logo

నదీ తీరానికెళితే.. ముక్కు మూసుకోవాల్సిందే

లక్షలాది మందికి తాగునీరు.. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ నీటితో కళకళలాడుతూ జీవనదిగా పేరొందిన కృష్ణానది కలుషితం బారిన పడుతోంది.

Published : 07 Jun 2023 04:32 IST

డంపింగ్‌ యార్డును తలపిస్తున్న కృష్ణా తీరం
నేరుగా మురుగు  మళ్లింపుతో దుర్గంధం వ్యాప్తి
ఈనాడు, అమరావతి

అమరావతిలోని అమరేశ్వరఘాట్‌ వద్ద నదిలో కలుస్తున్న మురుగు 

లక్షలాది మందికి తాగునీరు.. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ నీటితో కళకళలాడుతూ జీవనదిగా పేరొందిన కృష్ణానది కలుషితం బారిన పడుతోంది. మానవుల స్వార్థం...లోపించిన పర్యవేక్షణ.. పట్టించుకోని కృష్ణా పరిరక్షణ విభాగం వెరసి స్వచ్ఛమైన నది నీరు కలుషితమవుతోంది.  ఇదే లక్షల మంది  తాగునీటి అవసరాలకు సరఫరా అవుతోంది.

అమరావతిలోని యాదవకాలనీ, పల్లపు వీధి, శివగంగ వీధి, ప్రధాన రహదారిలోని కొంత భాగం నుంచి వచ్చే మురుగునీటిని నేరుగా అమరేశ్వరఘాట్‌ పక్కనే నదిలోకి కలుపుతున్నారు. దీంతో నది కలుషితమవుతోంది. మురుగు వచ్చి నదిలోకి కలిసిన తర్వాత ప్రవాహం ముందుకు వెళ్లకుండా ఇసుక రవాణాకు వేసిన రోడ్డు అడ్డుగా ఉంది. దీంతో మురుగు వెనక్కి వచ్చి తీరం కలుషితమవుతోంది. అదేవిధంగా సాయిబాబా ఆలయం సమీపంలోని ఘాట్‌ వద్ద అమరావతి నుంచి వచ్చే మురుగునీరు కలుస్తోంది. ఇది నదిలో కలిసిన తర్వాత ప్రవాహం తాగునీటి పథకాల మీదుగా ప్రవహిస్తోంది. ఇక్కడే గోరంట్ల తాగునీటి పథకం ద్వారా పదుల గ్రామాలకు నీరు అందిస్తారు. అమరావతి పంపింగ్‌ పథకం కూడా ఇక్కడే ఉంది. వేలమందికి తాగునీటి అందించే పథకం పక్కనే మురుగునీరు కలుస్తున్నా అటు పంచాయతీ గానీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం గానీ నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. శుద్ధి చేసి పంపిణీ చేసినా మురుగునీరు కలవడంతో స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయలేని పరిస్థితి.

మురుగు చెంతనే స్నానాలు : పంచారామాలలో ప్రథమారామం అమరావతి అమరలింగేశ్వరస్వామి దర్శనానికి నిత్యం భక్తులు వస్తుంటారు. పర్వదినాలలో వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి నదిలో పుణ్య స్నానాలు చేసి అమరేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. అమరావతి ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతం కావడంతో ప్రజలు పెద్దసంఖ్యలో రాకపోకలు చేస్తుంటారు. దీనికితోడు కర్మకాండలు చేయడానికి అమరావతి తీరం ప్రసిద్ధి చెందడంతో రోజూ ఇక్కడ వందల మంది స్నానాలు చేస్తారు. వీరందరూ అమరావతి ఆలయం ముందు ఉన్న ఘాట్‌లో స్నానాలు చేస్తుంటారు. ఘాట్‌ పక్కనే మురుగునీరు వచ్చి నదిలో కలుస్తుండటంతో ఆ ప్రాంతం మురుగుమయమవుతోంది. దీంతో భక్తులు స్వచ్ఛమైన నీటితో స్నానం చేయాలనే ఉద్దేశంతో కొంత దూరం నదిలోకి వెళుతున్నారు. అక్కడ లోతు తెలియక పలువురు ప్రమాదవశాత్తూ నదిలో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. మురుగునీరు కలవకుండా ఏర్పాటు చేస్తే తీరంలోనే స్వచ్ఛమైన నీటిలో స్నానం చేసే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల భక్తులు ప్రమాదాల బారినపడకుండా నివారించవచ్చు.

ధ్యానబుద్ధ ఘాట్‌ వద్ద ఇలా..

డంపింగ్‌ యార్డుగా మార్చేస్తున్నారు

అమరావతిలో వచ్చే చెత్త తీసుకొచ్చి నదీతీరంలో డంప్‌ చేస్తున్నారు. వాడేసిన కొబ్బరి బొండాలు, తాటికాయలు తీసుకొచ్చి నదిలోపలి వైపు ఒడ్డున వేస్తున్నారు. ఆలయం నుంచి వచ్చే వృథాను ఆలయ ఉత్తర గాలిగోపురం వైపు నదిలోకి పడేస్తున్నారు. తాడేపల్లి మండలంలోని సీతానగరం ఘాట్‌, కనకదుర్గమ్మ వారధి వద్ద ఆ పరిసరాలల్లోని చెత్త మొత్తం నది ఒడ్డున వేస్తున్నారు. కొన్నిసార్లు ఇక్కడి చెత్తకు నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు. ఇవన్నీ ఒడ్డున వేస్తుండటంతో కుళ్లిపోయి ఆ మురుగు నదిలోకి కలుస్తోంది. దీంతో నదీతీర ప్రాంతంలోని నివాసాల నుంచి వచ్చే చెత్త మొత్తం నదిలోకి డంప్‌ చేస్తున్నారు. నదికి వరదలు వచ్చినప్పుడు ఇది నదిలో కొట్టుకుపోతోంది. దీంతో ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండాల్సిన తీరప్రాంతం చెత్తమయంగా మారుతోంది. ఇదంతా నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చి ఘాట్ల సమీపంలో నిలిచిపోతోంది. దీంతో ఘాట్లలో స్నానాలు చేయడానికి కూడా భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. నదిలోకి మురుగునీరు నేరుగా విడుదలపై అమరావతి పంచాయతీ కార్యదర్శి నాగరాజును వివరణ కోరగా ఎప్పటి నుంచో నదిలోకి మురుగునీరు వదులుతున్నామని, కాలువలు నదిలోకి ఉన్నందున తామేమీ చేయలేమన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు