logo

గాంధీ పార్కుకు రాజకీయ గ్రహణం

ప్రజాప్రయోజనం సంగతి తరువాత...అధికారంలో ఉండగా నాలుగు రాళ్లు కూడేసుకోవాలనే యావలోనే అధికార వైకాపా నేతలు ఉంటున్నారు.

Published : 07 Jun 2023 04:32 IST

రూ.కోట్లు వెచ్చించి నిరుపయోగంగా మార్చిన వైనం
సైకిల్‌ స్టాండ్‌.. ఫుడ్‌ కోర్టులపై కన్నేసిన ప్రజాప్రతినిధి
ఈనాడు, అమరావతి

ప్రజాప్రయోజనం సంగతి తరువాత...అధికారంలో ఉండగా నాలుగు రాళ్లు కూడేసుకోవాలనే యావలోనే అధికార వైకాపా నేతలు ఉంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివాసం ఉండే గుంటూరు జిల్లాలోనే అధికార పార్టీ నేతల మధ్య ఓ పార్కులో సైకిల్‌ స్టాండ్‌, ఫుడ్‌కోర్టుల నిర్వహణ విషయంలో తలెత్తిన విభేదాలతో ఏకంగా దానిని ప్రారంభించకుండానే నిరుపయోగంగా మార్చేశారు.

నగర ప్రజలకు ఆనందం..వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూ.కోట్లు వెచ్చించి నగరపాలక సంస్థ అభివృద్ధి చేసిన గాంధీ పార్కును అధికార పార్టీ నేతలు అటకెక్కించారు. వారి మధ్య నెలకొన్న పంతాలు..పట్టింపుల కారణంగా అది ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత నెలలోనే పార్కు ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. సుమారు రూ.4-5 కోట్లు వ్యయం చేసి ఆ పార్కును ఆగమేఘాల మీద అభివృద్ధి చేశారు. తీరా దాన్ని వినియోగంలోకి తేకుండా నిరుపయోగంగా మార్చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపుగా ఉపయోగపడాలని గత రెండు నెలల నుంచి ఇంజినీరింగ్‌, ఉద్యాన విభాగాలకు చెందిన యంత్రాంగం మొత్తాన్ని పార్కు పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పి కొలిక్కి తీసుకొచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. పనులు పూర్తయినా అది మాత్రం ప్రారంభం కావడం లేదు. నగరం నడిబొడ్డున మార్కెట్‌ సెంటర్‌లో ఉన్న ఈ పార్కు వినియోగంలో రాకుండా పోయింది. దానికి వెచ్చించిన రూ.కోట్ల నిధులకు సార్థకత లేకుండా పోయిందనే అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.

అది నాకు వదిలేయండంటూ...

నగరంలోని 10 లక్షల మంది జనాభాకు ఏకైక ఆటవిడుపునిచ్చే పార్కు ఇదొక్కటే. సుమారు రెండు దశాబ్దాల పాటు నగర ప్రజలకు ఇది ఆనందాన్ని, వినోదాన్ని పంచి పెట్టింది. అలాంటి పార్కు కాలక్రమేణా నిర్వహణ కొరవడడంతో ఐదారేళ్ల నుంచి పూర్తిగా వినియోగంలో లేకుండా పోయింది. ఆ స్థితిలో ఉన్న పార్కును కొత్తగా ఏర్పాటైన నగర కౌన్సిల్‌ ఆధునికీకరించింది. పనులు పూర్తయ్యాక దానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. అధునాతనంగా తయారైన పార్కుకు ప్రజలు, పిల్లల నుంచి భారీగా ఆదరణ ఉంటుందని నగర ప్రజాప్రతినిధి ఒకరికి దానిపై కన్ను పడింది. ఆ పార్కులో సైకిల్‌ స్టాండ్‌ నిర్వహణ, ఫుడ్‌కోర్టుల వంటివి తనకు వదిలేయాలని నగరపాలక సంస్థపై ఒత్తిడి చేస్తున్నారు. దానికి అభ్యంతరం వ్యక్తమైంది. వాటికి వేలం నిర్వహించకుండా కేటాయించడం సాధ్యం కాదని, ఇలా చేస్తే కౌన్సిల్‌కు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించి పార్కులో వాటి నిర్వహణకు టెండర్లు పిలవాలని స్టాండింగ్‌ కమిటీకి పెట్టారు. కమిటీ దానికి ఆమోదం తెలిపింది. దీంతో ఆ ప్రజాప్రతినిధి ఆపార్కును ఎలా అభివృద్ధి చేశారు? దానికి వెచ్చించిన నిధులు ఏమిటి? టెండర్లు పిలిచి పనులు చేశారా? నామినేషన్‌పై చేశారా ఆ వివరాలన్నీ తన ముందు ఉంచాలని ఆ తర్వాతే దాన్ని ప్రారంభించాలని కోరడం వంటివి ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో కౌన్సిల్‌, నగరపాలక ఉన్నతాధికారులకు ఏం చేయాలో తెలియక దాని ప్రారంభాన్ని వాయిదా వేసుకున్నారు. పార్కు పనుల్లో అవినీతి జరిగితే దాన్ని నిగ్గు తేల్చడానికి అవసరమైతే విజిలెన్స్‌ విచారణ కోరటమో? ఉన్నతాధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి తెలుసుకోవడమో చేయాలి గానీ పనులు పూర్తయినా పార్కును ప్రజలకు అందుబాటులోకి తేకుండా అడ్డుకోవడం ఏమిటి? ఎన్నాళ్లు అలా నిరుపయోగంగా ఉంచుతారని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. పార్కు ఎందుకు ప్రారంభించడం లేదని అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లను ప్రశ్నిస్తే ‘పార్కులో సైకిల్‌స్టాండ్‌, ఫుడ్‌కోర్టుల నిర్వహణను మాపార్టీ నాయకుడొకరు టెండర్లతో సంబంధం లేకుండా అడుగుతున్నారు. దీనికి టెండర్లు పిలవాల్సిందేనని పట్టుబట్టడంతో నేతల మధ్య సమన్వయం లోపించి పార్కు ప్రారంభానికి నోచుకోకుండా పోయింది’ అన్నారు. మరోవైపు కొందరు కార్పొరేటర్లు సైతం ఆపార్కుకు కోట్లు వెచ్చించినప్పుడు తమను భాగస్వాములను చేయలేదని పేర్కొంటూ...కనీసం తమ పేర్లు శిలాఫలకంపై ఎక్కించాలని ఆ మధ్య కమిషనర్‌ను కలిసి కోరారు. ఇలా ఆపార్కుకు రాజకీయ అడ్డంకులు ఒక దాని వెనుక ఒకటి తోడు కావడంతో దాని ప్రారంభాన్నే విస్మరించారు.


పనులు పూర్తయ్యాయి

- పీవీవీ భాస్కర్‌, ఎస్‌ఈ, నగరపాలక సంస్థ

పార్కు ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. ఉన్నతాధికారులను పిలిచి ప్రారంభించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. వారి అపాయింట్‌మెంట్‌కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని