logo

కదలవు.. మెదలవు

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా ‘యునెడో’ ఆర్థిక సహకారంతో గుంటూరు నగరపాలక సంస్థ సమకూర్చుకున్న ఈ-ఆటోల్లో కొన్నింటికి ఎలుకలు వైర్లు కొరికేశాయి.

Updated : 10 Jun 2023 06:47 IST

ఈ-ఆటోల్లో ఛార్జింగ్‌ డౌన్‌
కొన్నింటికి వైర్లు కొరికేసిన ఎలుకలు
సీఎం ప్రారంభించినా రోడ్డెక్కని వైనం

గుంటూరు కార్పొరేషన్‌ షెడ్‌లో ఈ-ఆటోలు (పాతచిత్రం)

ఈనాడు, అమరావతి: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా ‘యునెడో’ ఆర్థిక సహకారంతో గుంటూరు నగరపాలక సంస్థ సమకూర్చుకున్న ఈ-ఆటోల్లో కొన్నింటికి ఎలుకలు వైర్లు కొరికేశాయి. మరికొన్ని వాహనాలకు ఛార్జింగ్‌ డౌన్‌ అవుతోంది. ఈ సమస్యలతో అవి ఇప్పటికీ రోడ్డెక్కలేదు. కేవీపీ కాలనీలోని వెహికిల్‌ షెడ్‌లో ఉంచి వాటికి మరమ్మతులు చేస్తున్నారు. నెలల తరబడి ఆ వాహనాలు వినియోగించకుండా, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆరుబయట పెట్టడంతో అవి వర్షానికి తడిసి, ఎండకు ఎండడం వంటి సమస్యలతో ప్రస్తుతం మొరాయిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఈ స్థితిలో ఉన్న వాటిని రెండు, మూడు రోజులు పూర్తిగా పరిశీలించాకే వినియోగంలోకి తేవాలనే యోచనలో నగరపాలక వర్గాలు ఉన్నాయి.

విశాఖ నుంచి వచ్చిన మెకానిక్‌లు

ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద వాటిని జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత కూడా అవి అందుబాటులోకి రాలేదంటే చాలా వాహనాలకు వైర్లు కొరికేయడం, మరికొన్నింటికి బ్యాటరీలు పాడైపోవడం ఇంకొన్నింటికి అసలు ఛార్జింగ్‌ ఎక్కకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఈ సమస్యలతో మొరాయిస్తున్న వాహనాలకు వెంటనే మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని వాటి సరఫరాదారును కోరారు. దీంతో విశాఖపట్నం నుంచి మెకానిక్‌లను పిలిపించి రెండు రోజులుగా మరమ్మతులు చేయిస్తున్నారు.

నిర్లక్ష్యంతోనే పాడయ్యాయి...

బాగా దుమ్ము, ధూళి కొట్టుకుపోవడం వంటివి కూడా కొన్నింటికి ఛార్జింగ్‌ ఎక్కకపోవడానికి కారణంగా విశ్లేషించారు. బ్యాటరీ సహాయంతో నడిచే ఎలక్ట్రికల్‌ వాహనాలను ఆరుబయట ఎక్కువ రోజులు ఉంచకూడదు. దీని వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. ఎండలకు ఫ్యూజులు సైతం పోతాయని చెబుతున్నారు. ఒక వాహనానికి ఛార్జింగ్‌ పూర్తికావాలంటే కనీసం 4గంటల పాటు పెట్టాలి. సాకెట్‌లో తేడాలు ఉన్నా ఛార్జింగ్‌ కాదు. ఇవి చాలా సున్నితమైన వాహనాలు కావడంతో వాటిని అన్ని పక్కాగా చెక్‌ చేసుకుని ట్రయల్‌ రన్‌ అనంతరం సచివాలయాలకు పంపాలనే యోచనలో అధికారులు ఉన్నారు. వాస్తవానికి సీఎం ప్రారంభించిన మరుసటి రోజే సచివాలయాలకు తరలించి ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో వాటిని ప్రారంభించాలని అనుకున్నారు. తీరా చాలా వాహనాలు పనిచేయకపోవడం వంటివి గుర్తించి చివరకు సచివాలయాలకు కూడా పంపకుండా వెహికల్‌ షెడ్‌లోనే పెట్టి మరమ్మతులు చేయిస్తున్నారు. ఏ వాహనం ఎప్పుడు మొరాయిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

నగరపాలక సంస్థ నిర్వాకంతో...

ప్రస్తుతం చెత్త తరలింపు అంతా ట్రాక్టర్లు, లారీల ద్వారా నాయుడుపేటలోని డంపింగ్‌ యార్డుకు పంపుతున్నారు. అవి అన్నీ కూడా ఇంధనంతో నడిచే వాహనాలు కావడంతో వాటికి నెలకు రూ.50 లక్షల దాకా అవుతోంది. నగరంలో 207 సచివాలయాల పరిధిలో ఈ-ఆటోలు వినియోగంలోకి వస్తే కనీసం రూ.15లక్షలకు పైగా ఇంధన వ్యయాల రూపేణా ఆదా అయ్యేది. గడిచిన ఆరేడు నెలల నుంచి సీఎంతో వాటిని ప్రారంభించాలని చెప్పి పక్కన పెట్టి ఉంచడంతోనే కొన్ని వాహనాలకు బ్యాటరీలు సైతం పాడైపోయాయి. ప్రస్తుతం వారంటీ పీరియడ్‌లో ఉండడంతో ఏం పాడైపోయినా కంపెనీ భరిస్తుందని, వాటి వల్ల నగరపాలకకు ఎలాంటిభారం పడదని ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి. ఈ వాహనాలకు రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయించి సచివాలయాలకు కేటాయిస్తామని, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే టెక్నీషియన్‌ను సంప్రదించడానికి ఫోన్‌ నంబర్లు, వారి అడ్రస్‌లు, బ్యాటరీ ఛార్జింగ్‌ స్టేషన్‌ వివరాలు తెలియజేస్తామని వివరించారు. ఇతర ప్రాంతాలకు చెందిన పురపాలికల ఆటోలు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే ఆయా పురపాలికలకు తీసుకెళ్లాలని కోరినట్లు అధికారులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని