logo

పల్నాట సెపరేటు

మద్యం వల్ల మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.. తాగుడు వ్యసనం కాపురాల్లో చిచ్చురేపుతోంది.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం.

Updated : 09 Jun 2023 06:22 IST

సీసా ధర రూ.150 ఉంటే రూ.230 అమ్మకం
ప్రత్యేక వాహనాల్లో గ్రామీణ ప్రాంతాలకు తరలింపు
డిమాండ్‌ సృష్టించి విక్రయాలు
మద్యం  విక్రయాల్లో వైకాపా నేతల  దందా
ఈనాడు-నరసరావుపేట

2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా హామీ..

మద్యం వల్ల మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.. తాగుడు వ్యసనం కాపురాల్లో చిచ్చురేపుతోంది.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం. దీనివల్ల లక్షలాది కుటుంబాల్లో వెల కట్టలేని సంతోషం నింపుతాం..

అమలులో జరుగుతుందేంటీ?

ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచి విక్రయాలు చేస్తోంది. వైకాపా నేతల ఆధ్వర్యంలో గ్రామగ్రామాన బెల్టు దుకాణాలు తెరిచి అనధికారికంగా విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు వచ్చే మద్యాన్ని దారి మళ్లించి నేరుగా పల్లెల్లోని బెల్టుషాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం దొరకని పల్లె లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వైకాపా నేతలు మద్యం లభించకుండా చేసి వారు విక్రయించే బెల్టు దుకాణాల్లో నిర్ణయించిన ధరలు అమలు చేస్తున్నారు. ఇలా సరికొత్త దోపిడీకి తెరలేపారు.

సీసాపై రూ.80 అదనం

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణాలకు సరఫరా చేస్తున్న మద్యాన్ని అక్కడే విక్రయించాలి. ఇందుకు భిన్నంగా ఇక్కడి నుంచి మద్యాన్ని వైకాపా నేతలు తీసుకొని నేరుగా గ్రామాలకు తరలిస్తున్నారు. ఇందుకు పల్నాడులోని తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాలో ప్రజాప్రతినిధి కుటుంబసభ్యుడు ఒకరు ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేశారు. నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన మద్యాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నేత అనుచరులే ప్రత్యేక వాహనాల్లో తరలిస్తారు. గ్రామాల్లో వేలం నిర్వహించి ఎంపిక చేసిన వారికి మద్యం సరఫరా చేస్తారు. సదరు వ్యక్తి మరింత లాభం కలుపుకొని గ్రామంలో మద్యం ప్రియులకు విక్రయిస్తారు. ప్రభుత్వ దుకాణంలో రూ.150 ఉన్న మద్యం సీసా ధర కొనుగోలు చేసిన నేత రూ.50 కలుపుకుని రూ.200కు గ్రామాలకు సరఫరా చేస్తారు. అక్కడి వ్యాపారి మరో రూ.30 కలుపుకుని సీసా రూ.230 ధరకు అమ్ముతారు. ఈ లెక్కన ఒక్కొక్క మద్యం సీసాపై వినియోగదారుడు రూ.80 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఇదే మద్యాన్ని నియోజకవర్గ కేంద్రానికి వెళ్లినప్పుడు కొనుగోలు చేద్దామంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నిల్వలు లేవని, సర్వర్‌ పని చేయడం లేదని సాకులతో అమ్మడం లేదు. ప్రజాప్రతినిధి కుటుంబసభ్యుడు ఒకరు అంతా తానై నియోజకవర్గంలో మద్యం వ్యాపారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దోపిడీకి గురవుతున్న మద్యం ప్రియులు ఇంకెన్నాళ్లు దోచుకుంటారని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో నేత చెప్పిన ధరలే అమలవుతున్నాయి. ప్రభుత్వ దుకాణాలు లెక్క కోసం ఉన్నా సరకు మొత్తం నేత కనుసన్నల్లోనే విక్రయాలు చేయాల్సిన దుస్థితి. జరుగుతున్న అక్రమాలు చూసిన కొందరు అధికారులు తాము ఇక్కడ పని చేయలేమని సెలవుపై వెళ్లిపోయారంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 


మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండే 8పీఎం, రాయల్‌గ్రీన్‌, మ్యాన్షన్‌హౌస్‌, క్లాసిక్‌ వంటివి ప్రభుత్వ దుకాణాల్లో నిల్వలు ఉండటం లేదు. ఇవి కావాలంటే పట్టణ శివారు గ్రామాల్లో అనధికార బెల్టు దుకాణాలు లేదా బార్లకు వెళ్లాల్సిందే. అక్కడికి వెళితే గరిష్ఠ చిల్లర ధర కంటే ఒక్కొక్క బాటిల్‌పై రూ.60 నుంచి రూ.80 అదనంగా వెచ్చించాలి. ఇవి రూ.150 నుంచి రూ.226 వరకు ఉండగా అన్ని బ్రాండ్లకు అధిక ధర వెచ్చించాల్సిందే. ప్రభుత్వ దుకాణాలకు వచ్చిన మద్యాన్ని పక్కదారి పట్టించి అధిక ధరకు విక్రయాలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం తాగి వినియోగదారుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇలా పెద్దఎత్తున దోపిడీ జరుగుతున్నా సెబ్‌ అధికారులు అరికట్టడంలో విఫలమవుతున్నారు. సారాయి విక్రయాలను మాత్రం కట్టడి చేసి మద్యం విక్రయాలు పెరిగేలా చూస్తున్న యంత్రాంగం అనధికార బెల్టు దుకాణాలు, ప్రభుత్వ దుకాణాల నుంచి పక్కదారి పడుతున్న మద్యాన్ని నివారించడంలో శ్రద్ధ చూపడం లేదు. అధికారమే అండగా స్థానిక నేత మద్యం విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తూ నాలుగేళ్లలో రూ.కోట్లు దండుకుంటున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని