logo

వైకాపా ప్రభుత్వానికి బీసీల దెబ్బ రుచి చూపించాలి

బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నైపుణ్య శిక్షణ కోసం సీమెన్స్‌ ప్రాజెక్టు పని చేయడమే తప్పుగా మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టారని, నిజం నిప్పులాంటిదని ఆయనను బయటకు తెస్తామని మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత కొల్లు రవీంద్ర అన్నారు.

Published : 24 Sep 2023 05:52 IST

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మాట్లాడుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

వినుకొండ: బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నైపుణ్య శిక్షణ కోసం సీమెన్స్‌ ప్రాజెక్టు పని చేయడమే తప్పుగా మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టారని, నిజం నిప్పులాంటిదని ఆయనను బయటకు తెస్తామని మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత కొల్లు రవీంద్ర అన్నారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా శనివారం పల్నాడు జిల్లా వినుకొండలోని అరుణ థియేటర్‌ వద్ద ఆ పార్టీ బీసీ నాయకులు చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ జరిగిన అన్యాయాన్ని ప్రతి గుండెకు తాకేలా చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. నాడు మంత్రివర్గం చేసిన తీర్మానం మేరకు అధికారులు కార్యక్రమాన్ని అమలు చేస్తే సీఎం జగన్‌ కొంతమంది సీఐడీ అధికారులతో కలిసి కుట్రపూరితంగా చంద్రబాబును బాధ్యులను చేశారన్నారు. ఇందులో 2.13లక్షల మంది విద్యార్థులు శిక్షణ తీసుకొని 75వేల మంది అప్పుడే ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగాలు పొందిన విషయం వారికి కనిపించదన్నారు. వైకాపా ప్రభుత్వం తనపై హత్యకేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్‌జైలుకు పంపిందని, ఇప్పుడు చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌లో 54 రోజులు ఉన్నానని అక్కడ బాత్‌రూంకు వెళ్లాలంటే మెట్లెక్కాలని 74 ఏళ్ల వయసులో పెద్దాయన ఇబ్బంది పడతాడేమోనని భయంతో రాత్రులు నిద్రపట్టడం లేదన్నారు.  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయనకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక సామాన్యులకు ఉంటుందా అని ప్రశ్నించారు.  ఈ ప్రభుత్వానికి బీసీల దెబ్బ రుచి చూపించాలని కోరారు. తెదేపా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, బీసీసెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధులు సైదారావు, బత్తుల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల గోవిందరాజులు,  తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని