logo

రెండు నెలలు.. ముగ్గురు డీపీవోలు

జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) నియామకంలో ఎట్టకేలకు రాజకీయ సిఫార్సులే పని చేశాయి. రెండు నెలలుగా సీటు ఎవరిదనే విషయమై నడుస్తున్న చర్చకు తెరపడింది. కొత్త డీపీవోగా దాసరి రాంబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు.

Updated : 09 Jun 2023 06:17 IST

కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాంబాబు

డీపీవోగా బాధ్యతలు చేపట్టిన రాంబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఇన్‌ఛార్జి డీఎల్‌పీవో శరత్‌బాబు

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) నియామకంలో ఎట్టకేలకు రాజకీయ సిఫార్సులే పని చేశాయి. రెండు నెలలుగా సీటు ఎవరిదనే విషయమై నడుస్తున్న చర్చకు తెరపడింది. కొత్త డీపీవోగా దాసరి రాంబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు డీపీవోగా పని చేసిన రమేష్‌ను కనిగిరికి బదిలీ చేశారు. రెండు నెలల వ్యవధిలో ముగ్గురు డీపీవోలు మారారు. ఒక్కరు కూడా కనీసం ఏడాది పని చేయని పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లా ఆవిర్భావం తర్వాత గత జులైలో జిల్లా పంచాయతీ అధికారిగా నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చిన రమేష్‌ బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలలు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఆయన పనితీరు బాగా లేదని నవంబరులో అప్పటి కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సెలవుపై పంపించారు. నెల తర్వాత వచ్చినా తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. మరోసారి సెలవుపై వెళ్లారు. డ్వామా పీడీ శంకర్‌నాయక్‌ను ఇన్‌ఛార్జి డీపీవోగా బాధ్యతలు అప్పగించారు. ఆయన ఐదు నెలలకు పైగా పని చేశారు. గత ఏప్రిల్‌ 6న కలెక్టర్‌ విజయకృష్ణన్‌ బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్‌గా రంజిత్‌బాషా నియమితులయ్యారు. అదే సమయంలో సెలవులు ముగించుకుని రమేష్‌ తిరిగి వచ్చి విధుల్లో చేరారు.

రెండోసారి ఉత్తర్వులు జారీ

కర్లపాలెం ఎంపీడీవో రాంబాబును ఇన్‌ఛార్జి డీపీవోగా నియమిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గత ఏప్రిల్‌లో ఉత్తర్వులు ఇచ్చారు. అయితే రమేష్‌కు డీపీవోగా బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆదేశాలు జారీ చేశారు. రాంబాబు కర్లపాలెం ఎంపీడీవోగా కొనసాగారు. తాజాగా రాంబాబును బాపట్ల జిల్లా పంచాయతీ అధికారిగా నియమిస్తూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. దీని వెనుక జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాంబాబు డీపీవోగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. కొత్త డీపీవోను డీఎల్పీవో శరత్‌బాబు కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆరు నెలల తర్వాత పోస్టింగ్‌ పొందిన రమేష్‌ రెండోసారి 55 రోజులు మాత్రమే డీపీవోగా పని చేశారు. ఆయనపై బదిలీ వేటు వేసి కనిగిరి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని