logo

విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల వసూలు అన్యాయం

గతంలో కంటే కరెంటు వాడకంలో పెద్దగా మార్పు లేకున్నా సర్దుబాటు ఛార్జీ(ట్రూఆప్‌) పేరుతో వినియోగదారులపై కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం వేసిందని గుంటూరు నగర విద్యుత్తు వినియోగదారుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు సయ్యద్‌ ఆదాం సాహెబ్‌ తెలిపారు.

Published : 24 Sep 2023 05:43 IST

ఫిర్యాదులు స్వీకరిస్తున్న విక్టర్‌ ఇమ్మానుయేల్‌, పక్కన మురళీకృష్ణ యాదవ్‌, వెంకటకృష్ణ  '

గుంటూరు విద్యుత్తు, న్యూస్‌టుడే: గతంలో కంటే కరెంటు వాడకంలో పెద్దగా మార్పు లేకున్నా సర్దుబాటు ఛార్జీ(ట్రూఆప్‌) పేరుతో వినియోగదారులపై కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం వేసిందని గుంటూరు నగర విద్యుత్తు వినియోగదారుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు సయ్యద్‌ ఆదాం సాహెబ్‌ తెలిపారు. విద్యుత్తు భవన్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక విద్యుత్తు అదాలత్‌లో ఆదాంసాహెబ్‌ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో విద్యుత్తు సరఫరా వ్యయం, వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూఆప్‌ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేయడం అన్యాయమన్నారు. అంతేగాకుండా విద్యుత్తు బిల్లులో వేర్వేరు సుంకాల పేరుతో చేస్తున్న వసూళ్లు ప్రజలు భరించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగది ఉంటేనే నూతన సర్వీసు మంజూరు చేస్తామని డిస్కం అధికారులు పెట్టిన నిబంధనతో పేదలకు ఇబ్బందిగా మారిందన్నారు. దీనిపై సెంట్రల్‌ డిస్కం విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఛైర్‌పర్సన్‌ ఎన్‌.విక్టర్‌ ఇమ్మానుయేల్‌ (పూర్వ జిల్లా న్యాయమూర్తి) మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) అనుమతించిన మేరకే విద్యుత్తు సంస్థలు ట్రూఆప్‌ పేరుతో వసూలు చేస్తున్నాయన్నారు. సదస్సులో మీరిచ్చిన ఫిర్యాదును ఏపీఈఆర్‌సీ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.  

మానవత్వం ఉండాలి.. దుగ్గిరాలకు చెందిన సత్యవతికి 19 ఏళ్ల వెనుక నుంచి లెక్కించి బిల్లు వేశారని సదస్సులో వచ్చిన ఫిర్యాదుపై విక్టర్‌ ఇమ్మానుయేల్‌ మాట్లాడుతూ అధికారులు ఎలా పడితే అలా బిల్లులు తయారు చేయకుండా మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. కొంతమంది వినియోగదారులు తమకు అదనంగా బిల్లులు వచ్చాయని ఫిర్యాదు చేయగా వెంటనే విచారణ చేసి వారికి న్యాయం చేయాలని సూచించారు. చట్ట పరిధిలో వచ్చే అన్ని ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. ప్రాథమిక ఆధారాలుంటే వెంటనే ఉత్తర్వులిస్తామన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు కె.వెంకటకృష్ణ, ఎం.సునీత, ఎస్‌ఈ మురళీకృష్ణయాదవ్‌, ఈఈ శ్రీనివాసబాబుతోపాటు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు లక్ష్మీనారాయణ, జోగారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని