logo

ఓపీ చీటీకి నిరీక్షణే..!

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వచ్చే రోగులు ఓపీ చీటీ పొందేందుకు క్యూ లైన్లో చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఆసుపత్రిలో అవసరమైన కౌంటర్లు లేకపోవడమే ఇందుకు కారణం.

Updated : 24 Sep 2023 06:02 IST

రోగులకు సరిపడా కౌంటర్లు లేవు
జీజీహెచ్‌లో ఇదీ పరిస్థితి

బారులు తీరిన రోగులు

ఈనాడు-అమరావతి: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వచ్చే రోగులు ఓపీ చీటీ పొందేందుకు క్యూ లైన్లో చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఆసుపత్రిలో అవసరమైన కౌంటర్లు లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం స్త్రీ, పురుషులకు కలిపి 8 కౌంటర్లు ఉన్నాయి. ఇవి వేర్వేరుగా ఉన్నా జనాల రద్దీ దృష్ట్యా మహిళల కౌంటర్లలోకి మగవాళ్లు, పురుషుల దానిలోకి స్త్రీలు చొచ్చుకెళ్లి సాధ్యమైనంత త్వరగా ఓపీ చీటీ పొంది వైద్యులకు చూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. తీవ్ర అనారోగ్యం పాలై నిలబడే పరిస్థితి లేని రోగుల్లో కొందరు క్యూలైన్ల వద్ద రద్దీ చూసి వెనుదిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. గత్యంతరం లేని వాళ్లు తమ వంతు వచ్చే వరకు ఓపిగ్గా నిలబడుతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు బోధనాసుపత్రి రిఫరల్‌ ఆసుపత్రిగా మారి సేవలు అందిస్తోంది. వివిధ  ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడకు వస్తున్నారు. సగటున రోజుకు 2 వేల మంది వరకు ఓపీ కి వస్తున్నారు. ఇన్ని వేల మంది వచ్చే చోట కౌంటర్లు తక్కువగా ఉండటంతో ఉదయం 9-12 గంటల మధ్య ఏ సమయంలో చూసినా రోగులు కిక్కిరిసి ఉండడం నిత్యకృత్యమే. ఇప్పుడున్న వాటికి రెట్టింపు సంఖ్యలో ఏర్పాటు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు.  ప్రస్తుతం సగటున ఒక్కో రోగి ఆన్‌లైన్‌లో చీటీ తీసుకోవాలంటే కనీసం పావుగంటపైన పడుతోంది. అదే ఆఫ్‌లైన్‌ అయితే 5-10 నిమిషాలు వేచి చూడాల్సి వస్తోంది. ఓపీ బ్లాక్‌లో మధ్యాహ్నం వరకు ఓపీ ఉంటుంది. ఆ తర్వాత మిలీనియం బ్లాక్‌లో అత్యవసర రోగులకు మాత్రమే అక్కడ చీటీలు ఇస్తారు. ఇక్కడ కూడా కేవలం ఒక్క కౌంటర్‌ మాత్రమే ఉంది.

సమస్యను గుర్తించినా..

ఆసుపత్రిలో గతంలో శస్త్రచికిత్సల వైద్యునిగా పనిచేసిన డాక్టర్‌ ఏకుల కిరణ్‌కుమార్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించాక ఈ సమస్యను గుర్తించారు. ఓపీ బ్లాక్‌ వద్ద ఉన్న సైకిల్‌ స్టాండ్‌ ఆవరణలో మరికొన్ని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఇంత వరకు అందుబాటులోకి తేలేదు. దీనిపై ఆసుపత్రివర్గాలు మాట్లాడుతూ కొత్తగా 16 కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు అసౌకర్యం లేకుండా చూస్తామన్నారు.

డేటా ఏదీ?

ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఓపీ చీటీలు డిజిటలైజేషన్‌ చేశారు. ఎవరైనా తొలుత ఓపీ చీటీ పొందాలంటే వారి ఆధార్‌ నంబరు, ఫోన్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు కౌంటర్ల వద్ద ఉండే సిబ్బందికి తెలియజేయాలి. ఆ తర్వాత రోగి చరవాణికి ఓటీపీ నంబరు వస్తుంది. అది అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేస్తే వారు సదరు రోగికి చిన్న స్లిప్‌పై లేదా అతని చేతిపైనో ఒక నంబరు రాసి ఓపీ కౌంటర్‌లో ఉన్న సిబ్బందికి చెబితేనే ఓపీ రసీదు జనరేట్‌ చేస్తారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం విద్యార్థులకు చెందిన చరవాణుల్లోనే చేస్తున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌యాప్‌ను వారి ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేశారు. నర్సింగ్‌, ఫార్మసీ కళాశాలల విద్యార్థులు నిత్యం జీజీహెచ్‌కు శిక్షణ నిమిత్తం వస్తారు. వారికి చెందిన ఫోన్‌ డేటా నుంచే ఈ పనులు చేస్తున్నారు. ఆసుపత్రిలోఈ వివరాల నమోదుకు వైఫై ఉన్నా సాంకేతిక సమస్యలతో పనిచేయదు. దీంతో తమ డేటానే ఆ వివరాల నమోదుకు వినియోగిస్తున్నామని తమకు కనీసం డేటా కూడా వేయించే వెసులుబాటు చేయలేదని విద్యార్థులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు