logo

కృష్ణానదికే అడ్డుకట్ట

వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణానదిలో భారీ యంత్రాలతో చేపట్టిన రహదారి నిర్మాణాన్ని తహసీల్దార్‌ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సోమవారం నిలిపి వేయించారు.

Published : 06 Jun 2023 05:14 IST

యథేచ్ఛగా ఇసుక తరలింపునకు సన్నాహాలు
పనులు నిలిపివేయించిన రెవెన్యూ అధికారులు

నీటిలో ఇసుకను తోడి రహదారి నిర్మాణం కోసం మెరక వేస్తున్న వైనం

కొల్లూరు, న్యూస్‌టుడే: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణానదిలో భారీ యంత్రాలతో చేపట్టిన రహదారి నిర్మాణాన్ని తహసీల్దార్‌ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సోమవారం నిలిపి వేయించారు. ఇక్కడ ఇసుకతో రహదారి నిర్మాణ పనులు కొనసాగిస్తున్న ఎక్సకవేటర్లను సంఘటనా స్థలం నుంచి ఒడ్డుకు తరలించి ఇక మీదట పనులు కొనసాగిస్తే కేసులు నమోదు చేసి యంత్రాలను స్వాధీనం చేసుకుంటామని చోదకులను హెచ్చరించారు. పడవలో అమర్చిన ఆయిల్‌ ఇంజన్‌ ద్వారా నీటిలో నుంచి ఇసుకను తోడి రహదారి నిర్మాణం కోసం పైపుల ద్వారా మెరక వేస్తున్న పనులను నిలిపి వేయించడంతో పాటు వారికి హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకెళితే.. వర్షాలు ప్రారంభమయ్యే సమయం కావడంతో ఒకవేళ నదికి వరదలు సంభవిస్తే ఇసుకకు ఇబ్బంది లేకుండా కృష్ణానదిలో ఇసుకను తరలించి, నిలువ ఉంచి విక్రయించేందుకు కృష్ణాజిల్లా సరిహద్దులో బాపట్ల జిల్లా పరిధిలో కృష్ణానది మధ్య ఉన్న ఇసుక దిబ్బ వరకు ఇసుకను తరలించే వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా జేపీ కంపెనీ వారు రహదారి నిర్మాణం చేపట్టినట్లు తహసీల్దార్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి నదిలో రహదారి నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. జువ్వలపాలెం సమీపంలో కృష్ణానది ఒడ్డు నుంచి నదిలోకి సుమారు కిలోమీటరు పొడవునా రహదారి నిర్మాణం అప్పటికే పూర్తయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే అక్కడి పనులను పర్యవేక్షిస్తున్న మేస్త్రీని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. రహదారి నిర్మాణ పనులకు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తున్న జేపీ కంపెనీ ప్రతినిధికి ఫోన్‌ చేసి అనుమతుల విషయమై ప్రశ్నించారు. త్వరలో రాత పూర్వక అనుమతులు తీసుకుంటామని, నదిలో రహదారి నిర్మాణానికి సంయుక్త కలెక్టర్‌ శ్రీధర్‌ ఇప్పటికే అనుమతులు ఇచ్చారని, అవసరమైతే నేరుగా సంయుక్త కలెక్టర్‌ లేదా కలెక్టర్‌తోనైనా మాట్లాడుతామని, నిర్మాణ పనులను నిలిపివేయొద్దని ఆయన బదులిచ్చారు. వెంటనే తహసీల్దార్‌ అనుమతుల విషయమై సంయుక్త కలెక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించారు. నదిలో రహదారి నిర్మాణానికి తాను ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, అసలు ఆ విషయం తన దృష్టిలోనే లేదని, వెంటనే పనులను నిలిపి వేయించాలని సంయుక్త కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌ యంత్రాలను తక్షణం ఒడ్డుకు చేర్చాలని, నీటిలో నుంచి ఇసుకను తోడి మెరక వేస్తున్న పడవను తక్షణం అక్కడ నుంచి పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం, లేదా మరల్చడం నదీ పరిరక్షణ, వాల్టా చట్టాల ప్రకారం నేరం కదా? అని అక్కడకు చేరుకున్న స్థానికులు తహసీల్దార్‌ను ప్రశ్నించారు. జేపీ కంపెనీ చట్టాలను పట్టించుకోకుండా విచ్చలవిడిగా నదిలోని ఇసుకను తరలిస్తుంటే చర్యలు తీసుకోరా? సామాన్యులైతే కేసులు పెట్టి రూ.వేలు, రూ.లక్షల్లో అపరాధ రుసుము వసూలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ వారిని సముదాయించారు. వారం రోజులుగా పనులు చేపట్టి కిలోమీటరు మేర రహదారి నిర్మాణం చేస్తే ఏం చేస్తున్నారు? సమాచారం ఇప్పుడే అందడం ఏమిటి? గ్రామ స్థాయి రెవెన్యూ, సచివాలయ, ప్రభుత్వ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ? స్థానికులు ఆగ్రహం వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని