logo

ప్రసన్నాంజనేయా.. ఏమిటీ అయోమయం

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ సహాయ కమిషనర్‌ విధులు నిర్వర్తించే అంశంలో అయోమయం నెలకొంది.

Published : 07 Jun 2023 04:32 IST

విధుల్లో చేరానంటున్న రఘునాథరెడ్డి.. వారం రోజులు గడువుందంటున్న సుభద్ర

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం

శింగరకొండ(అద్దంకి), న్యూస్‌టుడే: శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ సహాయ కమిషనర్‌ విధులు నిర్వర్తించే అంశంలో అయోమయం నెలకొంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసే సహాయ కమిషనర్‌ టి.సుభద్రను గుంటూరు కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమె స్థానంలో గుంటూరు జిల్లా ఉండవల్లి బృంద ఆలయాల కార్యనిర్వహణాధికారి ఎస్‌.రఘునాథరెడ్డిని దేవాదాయ శాఖ కమిషనర్‌ నియమించారు. ఉత్తర్వులు వెలువడిన రెండు రోజులకు ఎస్‌.రఘునాథరెడ్డి శింగరకొండకు వచ్చి, తాను విధుల్లో చేరుతున్నట్లు లేఖను కార్యాలయంలో అందించారు. దీనికితోడు సోమవారం సాయంత్రం తిరిగి గుడికి వచ్చి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించుకున్నారు. మంగళవారం ఉదయం వరకు ఆలయం వద్దనే విధులు నిర్వర్తించారు. ఆ తరువాత గుంటూరు వెళ్లారు. ఉదయం 10.30 గంటలకు ప్రసన్నాంజ
నేయస్వామి గుడికి వచ్చిన సహాయ కమిషనర్‌ టి.సుభద్ర ప్రత్యేక పూజలు చేశారు. సహాయ కమిషనర్‌ కార్యాలయంలో కూర్చున్నారు. ‘తాను సహాయ కమిషనర్‌’ను అంటూ విధులు కొనసాగించారు. దీంతో అటు ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తుల్లో అయోమయం నెలకొంది. ఈ విషయమై టి.సుభద్ర విలేకరులతో మాట్లాడుతూ సాధారణ బదిలీల్లో భాగంగా తాను గుంటూరు కార్యాలయానికి బదిలీ అయిన మాట వాస్తవమేనన్నారు. పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించేందుకు వారం రోజులు గడువు ఉందన్నారు. అప్పటి వరకు తాను ఇక్కడే సహాయ కమిషనర్‌గా కొనసాగే వీలుందన్నారు. ఇదే విషయాన్ని బదిలీ ఉత్తర్వుల్లో పొందుపరిచినట్లు చెప్పారు. ఇదే విషయమై పూర్తి అదనపు బాధ్యతలతో బదిలీ అయిన రఘునాథరెడ్డి మాట్లాడుతూ సరైన సమాచారం లేని కారణంగా తాను విధుల్లో చేరానని, ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు చెప్పారు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం సహాయ కమిషనర్‌ బదిలీ అంశం ఎన్ని మలుపులు తిరుగుతుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు