logo

మీరు చొరవ చూపితేనే పరిష్కారం

క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎటువంటి స్పందన లేదు.

Published : 06 Jun 2023 05:14 IST

చెరువులో మట్టిని తవ్వేస్తున్నారు..

స్పందనలో అర్జీ అందించిన పేరేచర్ల గ్రామస్థులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎటువంటి స్పందన లేదు. పదే పదే అర్జీలు ఇస్తున్నా స్వీకరిస్తున్నారే తప్ప వాటికి ఎటువంటి పరిష్కారం చూపడంలేదు. క్షేత్ర స్థాయిలో సచివాలయం, మండల స్థాయిలోనూ వారి సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో కాస్త కష్టమైనా జిల్లా కేంద్రానికి వచ్చి కలెక్టర్‌ స్పందన కార్యక్రమంలో అర్జీలను అందించారు. సమస్యల పరిష్కారానికి కాస్త చొరవ చూపాలని వేడుకుంటున్నారు. స్పందన కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులంతా తప్పకుండా హాజరుకావాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా గైర్హాజరైతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం స్పందనకు 162 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, ప్రత్యేక ఉప కలెక్టర్లు లలిత, వెంకటశివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలోని ఎస్టీ కాలనీకి ఆనుకుని ఉన్న తాతకుంట చెరువులో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వేస్తున్నారని, పేరుకు జగనన్న కాలనీకి తరలిస్తున్నామని చెప్పి అనుమతి పొంది వేల ట్రక్కులను అధిక ధరలకు అమ్ముకుని రూ.లక్షలు కూడగట్టుకుంటున్నారని గ్రామస్థులు పి.శివన్నారాయణ, అబ్దుల్‌ గని, టి.రజనీకృష్ణ, ఎం.బ్రహ్మాజి, ఎం.రవి తదితరులు వాపోయారు. తాడికొండ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త, ప్రభుత్వ అధికారుల అండదండలతో పలువురు వైకాపా నాయకులు తాతకుంట చెరువులో 15 నుంచి 20 అడుగుల లోతుకు మట్టిని తవ్వేస్తున్నారన్నారు. స్థానికంగా ఉండే ప్రజలు నిత్యం అటుగా వెళ్లి వస్తుంటారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చెరువులో పడితే ప్రాణనష్టం జరుగుతుందని, మట్టి తవ్వే క్రమంలో ఎస్టీ కాలనీ వాసులు ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు. గతంలో గ్రామస్థుల ఫిర్యాదుతో మైనింగ్‌ అధికారులు అక్కడకు వచ్చి పరిశీలించారే తప్ప ఎటువంటి చర్యలు లేవన్నారు. అధికారులు పరిశీలించి ఎంత మట్టి అమ్ముకున్నారో లెక్కలు తేల్చి బాధ్యులతో జరిమానా కట్టించడంతో పాటు, సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


కొల్లిమర్ల డ్రెయిన్‌లో నీటి గుండాన్ని పూడ్చాలి

నీటి గుండాన్ని పూడ్చివేయాలని కోరుతూ అర్జీ
అందించిన మన్నవ గ్రామస్థులు

పొన్నూరు మండలం మన్నవ గ్రామం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న కొల్లిమర్ల డ్రెయిన్‌లోని నీటిగుండాన్ని పూడ్చాలని గ్రామస్థులు ఎ.వెంకట్రావు, బి.రాజశేఖర్‌ తదితరులు సోమవారం కలెక్టర్‌ స్పందనలో వినతిపత్రం అందించారు. గ్రామంలో అధిక శాతం మంది దళితులున్నారని, గ్రామం మధ్యలో నుంచి ప్రవహిస్తున్న కొల్లిమర్ల డ్రెయిన్‌పై ఉన్న వంతెన ముందు నీటి గుండం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నీటిగుండంతో కాలువ కట్టలు కోతకు గురవుతున్నాయన్నారు. గ్రామస్థులు అక్కడకు దుస్తులు ఉతకడానికి, గేదెలను కడగటానికి, పిల్లలు ఈతకు వెళ్తుంటారని, ఈక్రమంలో పొరపాటున ఆ గుండంలో పడి చనిపోతున్నారని చెప్పారు. ఇటీవల ఓ వాలంటీర్‌ కూడా ప్రమాదవశాత్తు చనిపోయిందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి నీటిగుండాన్ని పూడ్చివేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు గ్రామస్థులు.


వితంతు పింఛను కోసం రెండేళ్లుగా...

కొప్పురావూరి సూర్యలక్ష్మి వార్డు సభ్యురాలు. రెండేళ్ల కిందట భర్త చనిపోయారు. తర్వాత వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు మంజూరు కాలేదు. సచివాలయం, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల చుట్టూ తిరిగి పలుమార్లు విన్నవించారు. కలెక్టర్‌ స్పందన కార్యక్రమంలోనూ అనేక మార్లు అర్జీ అందించినా పింఛను మాత్రం అందలేదు. మొదట్లో భర్త మరణ ధ్రువీకరణ పత్రంలో తన పేరు లేదని అడ్డు చెప్పిన సచివాలయం, మండల అధికారులు.. ఇప్పుడు విద్యుత్తు బిల్లు 300 యూనిట్లు దాటిందని సాకులు చెబుతున్నారని వాపోయారు. తనకు పింఛను రాకుండా సర్పంచి అడ్డుకుంటున్నారని, అధికారులు స్పందించి తనకు వితంతు పింఛను మంజూరు చేయాలని కోరుతున్నారు సూర్యలక్ష్మి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని