logo

ఉలిక్కిపడిన గుంటూరు

చినపలకలూరులో స్నేహితుల మధ్య మద్యం మత్తులో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో గుంటూరు నాయుడుపేటకు చెందిన పగడాల వెంకటేష్‌ (23) మృతి చెందాడు.

Updated : 10 Jun 2023 06:46 IST

ఒకే రోజు రెండు హత్యలు
నల్లచెరువులో మహిళ...

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గుంటూరు నగరంలోని లాలాపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. నిందితుడు ఆమెను కత్తితో కిరాతంగా హతమార్చి, దర్జాగా చొక్కా మార్చుకొని అక్కడి పరారైనట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆత్మకూరు వాసి భారతీబాయ్‌ (43) తన భర్తతో మనస్పర్థల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం గుంటూరుకు వచ్చి దాసరిపాలెంలో ఉంటూ, మిర్చియార్డు వద్ద మిరప తొడిమలు తీసుకుంటూ జీవనం సాగించేవారు. కొన్ని నెలల క్రితం నల్లచెరువుకు మారారు. అక్కడ ఇంటిని అద్దెకు తీసుకొని కొడుకుతో ఉంటున్నారు. మిర్చియార్డు వద్ద పరిచయమైన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం కూలి పనికి వెళ్లిన కొడుకు సాయంత్రం ఇంటికి వచ్చారు. తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తూర్పు ఏఎస్పీ షల్కే, లాలాపేట సీఐ సుబ్బారావు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి ముఖం, చేతులు, మెడపై కత్తి పోట్లు ఉండటంతో కిరాతకంగా హతమార్చినట్లు భావిస్తున్నారు. నిందితుడు ఆమెను కత్తితో పొడిచే క్రమంలో చొక్కాపై రక్తపు మరకలు పడటంతో దాన్ని అక్కడే వదిలేసి, మరొకటి వేసుకొని వెళ్లిపోయినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేశారా వేరే కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆమెతో సహజీనం చేసిన వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.


మద్యం మత్తులోదారుణం

యువకుడి మృతదేహాన్ని పరిశీలిస్తూ..

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: చినపలకలూరులో స్నేహితుల మధ్య మద్యం మత్తులో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో గుంటూరు నాయుడుపేటకు చెందిన పగడాల వెంకటేష్‌ (23) మృతి చెందాడు. దీనికి సంబంధించి నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం.. వెంకటేష్‌, రమేష్‌, కార్తీక్‌, మునాఫ్‌ పనులు చేసుకుంటూ, రాజకీయ పార్టీల ర్యాలీలకు, కార్యక్రమాలకు వెళ్తుంటారు. నలుగురు కలిసి మద్యం తాగేందుకు చినపలకలూరు గ్రామ శివార్లలోకి వెళ్లారు. మద్యం తాగే క్రమంలో వెంకటేష్‌ మీ వెంట వస్తున్నా కదా.. డబ్బు ఇవ్వమని రమేష్‌ను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది పెరిగి పెద్దదై ఘర్షణకు దారి తీసింది. వెంకటేష్‌ తన వద్ద ఉన్న బీరు సీసా పగులగొట్టి రమేష్‌ కాలిపై పొడిచాడు. దీనికి రెచ్చిపోయిన రమేష్‌ కూడా బీరు సీసాను పగులగొట్టి వెంకటేష్‌పై దాడి చేశాడు. వెంకటేష్‌ తిరగబడటంతో రమేష్‌తో పాటు కార్తీక్‌, మునాఫ్‌ ముగ్గురు కలిసి దాడి చేశారు. గాయాలపాలైన వెంకటేష్‌ అక్కడకికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకటేష్‌ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు