logo

19న విచారణకు హాజరు కావాలని కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు

తమ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతూ గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరిని మంగళవారం విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

Updated : 18 Sep 2023 06:14 IST

ఈనాడు-అమరావతి: తమ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతూ గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరిని మంగళవారం విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు రెండు రోజుల క్రితం నగరపాలక సంస్థకు అందాయి. దీనిపై ఏం సమాధానం చెప్పాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే సుద్దపల్లి డొంకలో సుమారు 900 గజాల స్థలంపై ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం నడుస్తోంది. వారిద్దరూ గతంలోనే సదరు ఆస్తి తనదంటే తనదని వారి వద్ద ఉన్న పత్రాలతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. వారి దస్తావేజులను పరిశీలించిన న్యాయస్థానం ఒకరి వద్ద ఒరిజనల్‌ డాక్యుమెంట్లు ఉండగా మరొకరి వద్ద ఉన్నవి నకిలీవి అని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు కలిగిన వ్యక్తి పేరిటే ఆస్తి పన్ను విధించాలని కోర్టు ఆదేశించింది. అందుకు భిన్నంగా నకిలీ డాక్యుమెంట్లు కలిగిన వ్యక్తికి ఆస్తి పన్ను వేయడంతో ఒరిజనల్‌ డాక్యుమెంట్లు కలిగిన వ్యక్తి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు గతంలోనే ఈ స్థలం విషయమై ఎవరు హక్కుదారులో తేల్చి పన్ను ఎవరికి విధించాలో కూడా సూచించామని దాన్ని అమలు చేయకుండా నగరపాలక సంస్థ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఈ విషయంలో నేరుగా తమ ముందు విచారణకు హాజరు కావాలని కమిషనర్‌ను ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధిత ఆస్తికి అసెస్సుమెంటు నంబరు కేటాయింపు, ఆస్తి పన్ను విధింపులో ప్రణాళిక, రెవెన్యూ విభాగాలకు చెందిన ఉద్యోగులతో పాటు కొందరు అధికారులు భారీగా లంచాలు పుచ్చుకుని నకిలీ డాక్యుమెంట్లు కలిగిన వ్యక్తికి ఆస్తి పన్ను విధించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని వెనక రూ.లక్షలు చేతులు మారాయని వినికిడి. చిన్నేరుకుంటలోనూ ఏడాదిన్నర క్రితం ఇలానే ఓ ఖాళీస్ధలానికి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన వ్యక్తికి ఆస్తి పన్ను విధించారని దానిలో ఓ ఆర్వోపాత్ర ఉందని ఆయన ఇప్పుడు రెవెన్యూ విభాగంలో లేరని చెబుతున్నారు. దీనిపైనా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
* వాస్తవానికి సుద్దపల్లిడొంకలో నకిలీ డాక్యుమెంట్‌ కలిగిన వ్యక్తికి కేటాయించిన అస్సెస్‌మెంట్‌ నంబరును కౌన్సిల్‌లో పెట్టి రద్దు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపితే సమస్య ఉండేది కాదు. అధికారులు సంబంధిత ఆస్తికి ఖాళీ స్థలానికి బదులు అందులో భవనాలు ఉన్నట్లు ఆస్తి పన్ను విధించారు. హైకోర్టు కమిషనర్‌ను వ్యక్తిగత విచారణకు పిలవడంతో ఏమి సమాధానం చెప్పాలా అని అధికారుల్లో కలవరం మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు