logo

లోపాల పుట్ట!

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి సర్వీస్‌ పాయింట్ల కేటాయింపు నుంచి పదోన్నతుల దాకా పరిశీలిస్తే ఎన్నో అవకతవకలు, లోపాలు ఉన్నాయని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 06 Jun 2023 05:14 IST

జీఓకు విరుద్ధంగా సర్వీస్‌ పాయింట్లు!
ఎస్‌జీటీలకు ఒకలా.. ఎస్‌ఏలకు మరోలా...
సంఘాల అభ్యంతరంతో కొన్ని పరిష్కారం

గుంటూరు డీఈఓ కార్యాలయం ఐటీ విభాగానికి
అభ్యంతరాలు తెలియజేయడానికి వచ్చిన ఉపాధ్యాయులు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి సర్వీస్‌ పాయింట్ల కేటాయింపు నుంచి పదోన్నతుల దాకా పరిశీలిస్తే ఎన్నో అవకతవకలు, లోపాలు ఉన్నాయని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని సరిదిద్దాలని యంత్రాంగాన్ని కలిసి కోరితే తమ చేతుల్లో ఏమీ లేదని, సాఫ్ట్‌వేర్‌లో ఎలా వస్తే అలాగే పరిగణనలోకి తీసుకున్నామని యంత్రాంగం చెప్పడంతో బాధిత ఉపాధ్యాయులు, సంఘాలు ఇదేం తీరు అని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని టీచర్ల తుది సీనియారిటీ జాబితాను ఆదివారం ప్రకటించారు. ఆ జాబితాలో అనేక తప్పులు ఉండడంతో వాటిని గుర్తించి సరి చేయాలని సోమవారం గుంటూరులోని డీఈఓ కార్యాలయానికి ఉపాధ్యాయులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యాలయ అధికారులు ఒక్కొక్కరిని పిలిచి వారి నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో కొందరికి తిరిగి స్టేషన్‌ పాయింట్లు కలిపారు. మరికొందరికి మాత్రం మీకు కలవవని చెప్పి పంపడంతో సంఘాల నాయకులను కలిసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీనియారిటీ జాబితాలో వచ్చిన మార్కులే ఫైనల్‌ అని చెప్పి తిప్పి తిరస్కరించారు. దీని వల్ల ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని పలు సంఘాల నాయకులు, ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో స్పందనలో ఉన్న జిల్లా పాలనాధికారి, డీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. యంత్రాంగం చేసిన తప్పిదాలకు ఉపాధ్యాయులను బలి చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. మార్గదర్శకాల్లో ఉన్న ప్రకారం కాకుండా జిల్లాలో అధికారులు కొన్ని జీవోకు అనకూలంగా, మరికొన్ని విరుద్ధంగా చేశారు. దీంతోనే కొందరికి సర్వీస్‌ పాయింట్లు అదనంగా, మరికొందరికి తక్కువ వచ్చాయి. స్పష్టత లేని వాటిపై కమిషనరేట్‌ నుంచి క్లారిఫికేషన్‌ తీసుకుని చేసి ఉంటే తుది జాబితాలో తప్పులకు ఆస్కారం ఉండేది కాదు. ఆ విధమైన కసరత్తు జిల్లాలో జరగలేదని సంఘాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన బదిలీల్లో పెద్దఎత్తున క్లారిఫికేషన్లు కోరారు. కనీసం సంఘాల సూచనలు, సలహాలు తీసుకోకుండా ఉమ్మడి గుంటూరు విద్యా శాఖ యంత్రాంగం ఇష్టానుసారంగా సర్వీస్‌ పాయింట్లు కేటాయించారని, ఇవన్నీ సరిచేయకపోతే అంతిమంగా ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని ఏపీటీఎఫ్‌ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు తెలిపారు. పెళ్లికాని ఓ ఉపాధ్యాయినికి అయినట్లు ఐదు మార్కులు కలిపారు. దీనిపై ఆ ఉపాధ్యాయినే అభ్యంతరం తెలిపారు. పెళ్లికాకున్నా సర్వీసు పాయింట్లు ఇచ్చి రికార్డుల్లో ఎక్కిస్తే తాను భవిష్యత్తులో ఆ మేరకు స్పౌజ్‌ కోటా మార్కులు కోల్పోతానని అధికారులను కలిసి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీన్నిబట్టి తప్పులు ఎలా దొర్లాయో ఊహించుకోవచ్చు


సమాన పాయింట్లు వచ్చిన వారి విషయంలో..

సమాన పాయింట్లు వస్తే వారి సీనియారిటీని నిర్ధారించే విషయంలో వారి క్యాడర్‌ సీనియారిటీని తీసుకోవాలి. అక్కడ కూడా ఒకే మార్కులొస్తే వారి పుట్టిన తేదీ ఆధారంగా సీనియారిటీని నిర్ధారించాలని జీవోలో పేర్కొంది. ఈ సమాన పాయింట్లు వచ్చిన వారి విషయంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు ఒకలా, స్కూల్‌ అసిస్టెంట్లకు మరోలా పాయింట్లు ఇవ్వడం ఉపాధ్యాయుల్లో మరింత గందరగోళానికి దారి తీసింది. ఒక విధానం లేకుండా అధికారులు ఏకపక్షంగా పాయింట్లు కేటాయించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహించాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల విషయంలో సబ్జెక్టు సబ్జెక్టుకు తేడా చేశారు. ఉదాహరణకు ఎస్‌జీటీ తెలుగులో పుట్టిన తేదీని తీసుకుని సీనియారిటీ నిర్ధారిస్తే, ఉర్దూలో వారి క్యాడర్‌ సీనియారిటీని తీసుకున్నారు. అదే స్కూల్‌ అసిస్టెంట్లకు వచ్చే సరికి కొందరికి ఫీడర్‌ క్యాడర్‌(ఎస్‌జీటీలుగా ఉండి పదోన్నతులు పొందినప్పుడు)లో వారి సీనియారిటీని తీసుకున్నారు. కన్వర్షన్‌ సబ్జెక్టుల వారికి పాయింట్లు ఇస్తామని చెప్పి వినతులు తీసుకుని చివరకు వారికి పాయింట్లు ఇవ్వలేదు. ‘ఓ టీచర్‌కు టీటీసీ అర్హతతో +2 బోధనకు తీసుకున్నారు. ఒక విధానం లేకుండా విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. సర్వీస్‌ పాయింట్ల కేటాయింపులోనూ పారదర్శకత లోపించింది. వీటన్నింటిపై సంఘాలు లేవనెత్తిన అభ్యంతరాలకు అధికారులపరంగా సరైన స్పష్టత రాకపోవడంతో కొన్నింటిని జేడీ సర్వీసెస్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరామని’ పల్నాడు జిల్లా యూటీఎఫ్‌ నాయకుడు ప్రేమ్‌కుమార్‌ తెలిపారు


  భారీగా ఖాళీలు బ్లాక్‌

ఒకవైపు ఖాళీలు బ్లాక్‌ చేయడం లేదని పైకి చెబుతూనే పెద్దఎత్తున చేశారని సంఘాలు ఆరోపించాయి. ఒక్క ఎస్‌జీటీ క్యాడర్‌లోనే హిందీలో 211 ఖాళీలు ఉండగా 79, 185 వ్యాయమోపాధ్యాయుల ఖాళీలకు 45 చూపారు. అసలు తెలుగు, హిందీ పండిట్లకు కోర్టు కేసుల కారణంగా పదోన్నతులు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆ పోస్టులను పెద్ద సంఖ్యలో బ్లాక్‌ చేయాల్సిన అవసరం ఏమిటని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్లు, హెచ్‌ఎం పోస్టులకు సంబంధించి కొన్ని ఖాళీలు బ్లాక్‌ చేశారని, వాటిని బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఆ ఖాళీలను అనుకూలురైన టీచర్లతో నింపడానికే ముందుగా ఖాళీలు బ్లాక్‌ చేస్తున్నారని పలు సంఘాల నాయకులు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని