మేం బాధితులమా..? నిందితులమా..?
ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా ఫలితం ఏముందని, అసలు మేం బాధితులమా..? నిందితులమా..? అని ఆయేషామీరా తల్లిదండ్రులు షంషాద్‌బేగం, సయ్యద్ ఇక్బాల్‌బాషా సీబీఐ అదికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
సీబీఐ అధికారుల వద్ద ఆయేషా మీరా తల్లిదండ్రుల ఆవేదన
ఇంటికి వస్తున్న సీబీఐ అధికారులు
తెనాలి టౌన్: ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా ఫలితం ఏముందని, అసలు మేం బాధితులమా..? నిందితులమా..? అని ఆయేషామీరా తల్లిదండ్రులు షంషాద్‌బేగం, సయ్యద్ ఇక్బాల్‌బాషా సీబీఐ అదికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణ నిమిత్తం అధికారులు ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని వారి ఇంటికి వచ్చి సుమారు మూడు గంటల పాటు మాట్లాడి వెళ్లారు. అనంతరం తల్లిదండ్రులు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీబీఐ అదనపు ఎస్పీ సీ.ఆర్.దాసు, మరో ఇద్దరు సిబ్బంది తమ స్టేట్మెంట్ నమోదుకు వచ్చారని, తాము రాత పూర్వక స్టేట్మెంట్లు గతంలోనే ఇచ్చి ఉన్నందున ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏమీ లేదని తెలిపి, ఆ నాటి ఘటన సమాచారం మాత్రం వివరించామన్నారు. ఘటన జరిగిన వసతిగృహానికి సంబంధించిన వారిని, అప్పట్లో దర్యాప్తు చేసిన పోలీసులను సమగ్రంగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కానీ నేటి వరకు తాము అనుమానం వ్యక్తం చేసిన వారిని సైతం విచారించలేదన్న విషయాన్ని అధికారులకు తెలియజేశామన్నారు. 2019లో రీపోస్టుమార్టం కోసం సేకరించిన ఎముకలను తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన అధికారులు నేటి వరకు దాని గురించి మాట్లాడలేదని, తాము పలుమార్లు తమ వద్ద ఉన్న నంబరుకు ఫోన్ చేయగా కేసు విశాఖ సీబీఐకి బదిలీ అయిందన్నారని, ఇప్పడు అధికారులు అక్కడి నుంచే వచ్చారన్నారు. 2007, డిసెంబరు 27న మా అమ్మాయి ప్రాణాలను బలవంతంగా తీసిన నాటి నుంచి విచారణ పేరిట సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఎలాంటి ఫలితం లేకపోవటంతో తమకు విచారణ మీదే నమ్మకం పోయిందని, కేసులో ఒక్క ముందడుగు పడినా మేమే మీ కార్యాలయానికి వచ్చి స్టేట్మెంట్ ఇస్తామని అధికారులకు చెప్పినట్లు వివరించారు. కాగా, సీబీఐ అధికారులు ఇంట్లోకి వెళ్లాక తలుపులు మూసివేసి బాధిత కుటుంబంతో మాట్లాడారు. తొలుత న్యాయవాది శ్రీనివాస్ అధికారులతో కొద్ది నిమిషాలు మాట్లాడారు.
వివరాలు తెలియజేస్తున్న షంషాద్‌బేగం, ఇక్బాల్‌బాషా
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.