logo

బిల్లులివ్వడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి

ఉద్యాన శాఖ నుంచి తనకు రావాల్సిన బిల్లులను ఇప్పించాలని, లేకపోతే కారుణ్య మరణానికి అనుమతివ్వాలని గుంటూరుకు చెందిన కొల్లిపర హరికిషన్‌ గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీ ఇచ్చారు.

Published : 06 Jun 2023 05:14 IST

స్పందనలో ప్లకార్డు ప్రదర్శిస్తున్న హరికిషన్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఉద్యాన శాఖ నుంచి తనకు రావాల్సిన బిల్లులను ఇప్పించాలని, లేకపోతే కారుణ్య మరణానికి అనుమతివ్వాలని గుంటూరుకు చెందిన కొల్లిపర హరికిషన్‌ గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీ ఇచ్చారు. హరికిషన్‌ మాట్లాడుతూ ‘2020, 2021సంవత్సరాల్లో ఉద్యాన శాఖలోని ఎఫ్‌పీవోలకు విద్యుత్తు ఆటోలను మూడు బిల్లులపై పంపిణీ చేశాను. మూడింటికి కలిపి ఒకేరకమైన కొనుగోలు బిల్లును ఇచ్చారు. ఇందులో రెండు బిల్లులను ఉద్యాన శాఖ కమిషనర్‌ కార్యాలయం నగదు ఇచ్చింది. మూడో బిల్లు నగదు కోసం ఉద్యాన శాఖ కమిషనర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెండేళ్లలో సుమారు వందసార్లు అధికారులను కలిసి గోడును విన్నవించినా ఎటువంటి స్పందన లేదు. కొవిడ్‌ సమయంలో రెండుసార్లు అనారోగ్యానికి గురయ్యాను. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. కుమారుడి కళాశాల ఫీజు కూడా చెల్లించలేని దుర్భర పరిస్థితిలో ఉన్నాను. నేను వ్యాపార పరంగా ఒకరికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో చేబ్రోలు పోలీసులు తీసుకెళ్లి అసభ్య పదజాలంతో తిడుతూ హెచ్చరించారు. జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు నా దయనీయ పరిస్థితిని చూసైనా నగదు వెంటనే చెల్లించాలి. లేకపోతే కారుణ్య మరణానికి అనుమతివ్వాలి’.. అని వేడుకొన్నారు. అనంతరం హరికిషన్‌.. ఉద్యాన శాఖ కమిషనర్‌ గారూ బిల్లు నగదు ఇప్పించండంటూ స్పందనలో ప్లకార్డు ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని