logo

పంచాయతీరాజ్‌ సంస్థల్లో ఆన్‌లైన్‌లోనూ ఆడిట్‌ నిర్వహణ

ఏపీ పంచాయతీరాజ్‌ సంస్థల్లో వార్షిక ఆడిట్‌ని మాన్యువల్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆడిట్‌ శాఖ సంచాలకులు ఆమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 24 Sep 2023 06:03 IST

గడువు లోపు క్లెయిమ్స్‌ పరిష్కరించుకోవాల్సిందే

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఏపీ పంచాయతీరాజ్‌ సంస్థల్లో వార్షిక ఆడిట్‌ని మాన్యువల్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆడిట్‌ శాఖ సంచాలకులు ఆమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌ ఆడిట్‌ని అక్టోబరు 31 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ (ఏటీఆర్‌) మాడ్యూల్‌ను నూతనంగా ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తుల నిధుల వ్యయానికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఆడిట్‌ చేస్తారు. జిల్లా ఆడిట్‌ శాఖ అధికారులు, సిబ్బంది దీనిపై శిక్షణ పొందారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులకు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రికార్డులను తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే రికార్డులను కూడా అప్‌లోడ్‌ చేయాలని సూచిస్తారు. పంచాయతీ కార్యదర్శులు ఆన్‌లైన్‌లో రికార్డులు నమోదు చేసిన తర్వాత ఆడిట్‌ శాఖ అధికారులు వాటిని పరిశీలన చేయనున్నారు. చివరగా అభ్యంతరాలను నమోదు చేసి వారికి పంపుతారు. ఆడిట్‌ క్లెయిమ్స్‌ని 2024 మార్చి 31 లోపు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఆడిట్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధుల వ్యయానికి సంబంధించి ఈ-గ్రామ్‌ స్వరాజ్‌ వెబ్‌సైట్‌లో విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆడిట్‌ అధికారులు వెబ్‌సైట్‌లో వివరాలు పరిశీలించి సరిగా ఉంటే అవును, వివరాలు నమోదు చేయకుంటే కాదు అని చెక్‌లిస్ట్‌లో నమోదు చేస్తారు. గతంలో ఆడిట్‌ అభ్యంతరాలను పరిష్కరించుకోవడానికి నిర్ణీత గడువు అంటూ లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించే వారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రం విధిగా గడువు లోపు అభ్యంతరాలకు వివరణ ఇచ్చి రద్దు చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆడిట్‌ శాఖ గ్రామ పంచాయతీలో నిధుల వ్యయం, అభ్యంతరాలను గ్రామసభలో...మండల పరిషత్తులు, జిల్లాపరిషత్తు వివరాలు సర్వసభ్య సమావేశంలో చదివి వినిపిస్తారు. దీనివలన అధికారుల పనితీరు, విధుల్లో నిర్లక్ష్యం, నిధుల వ్యయం చేయడంలో నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా తెలియజేస్తారు. తద్వారా బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని