logo

జగనన్న కాలనీ పేరుతో తవ్వేస్తున్నారు

జగనన్న కాలనీలో మెరక పనుల కోసం అంటూ జిల్లా అధికారుల నుంచి లేఖలు తీసుకువచ్చి ప్రత్తిపాడుకు చెందిన వైకాపా నాయకులు అడ్డగోలుగా గ్రావెల్‌ తవ్వేస్తున్నారని గొట్టిపాడు సర్పంచి ప్రత్తిపాటి మరియరాణి గురువారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Published : 09 Jun 2023 06:02 IST


చెరువులో గ్రావెల్‌ తవ్వి టిప్పర్‌లో నింపుతున్న పొక్లెయిన్‌

గొట్టిపాడు (ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: జగనన్న కాలనీలో మెరక పనుల కోసం అంటూ జిల్లా అధికారుల నుంచి లేఖలు తీసుకువచ్చి ప్రత్తిపాడుకు చెందిన వైకాపా నాయకులు అడ్డగోలుగా గ్రావెల్‌ తవ్వేస్తున్నారని గొట్టిపాడు సర్పంచి ప్రత్తిపాటి మరియరాణి గురువారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కార్యాలయంలో తహసీల్దారు సంజీవ కుమారి లేకపోవడంతో ఆర్‌.ఐ ప్రసాద్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గొట్టిపాడు రెవెన్యూ పరిధిలో 411 సర్వే నంబరులో 6.82 ఎకరాల కుంట ప్రభుత్వ భూమిలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్న కుంట వద్దకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

పంచాయతీ తీర్మానం లేకుండా తవ్వకాలు: సర్పంచి మరియరాణి

ప్రత్తిపాడు: ఆర్‌ఐ ప్రసాద్‌కు వినతిపత్రం అందిస్తున్న సర్పంచి మరియరాణి

గొట్టిపాడు గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ప్రత్తిపాడుకు చెందిన వైకాపా నేతలు చెరువుల్లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారు. సోమవారం నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రజలు ఫిర్యాదులు చేసినా అధికారులెవరూ పట్టించుకోలేదు. జగనన్న కాలనీలో మెరక కోసం జిల్లా అధికారుల నుంచి లేఖలు తెచ్చి ప్రైవేటు స్థలాలు, లేఔట్లకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్రు రూ.5,000 చొప్పున విక్రయించి రూ.లక్షలు దోచుకుంటున్నారు. మైనింగ్‌ శాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలి.

పది నెలలకే బదిలీ...

ప్రత్తిపాడు మండలం తహసీల్దారు సంజీవ కుమారి బుధవారం సాయంత్రం బదిలీ అయినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె గతేడాది జులైలో సాధారణ బదిలీల్లో భాగంగా ప్రత్తిపాడుకు వచ్చారు. ఏడాది కాకుండానే బదిలీ చేయడంపై నాయకుల మధ్య చర్చ నడుస్తోంది. వైకాపా నేతల గ్రావెల్‌, మట్టి తవ్వకాలకు అడ్డుగా ఉంటున్నారని ఆమెను ఇక్కడి నుంచి పంపించినట్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. నడింపాలెం, గొట్టిపాడు, యనమదల, ఈదులపాలెం గ్రామాల్లో అక్రమ తవ్వకాలకు సహకరించాలని ఒత్తిడి చేయడం, ఆమె విముఖత వ్యక్తం చేయడంతోనే బదిలీ చేశారని సమాచారం. ఇటీవల నడింపాలెంలో తవ్వకాలను ఆమె నేరుగా వెళ్లి అడ్డుకున్నారు. రామవాగు ఆక్రమణపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చి హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు