logo

సడలని సంకల్పం..అలుపెరగని పోరాటం

పోలీసుల ఆంక్షలు.. నిర్బంధాలను దాటుకుంటూ తమ నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. జైలునుంచి త్వరగా విడుదల కావాలని ఆలయాలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు.

Published : 24 Sep 2023 06:21 IST

చంద్రబాబు అక్రమ అరెస్టుపై కొనసాగుతున్న దీక్షలు

ఈనాడు-అమరావతి: పోలీసుల ఆంక్షలు.. నిర్బంధాలను దాటుకుంటూ తమ నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. జైలునుంచి త్వరగా విడుదల కావాలని ఆలయాలు, మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. మహిళలు, రైతులు, బీసీలు, ఎస్సీలు, అభిమానులు  బాబుకు అండగా మేము అంటూ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. వరుసగా పదకొండో రోజైన శనివారం కూడా దీక్షలు కొనసాగాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను ఎండగట్టి రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని పార్టీ శ్రేణులు, అభిమానులు స్పష్టం చేశారు. తమ నేతను జైలుకు పంపితే నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని అడ్డుకున్న పోలీసులను తెదేపా కార్యకర్తలు ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా వెరవకుండా నిరసన దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించారు.

తాడికొండ : పొన్నెకల్లులో కొవ్వొత్తులతో మహిళల ర్యాలీ

తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో..

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో బాబుకు తోడుగా మేము సైతం రిలే నిరాహార దీక్షలు జరిగాయి. తెదేపా నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం తొమ్మిదో డివిజన్‌లోని ఓల్డ్‌క్లబ్‌ రోడ్డులో జరిగిన దీక్షల్లో గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జ్‌ మహమ్మద్‌ నసీర్‌, మంగళగిరిలో వాణిజ్య, టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. పొన్నూరులో ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద  తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో, తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో స్వరాజ్‌   థియేటర్‌ ప్రాంగణంలో తెదేపా నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.  తాడికొండ నియోజకవర్గంలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద తెలుగు మహిళల ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో ఇన్‌ఛార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌, ప్రత్తిపాడులో ఇన్‌ఛార్జి రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

తాడికొండ శిబిరంలో  తెనాలి శ్రావణ్‌కుమార్‌, నాయకులు


తాడికొండలో మరో చోట దీక్షా శిబిరం

తాడికొండ, న్యూస్‌టుడే: ‘శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మాపై దాడి చేశారు. ఎవరూ లేని సమయంలో ఏకంగా శిబిరాన్నే తొలగింపజేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు విడుదలయ్యే వరకు దీక్షలు కొనసాగిస్తాం’ అని తెదేపా జిల్లా ఇన్‌ఛార్జి తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి తాడికొండ అడ్డరోడ్డు సెంటర్‌ వద్ద శిబిరం ఏర్పాటు చేసి రిలే దీక్షలు చేస్తున్న విషయం విదితమే. శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు దాన్ని తొలగించారు. దీంతో శనివారం ఉదయం అడ్డరోడ్డు సెంటర్‌ పాత పెట్రోల్‌ బంక్‌ వద్ద నూతన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి తెదేపా నాయకులు నిరసనలు కొనసాగించారు. మండల, గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్ష నిర్వహించారు. మండలాధ్యక్షులు తలశిల ప్రసన్న కుమార్‌, ధనేకుల సుబ్బారావు, సీనియర్‌ నాయకులు కంచెర్ల శివరామయ్య, నూతలపాటి రామారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

పొన్నూరులో రైతులు, తెదేపా నేతలు


నేర చరిత్ర ఉన్న వారు పాలకులైతే ఇలానే ఉంటుంది

మంగళగిరి, తాడేపల్లి: నేర చరిత్ర కలిగిన వారు పాలకులైతే అందరినీ అదే దృష్టితో చూస్తారనడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డే ఉదాహరణని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళగిరిలో తెదేపా నిర్వహిస్తున్న  దీక్షలో నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన తెలుగు మహిళా నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. శిబిరాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. బాబుతో మేను సైతం అంటూ సంఘీభావం ప్రకటించారు. నాయకులు భూలక్ష్మి, ఆశాబాల, శ్రీఅనిత, వైష్ణవి, మౌనిక, సుజాత, మహాలక్ష్మి, దుర్గా మల్లేశ్వరి, కుసుమ, కృష్ణవందన, పద్మ, నూర్జహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి శిబిరంలో దీక్షలో ఉన్నవారికి నిమ్మరసం ఇస్తున్న తెలుగు మహిళా పార్లమెంటు అధ్యక్షురాలు జయలక్ష్మి, మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ రాజకుమారి

తెనాలి మండలం అంగలకుదురులో నిరాహార దీక్షలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు

మంగళగిరిలో నల్ల బెలూన్లతో తెలుగు మహిళల నిరసన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని