logo

పెట్రోల్‌ పోయించుకొని పరార్‌

మీ కారులో రూ.3 వేలు పెట్రోలు పోయించుకుని డబ్బుకట్టకుండా వెళ్లిపోయినందుకు మీపై కేసు నమోదు చేస్తున్నాం.

Published : 10 Jun 2023 05:03 IST

కారులో ఇంధనం నింపుతున్న బంకు సిబ్బంది

దుగ్గిరాల, న్యూస్‌టుడే: ‘మీ కారులో రూ.3 వేలు పెట్రోలు పోయించుకుని డబ్బుకట్టకుండా వెళ్లిపోయినందుకు మీపై కేసు నమోదు చేస్తున్నాం.’ అంటూ తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ సమీపంలోని మాదుగులపల్లె ఠాణా నుంచి ఫోన్‌ రావడంతో దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరుకు చెందిన కె.ఎస్‌.ఎన్‌.మల్లేశ్వరరావు అవాక్కయ్యారు. పోలీసుల నుంచి విషయం ఆసాంతం విని మల్లేశ్వరరావు సమాధానమివ్వడంతో పోలీసులు నివ్వెరపోయారు. వివరాలలోకి వెళితే మాదుగులపల్లె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న పెట్రోల్‌ బంకులో గురువారం ‘ఏపీ07డివై 7496’ నంబరున్న కారులో వచ్చిన వ్యక్తి రూ.3 వేలు విలువైన పెట్రోల్‌ పోయించుకుని డబ్బు చెల్లించకుండా పరారయ్యారు. దీనిపై పెట్రోల్‌ బంక్‌ యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబరును ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే మల్లేశ్వరరావు పేరుతో ఉంది. దీంతో పోలీసులు ఆయనకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ఆ నంబరు తన పొక్లయినర్‌దని, తన కారు నంబరు వేరని మల్లేశ్వరరావు సమాధానమిచ్చారు. పొక్లయినర్‌ నంబరును కారుకు వేసుకుని సదరు వ్యక్తి తిరుగుతున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని మల్లేశ్వరరావు శుక్రవారం దుగ్గిరాల ఎస్సైతో పాటు గుంటూరు ఎస్పీకి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు