logo

ఇసుకాసురుల.. కాసుల వేట

తీర గ్రామాల్లో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. జేసీబీలు, పొక్లెయిన్లతో పచ్చని పొలాలకు తూట్లు పొడుస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది

Published : 10 Jun 2023 05:08 IST

చెరువులుగా మారుతున్న పంట భూములు
అడ్డగోలు తవ్వకాలకు అధికార పార్టీ నాయకుల వత్తాసు
కర్లపాలెం, న్యూస్‌టుడే

చెరువుగా మారిన పొలం 

తీర గ్రామాల్లో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. జేసీబీలు, పొక్లెయిన్లతో పచ్చని పొలాలకు తూట్లు పొడుస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. వ్యవసాయ భూముల్లో మెరక తీసే పేరిట నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వేస్తూ జేబులు నింపుకొంటున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కొందరు ఇసుక తరలింపును లాభసాటి వ్యాపారంగా మార్చుకొని రూ.లక్షలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

తీర ప్రాంతంలోనున్న కర్లపాలెం మండల పరిధిలో వేల ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయి. ఆయా భూములపై ఇసుక మాఫియా కన్ను పడింది. వీరు ముందుగా ఆయా భూ యజమానులకు కొంత సొమ్ము చెల్లించి భూములను హస్తగతం చేసుకొని ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు ఇసుకను బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోరు. ఇష్టానుసారం తవ్వేసి సొమ్ము చేసుకుంటూ రూ.లక్షల్లో ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు. గణపవరంలో ఇసుక తరలింపునకు అనుమతులు తీసుకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారు. పలుచోట్ల అక్రమ తవ్వకాలకు అడ్డువచ్చే వారికి ముడుపులు ఇస్తూ అక్రమాలకు ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు.

బాహాటంగానే తరలింపు

మండలంలోని గణపవరం, పెదగొల్లపాలెం, నల్లమోతువారిపాలెం, పాతనందాయపాలెం, పేరలిపాడు, యాజలి, బుద్దాం గ్రామ పంచాయతీల పరిధిలోని శివారు గ్రామాల్లో పంట పొలాల్లో జేసీబీలు, పొక్లెయిన్లతో ఇసుక, మట్టిని తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. సీనరేజీ రూపంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.లక్షల ఆదాయానికి గండికొడుతున్నారు. మరీ ముఖ్యంగా గణపవరం, పెదగొల్లపాలెం పంచాయతీల పరిధిలోని పంట పొలాల్లో లోతుగా తవ్వకాలు జరిపి చెరువులుగా మారుస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక, మట్టి అక్రమ రవాణా ప్రభుత్వ కార్యాలయాల ముందు నుంచే సాగుతుండటం గమనార్హం. కనీసం పట్టాలు సైతం కప్పకుండా బాహాటంగా ఈ దందా నిరాటంకంగా సాగుతోంది. టిప్పర్లు, ట్రాక్టర్లతో కళ్ల ముందే అక్రమ రవాణా జరుగుతున్నా.. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఛిద్రమవుతున్నరహదారులు

భారీ వాహనాలపై ఇసుక, మట్టిని తరలిస్తుండటంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న గ్రామీణ రహదారులు మరింత ద్రమవుతున్నాయి. రాకపోకలు సాగించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. దుమ్ము రేగడం, రోడ్లపై మట్టిపడి అధ్వానంగా తయారవుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా మట్టి బురదగా మారి ప్రమాదాల బారినపడుతున్నట్లు ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకొని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కర్లపాలెం తహశీల్దారు కేశవనారాయణరావు పేర్కొన్నారు. తాజాగా ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే, మట్టి, ఇసుకను తరలించాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని