logo

ప్రచార ప్రహసనం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని ప్రచారమే ధ్యేయంగా నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Published : 08 Jun 2023 04:39 IST

గుంటూరు నుంచి తాడేపల్లికి ఈ-ఆటోలు
జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం

సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవం కోసం గుంటూరు కార్పొరేషన్‌ షెడ్‌ నుంచి తాడేపల్లికి తరలిస్తున్న ఈ-ఆటోలు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే,నగరపాలక సంస్థ (గుంటూరు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని ప్రచారమే ధ్యేయంగా నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గురువారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఈ-ఆటోలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా గుంటూరు, విజయవాడ, తాడేపల్లి-మంగళగిరి నగరపాలక సంస్థల నుంచి వందల ఈ-ఆటోలు తరలించారు. జూన్‌ 2న గుంటూరులో ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్‌ పంపిణీకి వందల కిలోమీటర్ల నుంచి గుంటూరు తరలించి మళ్లీ సొంతూళ్లకు తీసుకెళ్లారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్‌, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు చెందిన లబ్ధిదారులు తమ వాహనాలతో ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఒకచోట ముఖ్యమంత్రి ప్రారంభించి మిగిలినచోట ఆయా ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తే సరిపోయేదానికి వందల వాహనాలు ఒకచోటికి తీసుకురావడం ప్రయాసగా మారింది. రైతులు మూడు రోజుల పాటు పనులు మానుకుని వాహనాలు తీసుకురావాల్సి వచ్చింది. ఎండలు మండిపోతున్న వేళ ప్రభుత్వ ఆర్భాటం కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి రావడం గమనార్హం. గురువారం తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఈ-ఆటోల ర్యాలీ ప్రారంభానికి గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దూరం వాహనాలను తరలించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత వాటిని మళ్లీ తిరిగి గుంటూరుకు తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే ఈ-ఆటోలు తిరిగి వెళ్లాల్సి ఉంది. వీటన్నిటిని ఒకచోటకి చేర్చడం, మళ్లీ తీసుకెళ్లడం, ట్రాఫిక్‌ ఇబ్బందులకు కారణమవుతోంది. ఈ వాహనాలన్నీ కూడా జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగించాల్సి రావడంతో ఆ మార్గంలో రద్దీ పెరగనుంది. అలాగే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గం మొత్తం ఈ-ఆటోలతో నిండిపోతే అక్కడ కూడా ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడతాయి. జూన్‌ 2న ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమం రోజున ట్రాక్టర్లు ర్యాలీగా వెళ్లడానికి ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఒకేసారి వందల వాహనాలు చూపించడం ద్వారా కార్యక్రమం అట్టహాసంగా చేశామనే గొప్పల కోసం అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ ప్రచార ఆర్భాటం కోసం ఈ ప్రహసనమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


నెలల తరబడి ఎదురుచూపులు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాలకు అందించేందుకు 220 ఈ-ఆటోలు స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్‌ నుంచి గతేడాది అక్టోబరులోనే గుంటూరులోని వెహికల్‌ షెడ్‌కు వచ్చాయి. ఇందుకు రూ.12కోట్ల సొమ్ము వెచ్చించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ సమర్థంగా చేపట్టి పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఈ-ఆటోలు తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్లు కాలేదని కొన్నాళ్లు, సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని కొన్నాళ్లు ఇలా కొన్ని నెలలుగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల వైఎస్‌ఆర్‌ వాహన సేవ పథకంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ-ఆటోలు ప్రారంభించాలని అనుకున్నా చేయలేకపోయారు. దీంతో అందుబాటులోకి వచ్చిన వాహనాలను వినియోగంలోకి తీసుకురాకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.  


వాడకుండానే మొరాయింపు...

గత అక్టోబరు నెలలో తెచ్చిన ఈ-ఆటోలను వాడకంలోకి తీసుకురాకుండా కేవీపీ కాలనీ వాహనాల షెడ్డులోనే వదిలేయడం వల్ల చాలా ఆటోలు పాడయ్యాయి. సుమారు 50 నుంచి 60 ఆటోలు బ్యాటరీ సమస్యలు, స్టీరింగ్‌ బిగుసుకుపోవడం, బ్రేకులు ఫెయిల్‌ కావడం వంటి సమస్యలు వచ్చినట్లు గుర్తించారు. సీఎం చేత ప్రారంభోత్సవానికి తాడేపల్లి తరలించేందుకు ప్రయత్నిస్తే కొన్ని ఆటోలు మొరాయించాయి. దీంతో అప్పటికప్పుడు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని అదనపు సిబ్బందిని రప్పించి వాటిని మరమ్మతు చేసి బాగైన ఆటోలను వెంటనే తాడేపల్లికి తరలించే ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రానికి కూడా మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రారంభించే సమయంలోనే చెత్త సేకరణ వాహనాల పరిస్థితి ఇలా ఉంటే డివిజన్‌లలో తిరిగేటప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని