళ్లిన తర్వాత ట్రాక్టరు ఒక్కసారిగా పక్కకు వెళ్లి కాల్వలో పడుతున్న క్రమంలో చివరిలో ఉన్న నేను (రూతమ్మ), కుసుమ, సుజాత ముగ్గురం దూరంగా పడ్డాం. మాకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారంతా ట్రాక్టరు కిందనే ఉన్నారు. మేము సమీపంలోని పెట్రోలు బంకులోకి వెళ్లాం. ‘అయ్యా... మా వాళ్ల ప్రాణాలు కాపాడాలని కోరితే, వాళ్లు ఫోను చేస్తే 15 నుంచి 20 నిమిషాల్లో జేసీబీ వచ్చింది. ట్రాక్టరు ట్రక్కును జేసీబీ పైకి లేపి పట్టుకుంటే దారిన వెళ్లే వారు వచ్చి ట్రక్కు కింద నుంచి మావాళ్లను బయటకు తీశారు. ఎక్కువ సమయం అలాగే ఉంటే మరింత మంది ప్రాణాలు పోయేవి. అదుపు తప్పి పడి పోయే క్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ దూకేసి ప్రాణాలను కాపాడుకున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.


బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

నగరంపాలెం(గుంటూరు), న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందటం దురదృష్టకరమని, ప్రమాద వార్త తెలుసుకున్న సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జేసీ రాజకుమారి జీజీహెచ్‌లో సోమవారం పరామర్శించి, మృతదేహాలకు నివాళులర్పించారు. మంత్రి రాంబాబు, ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ ట్రాక్టర్‌ ప్రమాదం విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన వెంటనే ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.25 వేలు ప్రకటించారన్నారు. మృతదేహాలకు హుటాహుటిన పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా తరలించారు.
క్షతగాత్రులను పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి.. ట్రాక్టర్‌ బోల్తా పడి గాయపడిన వారిని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్పవార్‌ సోమవారం జీజీహెచ్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా భారతీ ప్రవీణ్పవార్‌ మాట్లాడుతూ క్షతగాత్రులను అవసరమైతే ఎయిమ్స్‌కి పంపి చికిత్స చేయిస్తామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్‌ సూపరిటెండెంట్‌ ప్రభావతిని ఆదేశించారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో పాటిబండ్ల రామకృష్ణ, మాగంటి సుధాకర్‌యాదవ్‌, పాతూరి నాగభూషణం, తోట రామకృష్ణ, వనమా నరేంద్ర తదితరులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని