logo

అయ్యో.. రొయ్య రైతు..

జిల్లాలో 22 వేల ఎకరాలు రొయ్యల సాధారణ సాగు విస్తీర్ణం కాగా, రెండేళ్లుగా తీవ్ర నష్టాలు వస్తుండటంతో మూడో వంతు విస్తీర్ణంలో సాగు జరగలేదు.

Published : 06 Jun 2023 05:19 IST

 శ్రమకోర్చి పండిస్తే కనీసం పెట్టుబడి దక్కదాయే
  మందకొడి కొనుగోళ్లతో నష్టాల ఊబిలో విలవిల

బహిరంగ మార్కెట్లో రొయ్యల ధరలు పతనమయ్యాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టిన సాగుదారులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. పంట చేతికొస్తున్న దశలో ధరలు పతనం కావడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు లేవని ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు, వ్యాపారులు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లు మందకొడిగా సాగడంతో రొయ్యలను అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో 22 వేల ఎకరాలు రొయ్యల సాధారణ సాగు విస్తీర్ణం కాగా, రెండేళ్లుగా తీవ్ర నష్టాలు వస్తుండటంతో మూడో వంతు విస్తీర్ణంలో సాగు జరగలేదు. గత ఫిబ్రవరి నుంచి కొత్త సీజన్‌ ప్రారంభమైంది. కొందరు రైతులు, కౌలు రైతులు సాగుకు దూరంగా జరగలేక రొయ్యల సాగు ప్రారంభించారు. నెల క్రితం వరకు వంద కౌంట్ కేజీ వనామీ రకం రొయ్యల ధర రూ.260 పలికింది. 90 కౌంట్కు రూ.280, 70 కౌంట్కు రూ.300 ధర లభించింది. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి వంద కౌంట్ ధర రూ.250పైన పలికింది. మే మొదటి వారం నుంచి ధరల పతనం ప్రారంభమైంది. నెల వ్యవధిలో కేజీ రూ.50 ధర తగ్గింది. ఎకరాకు టన్నున్నర దిగుబడి వచ్చినా రైతు రూ.75 వేల ఆదాయాన్ని కోల్పోతున్నాడు. ఆ మేరకు నష్టం వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 90 కౌంట్కు రూ.220 ధర మాత్రమే లభిస్తోంది. వారం రోజులుగా వ్యాపారులు కొనుగోళ్లు బాగా తగ్గించారు. 70, 80 కౌంట్ రొయ్యలు పండించిన రైతులు వీటి విక్రయానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ కౌంట్ రొయ్యల కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ఐదెకరాలు సాగు చేసిన రైతుకు రూ.3.75 లక్షల వరకు నష్టం వస్తోంది. వంద కౌంట్ ధర రూ.250 ఉంటేనే సాగుదారుడికి ఎంతో కొంత మిగులుతుంది.


ఎగుమతులు లేవని సాకు చూపి..

అమెరికా, చైనా, యూరోపియన్‌ దేశాల నుంచి ఆర్డర్లు చాలా తక్కువగా ఉన్నందున పరిమితంగా రొయ్యలు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఏటా పంట చేతికి వచ్చే మే చివరి వారం నుంచి జూన్‌, జులై నెలల్లో ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని సాగుదారులు వాపోతున్నారు. మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగి సాగు భారం మారిందని చెబుతున్నారు. నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత తక్కువగా ఉందని.. మేత, రసాయనాల ధరలు పెరగడంతో ఎకరాకు రూ.లక్షల్లో నష్టపోతున్నట్లు వివరిస్తున్నారు. ఏడాది పాటు రొయ్యల చెరువులకు కరెంటు రాయితీ అందలేదు. ఏప్రిల్‌ నుంచి రాయితీ అమలు చేస్తున్నారు. 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదనంగా రూ.వేలల్లో అదనంగా కరెంటు బిల్లులు చెల్లించాల్సి వచ్చి రైతులపై భారం పడింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస మద్దతు ధర ప్రకటించి అమలయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి సాగుకు దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.


తీవ్రంగా నష్టపోతున్నాం

ఎకరా భూమిలో వనామీ రొయ్యల సాగు చేశా. 90 కౌంట్ రొయ్యలు విక్రయించడానికి వ్యాపారుల కోసం రెండ్రోజులు వెతికా. కేజీ రొయ్యలను రూ.220 ధరకు విక్రయించా. పెట్టుబడి వ్యయం రూ.250 అయ్యింది. కేజీకి రూ.30 చొప్పున ఎకరాకు రూ.లక్షకు పైగా నష్టపోయా. నెల క్రితం కేజీ 90 కౌంట్ ధర రూ.270 ఉంది. ఆ ధరకు విక్రయించినా రూ.లక్ష లాభం వచ్చేది. మార్కెట్లో ధరల పతనాన్ని ప్రభుత్వం అడ్డుకొని ఆక్వా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి.

అశ్విని, రైతు


టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయండి

రొయ్యల ధర పతనంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తా. రొయ్యలు కొనుగోలు చేయకుంటే ప్రతి ఆర్బీకే పరిధిలో ఏర్పాటు చేసినా టోల్‌ఫ్రీ నంబరు 155251కు రైతులు ఫోన్‌ చేయాలి. మత్స్యశాఖ అధికారులు వెంటనే స్పందించి వ్యాపారులు, ప్రాసెసింగ్‌ పాంట్ల యజమానులతో మాట్లాడి రొయ్యలు కొనుగోలు చేయిస్తారు. ధరలు పడిపోవడానికి అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణం. చెరువులో తక్కువ పిల్లలు పోసి సాగుదారులు పెట్టుబడి వ్యయాన్ని నియంత్రించుకోవాలి.

సురేష్‌, జిల్లా మత్స్యశాఖాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు