logo

బాపట్లలో వైకాపా వర్గాల మధ్య ఘర్షణ

బాపట్ల పట్టణంలోని రైలుపేట రెడ్డిపాలెంలో గ్రామపెద్దను ఎన్నుకునే విషయంలో అధికార వైకాపాలో రెండు వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది.

Published : 09 Jun 2023 06:02 IST

రెడ్డిపాలెంలో పోలీసు బందోబస్తు

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల పట్టణంలోని రైలుపేట రెడ్డిపాలెంలో గ్రామపెద్దను ఎన్నుకునే విషయంలో అధికార వైకాపాలో రెండు వర్గాల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికకు సంబంధించి రెడ్డిపాలెం స్థానికులు సమావేశం కాగా.. వైకాపా యుజవన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఆట్ల ప్రసాదరెడ్డి తాను సూచించిన వారినే ఆ పదవిలో నియమించాలని పట్టుబట్డారు. దీన్ని వైకాపాకే చెందిన మెజారిటీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యధిక మంది మద్దతు ఉన్న నాయకుడినే గ్రామ పెద్దగా నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆట్ల ప్రసాదరెడ్డి వర్గీయులు, వారిని వ్యతిరేకిస్తున్న స్థానిక కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. సుమారు 200 మందికిపైగా పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ, ఎస్సైలు సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను శాంతింపజేయటానికి ప్రయత్నించారు. అయినా ఇరువర్గాలు పోలీసుల సమక్షంలోనే కర్రలతో దాడులకు తెగబడ్డారు. పలువురు గాయపడటంతో.. ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అక్కడి వారిని హెచ్చరించారు. అనంతరం పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఈ విషయమై సీఐను ప్రశ్నించగా ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎవరూ గొడవలకు దిగకుండా ఇరు వర్గాలను బైండోవర్‌ చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని