logo

ఠారెత్తిస్తున్న ఎండలు!

ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి వడగాలులు తోడు కావడంతో తీవ్రత మరింత పెరిగింది. ఇంట్లో ఫ్యాను కింద కూర్చున్నా ఉక్కపోతతో తడిసిపోతున్నారు.

Published : 08 Jun 2023 04:39 IST

ఇళ్లకే పరిమితమవుతున్న జనం

ఈనాడు, అమరావతి: ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి వడగాలులు తోడు కావడంతో తీవ్రత మరింత పెరిగింది. ఇంట్లో ఫ్యాను కింద కూర్చున్నా ఉక్కపోతతో తడిసిపోతున్నారు. ఎండలకు తాళలేక జనం రుతు పవనాల కోసం వేచి చూస్తున్నారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో బుధవారం 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతతో రాష్ట్రంలో రెండో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండలు మండిపోతుండడంతో రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటలకే సుర్రుమని సూరీడు వస్తుండడంతో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. బయట తిరిగేవారికి ఎంత నీరు తాగుతున్నా దాహం తీరని పరిస్థితి ఏర్పడుతోంది. అత్యవసరమైతే బయటికి వెళ్లేవారు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై వెళ్తుంటే వేడితో కూడిన గాలి తగలకుండా రక్షణగా వస్త్రాలతో కప్పేసుకుంటున్నారు. ద్విచక్ర వాహనదారులు కొందరు ఎండ పడకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రమైనా వేడిగాలుల తీవ్రత తగ్గకపోవడంతో రాత్రి 7గంటల తర్వాతే బయటికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎండలు పెరగడంతో చల్లని పానీయాలకు డిమాండ్‌ పెరిగింది. పల్లెల నుంచి పట్టణాలకు అత్యవసరమైతే తప్ప గ్రామీణులు ప్రయాణాలు చేయడం లేదు. దీంతో నగరంలో ప్రధాన రోడ్ల మీద కూడా రద్దీ తక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం 2గంటల నుంచి 4 గంటల వరకు ప్రధాన ప్రాంతాల్లోనూ కర్ఫ్యూను తలపించేలా రోడ్లు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు ఉదయాన్నే వెళ్లి పనులు త్వరగా ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకునే తెల్లవారుజామునే పనులు ప్రారంభించి ఎండ పెరిగే సమయానికి ఇంటికి చేరుకుంటున్నారు. సాయంత్రం కూడా వేడిగాలుల తీవ్రత ఉండడంతో పని మానుకుంటున్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో మూడు రోజుల పాటు ఎండలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెప్పడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. రుతుపవనాల రాక సమాచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని