logo

కదిలిన నైజీరియన్‌ కొకైన్‌ లింకు

నైజీరియన్‌ నెట్‌వర్క్‌తో రాజధానిలో నడిపిస్తున్న కొకైన్‌ మాఫియా డొంక కదులుతోంది. ఈ ఏడాది మే తొలివారంలో మాదాపూర్‌ ఎస్‌వోటీ, రాయదుర్గం పోలీసులకు చిక్కిన ముఠాతో లింకులున్న మరో ఐదుగురు గురువారం అరెస్టయ్యారు.

Published : 09 Jun 2023 06:02 IST

గతంలో ఈ ముఠాలో నలుగురి అరెస్టు
తాజాగా.. వీరి నుంచి డ్రగ్స్‌ కొన్న మరో ఐదుగురు

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కొకైన్‌(పాత చిత్రం)

ఈనాడు, హైదరాబాద్‌: నైజీరియన్‌ నెట్‌వర్క్‌తో రాజధానిలో నడిపిస్తున్న కొకైన్‌ మాఫియా డొంక కదులుతోంది. ఈ ఏడాది మే తొలివారంలో మాదాపూర్‌ ఎస్‌వోటీ, రాయదుర్గం పోలీసులకు చిక్కిన ముఠాతో లింకులున్న మరో ఐదుగురు గురువారం అరెస్టయ్యారు. గచ్చిబౌలిలోని ఇన్ఫినిటీ డ్రైవ్‌ ఇన్‌ యజమాని వెలగపూడి రఘుతేజ, బాలకృష్ణ, రతన్‌, మహదేవ్‌ కృష్ణ, సంస్కృత్‌లను మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.

ఈ ఏడాది మే 6న నైజీరియన్లతో సంబంధాలున్న కొకైన్‌ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి నుంచి రూ.1.33 కోట్ల విలువైన 303 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన చింత రాకేశ్‌ రోషన్‌, గజ్జల శ్రీనివాస్‌రెడ్డి నుంచి తాజాగా అరెస్టయిన ఐదుగురు గతంలో కొకైన్‌ కొనుగోలు చేసి వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలు వినియోగం కింద కేసు నమోదు చేశారు.

ఈ ముగ్గురిదీ చీకటి దందా..!

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన చింత రాకేశ్‌ రోషన్‌ డ్రై ఫ్రూట్స్‌ వ్యాపారం చేసేవాడు. ఒకసారి గోవాలో వేడుకలో పాల్గొన్న అతడు కొకైన్‌ తీసుకున్నాడు. క్రమంగా దానికి బానిసయ్యాడు. గోవాలో ఉండే నైజీరియన్‌, డ్రగ్‌ నెట్‌వర్క్‌ కింగ్‌పిన్‌ పెటిట్‌ ఎబుజర్‌ అలియాస్‌ గాబ్రియెల్‌ నుంచి కొకైన్‌ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు కార్లు, బస్సుల్లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువధరకు విక్రయించేవాడు. ఈ క్రమంలోనే రాకేశ్‌కు.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన గజ్జల శ్రీనివాస్‌రెడ్డి(38) పరిచయమయ్యాడు. అప్పటికే హోటల్‌ వ్యాపారంలో నష్టపోయిన శ్రీనివాస్‌కు డ్రగ్స్‌ తీసుకునే అలవాటుంది. రాకేశ్‌ ప్రోద్బలంతో శ్రీనివాస్‌ కూడా కొకైన్‌ విక్రయించేవాడు. వీరిద్దరూ కలిసి స్విగ్గీ డెలివరీబాయ్‌, మణికొండలో నివాసముండే ఏపీలోని కాకినాడకు చెందిన శ్రీరంగం సూర్యప్రకాశ్‌ అలియాస్‌ డేవిడ్‌(26)ను కమీషన్‌ ఆశచూపి దందాలోకి దింపారు.

పట్టించిన ఫోన్‌ డేటా..!

ఐదేళ్లుగా నిందితులు నగరంలో కొకైన్‌ను విక్రయిస్తున్నారు. పూర్తిగా వాట్సప్‌ సంభాషణలు, కాల్స్‌ ద్వారా అవసరమున్న వారిని సంప్రదించి అమ్మేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా పార్టీలు నిర్వహించేవారు. మే 6న రాకేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌, నైజీరియన్‌ విక్టర్‌ను అరెస్టు చేశారు. నిందితుల ఫోన్లలోని వాట్సప్‌ కాల్‌డేటా, చాటింగ్‌ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ ఐదుగురు వీరి వద్దే కొకైన్‌ కొనుగోలు చేసినట్లు నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని